క్వీన్ కంగనపై కుట్ర జరిగిందా? అసలేం జరుగుతోంది?
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ పై కుట్ర జరుగుతోందా? కంగన సినిమాని ఆడనివ్వకుండా పంపిణీ, ఎగ్జిబిషన్ రంగాల్లో కొందరు అడ్డుగోడలు నిర్మిస్తున్నారా? అంటే అవుననే గుసగుసలు వినిపిస్తున్నాయి.
By: Sivaji Kontham | 15 Jun 2026 9:02 AM ISTబాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ పై కుట్ర జరుగుతోందా? కంగన సినిమాని ఆడనివ్వకుండా పంపిణీ, ఎగ్జిబిషన్ రంగాల్లో కొందరు అడ్డుగోడలు నిర్మిస్తున్నారా? అంటే అవుననే గుసగుసలు వినిపిస్తున్నాయి. కొన్నేళ్లుగా కంగన నటించిన సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవ్వడంలో శత్రువుల కుట్రలు దాగి ఉన్నాయని అభిమానులు నమ్ముతున్నారు. ఇప్పుడు తాజా చిత్రం భారత్ భాగ్య విధాత` పరిస్థితి కూడా అలాగే కనిపిస్తోంది. చిత్రానికి మంచి రివ్యూలు వచ్చినప్పటికీ, ఎందుకనో కంగన సినిమాను చూడటానికి ప్రేక్షకులు కానీ, థియేటర్లలో ఆడించడానికి ఎగ్జిబిటర్లు కానీ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. తాజాగా కంగన సినిమాను థియేటర్ల నుండి తొలగించి ఆ స్థానంలో కేవలం రూ. 7 కోట్ల స్వల్ప బడ్జెట్‌తో హాలీవుడ్ నుండి వచ్చిన `అబ్సెషన్` అనే హారర్ సినిమాను రీప్లేస్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
నిజానికి ఈ వారం బాక్సాఫీస్ వద్ద చాలా కొత్త సినిమాలు విడుదలైనా `అబ్సెషన్` చిత్రం మూడో వారంలోనూ (జూన్ 12న) రూ. 3.50 కోట్ల వసూళ్లతో ఇండస్ట్రీని షాక్‌కు గురిచేస్తోంది. ఇది రెండవ వారం శుక్రవారం నాటి వసూళ్ల (రూ. 3.30 కోట్లు) కంటే కూడా ఎక్కువ కావడం విశేషం. ఈ కలెక్షన్లు కంగనా రనౌత్ `భారత్ భాగ్య విధాత`తో పాటు `మైన్ వాపస్ ఆవుంగా`, `హాంటెడ్` వంటి కొత్త చిత్రాల కంటే చాలా రెట్లు ఎక్కువ. ఈ క్రేజ్ చూసి ముంబైలోని ఐకానిక్ సింగిల్ స్క్రీన్ థియేటర్ అయిన `రెగల్ సినిమా` కంగన సినిమాకు కేటాయించిన ప్రైమ్ షోలను తీసేసి... ఆ స్థానంలో `అబ్సెషన్` చిత్రాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టింది.
రెగల్ థియేటర్ లో మొదట కంగన సినిమాను రాత్రి 7:15 గంటల షోకు.. అలాగే `మేన్ వాపస్ ఆవుంగా` చిత్రాన్ని సాయంత్రం 4 గంటల షోకు కేటాయించారు. కానీ హిందీ సినిమాలకు కనీస స్థాయిలో కూడా ప్రేక్షకులు రాకపోవడంతో శనివారం నుండి ఆ నాలుగు షోలలోనూ `అబ్సెషన్` సినిమానే వేయడం ప్రారంభించారు. కేవలం రెగల్ మాత్రమే కాదు.. ముక్తా A2 సన్ సిటీ, న్యూ ఎక్సెల్సియర్, గోల్డ్ శాంతాక్రజ్ వంటి మాస్ థియేటర్లలో కూడా జూన్ 12 నుండి ఈ హాలీవుడ్ చిత్రాన్ని ఆడిస్తున్నారు. సాధారణంగా ఇలాంటి మాస్ థియేటర్లలో ఇంగ్లీష్ హారర్ సినిమాలు ఆడవు.. కానీ ఈ సినిమాకు ఉన్న భయపెట్టే దడ పుట్టించే గుణం.. పాజిటివ్ టాక్ వల్ల మాస్ ప్రేక్షకులు కూడా దీని వైపు పరుగులు తీస్తున్నారు.
ఈ సినిమా టికెట్ ధరలు కూడా సామాన్యులకు అందుబాటులో ఉండటం దీనికి మరో ప్లస్ పాయింట్ అయింది. వీకెండ్స్ లో కూడా రెగల్ థియేటర్ లో రూ. 150 నుండి రూ. 250 లోపే టికెట్లు అమ్ముతుండగా.. సన్ సిటీలో మార్నింగ్ షో కేవలం రూ. 130 కే లభిస్తోంది. జేబుకు చిల్లు పడకుండా తక్కువ ధరలోనే ఒక అద్భుతమైన థ్రిల్లింగ్ హారర్ సినిమాను చూసే అవకాశం దక్కడంతో ప్రేక్షకులు కంగన సినిమాను పక్కన పెట్టేసి ఈ చిత్రానికి క్యూ కడుతున్నారు. ట్రేడ్ నిపుణుల లెక్కల ప్రకారం... ఈ సినిమా ఇప్పుడు కేవలం ఒక వర్గానికి మాత్రమే పరిమితం కాకుండా..ఒక స్లీపర్ బ్లాక్‌బస్టర్‌గా అవతరించింది.
వసూళ్ల పరంగా చూస్తే.. `అబ్సెషన్`మొదటి వారంలో రూ. 18.55 కోట్లు.. రెండవ వారంలో రూ. 31.28 కోట్లు సాధించి.. 15 రోజుల్లోనే మొత్తం రూ. 53.33 కోట్ల మార్కును అధిగమించింది. ఇదే వేగం కొనసాగితే త్వరలోనే రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది. ఒకవైపు కేవలం 7 కోట్ల బడ్జెట్ సినిమా వంద కోట్ల వైపు దూసుకుపోతుంటే.. మరోవైపు స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ సినిమాకు కనీసం షోలు కూడా నడవకపోవడం చూస్తుంటే.. ఆమెపై ఏదో కుట్ర జరిగిందా అనే అనుమానాల కంటే, థియేటర్ల వ్యవస్థలో కేవలం కంటెంట్ - ప్రేక్షకుల ఆదరణ మాత్రమే నడుస్తుందని క్లియర్ కట్‌గా స్పష్టమవుతోంది. తనపై ఎవరైనా కుట్ర చేసారని కంగన ఆరోపించినా దానిని కూడా పట్టించుకునే స్థితిలో ఎవరూ లేరు!!!
