Begin typing your search above and press return to search.

ల‌వ్ ఎట్ ఫ‌స్ట్ సైట్ పై కంగన కామెంట్

ఈ నేప‌థ్యంలోనే ప్రేమ .. పెళ్లి వంటి జీవిత భాగస్వామ్య బంధాలపై తాజాగా అమ్మ‌డు చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాలలో పెద్ద చర్చకు దారితీశాయి.

By:  Srikanth Kontham   |   9 Jun 2026 3:00 PM IST
ల‌వ్ ఎట్ ఫ‌స్ట్ సైట్ పై కంగన కామెంట్
X

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ముక్కుసూటి త‌త్వం గురించి తెలిసిందే. సమాజం.. సినిమా లేదా వ్యక్తిగత విషయాలు ఏదైనా సరే? అమ్మ‌డు మనసులోని అభిప్రాయాలను నిర్మొహమాటంగా పంచుకుంటుంది. ఈ నేప‌థ్యంలోనే ప్రేమ .. పెళ్లి వంటి జీవిత భాగస్వామ్య బంధాలపై తాజాగా అమ్మ‌డు చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాలలో పెద్ద చర్చకు దారితీశాయి. సినిమాల్లో చూపించే `తొలిచూపు ప్రేమ` అనే భావనపై కంగనా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. నిజ జీవితంలో అలాంటివి జరగవని, అదంతా కేవలం ఒక భ్రమ ..అర్థరహితమైన విషయమని కొట్టిపారేశారు.

ఒకరి బాహ్య రూపాన్ని చూసి ప్రేమిస్తున్నామనుకోవడం సరికాదని.. నిజమైన అనుబంధం అనేది కాలక్రమేణా ఒకరినొకరు అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే బలపడుతుందని అభిప్రాయపడ్డారు. పెళ్లి .. జీవిత భాగస్వామిని ఎంచుకోవడం గురించి మాట్లాడారు. దీనిపై నేటి తరం యువతకు ఆమె ఓ విలువైన సలహా ఇచ్చారు. ఈ ప్రపంచంలో మనల్ని అర్థం చేసుకునే మనతో కలిసి నడిచే ఒక సరైన వ్యక్తి దొరకడం చాలా అరుదైన విషయమని పేర్కొన్నారు. ఒకవేళ అలాంటి వ్యక్తి మీ జీవితంలోకి వస్తే ఆ బంధాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలని.. దానికి తగిన విలువ ఇవ్వాలని సూచించారు.

సమకాలీన సమాజంలో బంధాలు చాలా త్వరగా ముక్కలైపోతున్న తరుణంలో పరస్పర గౌరవం.. సర్దుబాటు ధోరణి ఎంత ముఖ్యమో ఈ సంద‌ర్భంగా కంగనా గుర్తు చేశారు. ఏ బంధమైనా ఒక రోజులోనో ? ఒక చూపులోనే? శాశ్వతం కాదని ఇద్దరు వ్యక్తులు కలిసి ప్రయాణించే క్రమంలో చూపే ఓపిక, ఇచ్చే మద్దతుపైనే దాని మనుగడ ఆధారపడి ఉంటుందన్నారు. నైతిక విలువలు, నమ్మకం ఉన్నప్పుడే వైవాహిక జీవితం విజయవంతం అవుతుందన్నారు. సినీ ప్రపంచంలో లవ్ స్టోరీలను ఎంతో గ్లామరస్‌గా, అందంగా చూపిస్తారని కానీ వాస్తవ జీవితంలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంటాయన్నారు.

యువత కేవలం సినిమాల్లోని కాల్పనిక ప్రేమ కథలను చూసి భ్రమపడకుండా.. ప్రాక్టికల్‌గా ఆలోచించాలని కోరారు. భాగస్వాముల మధ్య ఉండే నిజాయితీ మాత్రమే సుదీర్ఘ ప్రయాణానికి పునాది వేస్తుందని తాను బ‌లంగా నమ్ముతా న‌న్నారు. నిత్యం వివాదాస్పద అంశాలతో వార్తల్లో ఉండే కంగనా ఈసారి సంబంధాల గురించి ఇంతటి పరిణతితో కూడిన ఆలోచనలను పంచుకోవడం అభిమానులను ఆశ్చర్యపరుస్తుంది. జీవితాన్ని, మనుషులను ఎంతో నిశితంగా పరిశీలించడం వల్లే కంగ‌న ఇలాంటి వాస్తవిక దృక్పథాన్ని అలవర్చుకున్నారని తెలుస్తోంది.