#కమల్ ది గ్రేట్.. నేడు ప్రయోగశాల పుట్టినరోజు
యూనివర్శల్ స్టార్ అనే పదానికి అతడు పర్యాయం. విశ్వనటుడు, లోక నాయకుడు, ఉలగనాయన్ ఎలా పిలిచినా కమల్ హాసన్ దీనికి అర్హుడు.
By: Sivaji Kontham | 7 Nov 2025 10:40 AM ISTయూనివర్శల్ స్టార్ అనే పదానికి అతడు పర్యాయం. విశ్వనటుడు, లోక నాయకుడు, ఉలగనాయన్ ఎలా పిలిచినా కమల్ హాసన్ దీనికి అర్హుడు. భారతీయ సినీపరిశ్రమలో నటుడిగా 66 ఏళ్ల కెరీర్‌ని అజేయంగా కొనసాగించిన కమల్ హాసన్ నేటితో మరో ఏడాది పెద్దవాడయ్యాడు. అతడి వయసు 71. బాలనటుడిగా మొదలై, హీరోగా అవతరించి, ఇంతింతై వటుడింతై అన్న చందంగా ఎదిగిన కమల్ హాసన్ పరిశ్రమలో విలక్షణ నటుడిగా తనదైన ముద్ర వేసారు.
కమల్ ఒక ప్రయోగశాల.. ఆరున్నర దశాబ్ధాల కెరీర్‌లో అతడు చేయని ప్రయోగం లేదు. సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో అతడిలా అడ్వాన్స్ డ్ గా ఆలోచించే మరో నటుడు లేరంటే అతిశయోక్తి లేదు. ఏఐ సాంకేతికత అభివృద్ధి చెందుతున్న క్రమంలో భారతీయ సినీపరిశ్రమలో కృత్రిమ మేథస్సుపై టెక్నాలజీ గురించి స్టడీ చేసిన మొదటి నటుడు కమల్. అతడు అమెరికా వెళ్లి మరీ ఏఐ గురించి నేర్చుకుని వచ్చాడు.
71 వయసులోను అతడు విలక్షణ నటుడిగా అజేయంగా కెరీర్ ని సాగిస్తున్నారు. తమిళ చిత్రం `కలత్తూరు కన్నమ్మ`లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన కమల్ ఇటీవల కల్కి 2989 ఎడి, థగ్ లైఫ్ వరకూ అసాధారణమైన కెరీర్ ని సాగించారు. కల్కిలో ప్రతినాయకుడిగా నటించిన సంగతి తెలిసిందే. మణిరత్నం `థగ్ లైఫ్` బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచినా అతడి నటనకు మంచి పేరొచ్చింది.
12 ఆగస్టు 1959న `కలత్తూర్ కన్నమ్మ` చిత్రంలో బాలనటుడిగా కెరీర్ ప్రారంభించిన కమల్ దశాబ్దాల కాలంలో ఆయన చేయని ప్రయోగం లేదు. నటుడు, దర్శకుడు, నిర్మాత, గాయకుడు, స్వరకర్త, రచయిత, గీత రచయిత, స్క్రీన్ రైటర్ గా బహుముఖ ప్రజ్ఞను కనబరిచారు. 66 ఏళ్ల క్రితం.. భవిష్యత్ సినిమా దార్శనికుడి ఆరంగేట్రం జరిగిందని అభిమానులు భావిస్తారు. కమల్ సినీ ప్రవేశం పెద్ద పురోగతికి దారి తీసింది. దశాబ్దాలుగా ఆయన కళాత్మక ప్రక్రియలపై ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. అతడి ఖ్యాతి సరిహద్దులను దాటి విస్తరిస్తూనే ఉంది.
కమల్ హాసన్ తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ, హిందీ, బెంగాలీ చిత్రాలలో నటించారు. దర్శకుడిగా, గాయకుడిగాను నిరూపించారు.. ఆయన ఎందరో ఫిలింమేకర్స్ కి ఒక దిక్సూచి. పరిశ్రమలోని ఎందరో ప్రముఖులకు మార్గదర్శిగా ఉన్నారు. కమల్ హాసన్ `తేవర్ మగన్` స్క్రీన్ ప్లే రైటింగ్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించిన మొదటి తమిళ చిత్రం. ఇది భారతీయ సినిమాలో సాంకేతిక పురోగతికి ఒక ఉదాహరణ. ప్రోస్తెటిక్ మేకప్, డిజిటల్ ఫిల్మింగ్ ఫార్మాట్‌లు, లైవ్ సౌండ్ రికార్డింగ్ సిస్టమ్‌ల వంటి ఆవిష్కరణలను కమల్ కోలీవుడ్‌కు పరిచయం చేశాడు. అధునాతన సాంకేతికతను పరిచయం చేయడం ద్వారా కమల్ హాసన్ సౌత్ సినిమాను అంతర్జాతీయ స్థాయికి చేర్చడంలో కీలక పాత్ర పోషించారు. తమిళ బిగ్ బాస్ వేదికగా బుల్లితెర హోస్ట్ గాను ఆయన అజేయంగా రాణించారు. ఆయన అంకితభావం దూరదృష్టి తరతరాల ఫిలింమేకర్స్ కి స్ఫూర్తి. కమల్ హాసన్ తదుపరి కల్కి 2898 ఏడి సీక్వెల్ లో నటిస్తారు. ఈ చిత్రంలో అతడి నటవిశ్వరూపం చూడాలని అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. రజనీకాంత్ తో కలిసి కమల్ హాసన్ నటించే తలైవర్ 173 ని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే లోకేష్ కనగరాజ్ `విక్రమ్` సీక్వెల్ లోను కమల్ నటించాల్సి ఉంది. నేడు (7 నవంబర్) కమల్ హాసన్ 71వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు.
