Begin typing your search above and press return to search.

హారర్ కామెడీకి మళ్లీ గోల్డెన్ డేస్.. కాంచన4తో లారెన్స్ భారీ ప్లాన్!

గ్లామర్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న పూజాను దెయ్యం పాత్రలో చూపించేందుకు లారెన్స్ తీసుకున్న నిర్ణయం పెద్ద రిస్క్‌గా భావిస్తున్నారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   14 May 2026 11:26 AM IST
హారర్ కామెడీకి మళ్లీ గోల్డెన్ డేస్.. కాంచన4తో లారెన్స్ భారీ ప్లాన్!
X

ద‌క్షిణాదిలో హారర్ కామెడీకి కమర్షియల్ మార్కెట్ తెచ్చిన డైరెక్ట‌ర్, నటుడు రాఘ‌వ లారెన్స్ పేరు ఇప్పటికీ ప్రత్యేకంగానే వినిపిస్తుంది. మునితో మొదలైన ఈ ప్రయాణం కాంచన, గంగ, కాంచన3 వరకు వచ్చేసరికి ఒక బ్రాండ్‌గా మారిపోయింది. ముఖ్యంగా కాంచన3 కథ పరంగా విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించడం ఈ ఫ్రాంచైజ్‌కు ఉన్న మాస్ రీచ్‌ను నిరూపించింది. ఇప్పుడు అదే సిరీస్‌లో తెరకెక్కుతున్న కాంచన4పై కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లోనూ భారీ చర్చ నడుస్తోంది. ఈసారి కేవలం మరో సీక్వెల్‌గా కాకుండా, హారర్ కామెడీ జానర్‌కు మళ్లీ గోల్డెన్ డేస్ తీసుకొచ్చే సినిమాగా దీన్ని తీర్చిదిద్దాలని లారెన్స్ పట్టుదలతో పనిచేస్తున్నట్టు సమాచారం.

ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి బయటకు వస్తున్న వివరాలు చూస్తే కాంచన 4 సాధారణ స్థాయి సినిమా కాదనే విషయం స్పష్టమవుతోంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో కొన్ని కీలక ఎపిసోడ్స్ ఆశించిన స్థాయిలో రాకపోవడంతో లారెన్స్ రీషూట్స్ చేస్తున్నార‌ని తెలుస్తోంది. సాధారణంగా హారర్ కామెడీ సినిమాల్లో వేగంగా షూటింగ్ పూర్తి చేసే ట్రెండ్ ఉన్నప్పటికీ, ఈసారి మాత్రం క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదనే నిర్ణయంతో పనిచేస్తున్నార‌ని చెన్నై సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఏడాదిన్నరగా షూటింగ్ జరుగుతుండగా, మొత్తం సినిమా పూర్త‌వ‌డానికి మరో నాలుగైదు నెలలు పడొచ్చని అంచనా. దీనికి ప్రధాన కారణంగా భారీ విజువల్ ఎఫెక్ట్స్, స్కేల్ పెంపు, కొన్ని సీన్స్ రీడిజైన్, రీషూట్స్ వంటి అంశాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హారర్ ఎపిసోడ్స్‌ను ఇప్పటివరకు కాంచన సిరీస్‌లో చూడని రీతిలో ప్లాన్ చేస్తున్నారని టాక్.

ఇక ఈ సినిమాలో అత్యంత ఆసక్తికర అంశంగా నిలుస్తోంది పూజా హెగ్డే రోల్. గ్లామర్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న పూజాను దెయ్యం పాత్రలో చూపించేందుకు లారెన్స్ తీసుకున్న నిర్ణయం పెద్ద రిస్క్‌గా భావిస్తున్నారు. అయితే ఈ పాత్రకు సంబంధించిన ఫ్లాష్‌బ్యాక్, ఎమోషనల్ ట్రాక్ సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తుందని సమాచారం. ఇప్పటివరకు హారర్ సినిమాల్లో కనిపించని స్థాయిలో ఎమోష‌న్స్ ను మిక్స్ చేస్తూ ఆమె పాత్రను డిజైన్ చేశారట. మరోవైపు నోరా ఫ‌తేహి మ‌రో కీలక పాత్రలో కనిపించనుండటంతో బాలీవుడ్ టచ్ కూడా పెరిగింది. దీంతో మాస్ ప్రేక్షకులతో పాటు ప్యాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని ప్లానింగ్ జరుగుతోందని తెలుస్తోంది.

లారెన్స్ న‌టించిన‌ చంద్రముఖి2 ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో లారెన్స్‌కు ఈ సినిమా చాలా కీలకంగా మారింది. అందుకే కాంచన4ను కంబ్యాక్ మూవీగా మార్చేందుకు ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నార‌ని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రిలీజ్ డేట్ విషయంలో కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తూ, భారీ ప్యాన్ ఇండియా సినిమాలతో క్లాష్ కాకుండా సోలో రిలీజ్ కోసం చూస్తున్నట్టు సమాచారం. ట్రేడ్ అంచనాల ప్రకారం ఈ సినిమాకు త‌క్కువ‌లో త‌క్కువ రూ.150 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగే అవకాశం ఉందట. ముఖ్యంగా ట్రైలర్ రిలీజైన తర్వాత అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరో ఆసక్తికర అంశం ఏమిటంటే, కాంచన4 తో ఈ ఫ్రాంచైజ్‌కు లారెన్స్ ముగింపు పలకబోతున్నార‌నే ప్రచారం కూడా బలంగా వినిపిస్తోంది. అదే నిజమైతే, హారర్ కామెడీ జానర్‌లో ఒక యుగానికి ఇది ఎమోషనల్ ఎండ్ కార్డ్‌గా మారే అవకాశం ఉంది.