Begin typing your search above and press return to search.

వ‌న్య‌ప్రాణి సంర‌క్ష‌ణ‌లో మాకు పాఠాలు నేర్పుతారా? `ది ఎకానమిస్ట్` పక్షపాత క‌థ‌నంపై క‌మ‌ల్ హాస‌న్ ఫైర్!

ప్రముఖ బ్రిటీష్ ప్రచురణ `ది ఎకానమిస్ట్` ఇటీవల భారత్‌లోని వన్యప్రాణి సంరక్షణ ప్రయత్నాలపై ప్రచురించిన ఒక కథనం తీవ్ర చర్చనీయాంశమైంది.

By:  Sivaji Kontham   |   8 Oct 2026 7:25 PM IST
వ‌న్య‌ప్రాణి సంర‌క్ష‌ణ‌లో మాకు పాఠాలు నేర్పుతారా? `ది ఎకానమిస్ట్` పక్షపాత క‌థ‌నంపై క‌మ‌ల్ హాస‌న్ ఫైర్!
X

ప్రముఖ బ్రిటీష్ ప్రచురణ `ది ఎకానమిస్ట్` ఇటీవల భారత్‌లోని వన్యప్రాణి సంరక్షణ ప్రయత్నాలపై ప్రచురించిన ఒక కథనం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ ఆర్టికల్‌లో కనిపిస్తున్న ఆధిపత్య ధోరణిని, బ్రిటీష్ వలసవాద ఆలోచనలను పలువురు తీవ్రంగా తప్పుబట్టారు. స్వయంగా బ్రిటిష్ పాలనలో భారతదేశంలో పులులు, సింహాలను విచక్షణారహితంగా వేటాడి అంతరించిపోయే స్థాయికి తీసుకొచ్చిన చరిత్ర ఉన్న విదేశీయులు... వారి మీడియా సంస్థలు, నేడు జంతుజీవ‌జాల‌ సంరక్షణలో అగ్రగామిగా ఉన్న భారత్‌కు పాఠాలు చెప్పడం అత్యంత అస‌హ్య‌కరమని విమర్శకులు మండిపడుతున్నారు.

కానీ వాస్తవానికి, పురాతన కాలం నుంచే మానవులు-జంతువులు ఒకే ప్రాంతంలో కలిసి జీవించవచ్చని భారతీయులు నమ్ముతూ వస్తున్నారు. తమిళనాడులోని జల్లికట్టు వంటి సంప్రదాయాలు ఆనాటి అన్యోన్యతకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఇలాంటి అద్భుతమైన వారసత్వాన్ని.. సంరక్షణ విజయాలను విదేశీ పక్షపాత దృష్టితో విమర్శించడం మానేసి, ప్రపంచ వేదికలపై కొనియాడాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇక భారతదేశం చేపట్టిన `ప్రాజెక్ట్ చీతా`ఒక అసాధారణ విజయంగా నిలిచింది. ఒక సాహసోపేతమైన ఆలోచనగా అయిన ఈ ప్రాజెక్ట్ ద్వారా నేడు భారత్‌లో చీతా(చిరుత జాతి)ల సంఖ్య 60కి చేరుకోగా.. అందులో 41 భారతదేశంలోనే జన్మించడం విశేషం. ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు, వయోజన చీతాలు.. పిల్లల మరణాలు వంటి ఎదురుదెబ్బలు తగిలినా.. భారత ప్రభుత్వం పట్టుసడలక వాటి నుంచి పాఠాలు నేర్చుకుని విజయవంతంగా అడాప్ట్ చేసుకుంది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఒక పెద్ద మాంసాహార జంతువును (లార్జ్ కార్నివోర్) వేరే ఖండం నుంచి మరో ఖండానికి విజయవంతంగా తరలించిన అరుదైన ఘనత భారత్ సొంతమైంది. అంతేకాకుండా ఈ సంరక్షణ అనుభవాలను ప్రపంచ దేశాలతో షేర్ చేసుకునేందుకు భారత్ `ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్`ను కూడా ఏర్పాటు చేసింది.

కేవలం చీతాలే కాకుండా.. దేశవ్యాప్తంగా పులులు, ఆసియా సింహాల సంఖ్య క్రమంగా కోలుకుంటోంది. రాజస్థాన్‌లో `గ్రేట్ ఇండియన్ బస్టర్డ్` పక్షులను అడవుల్లోకి పునరుద్ధరిస్తుండగా.. హిమాచల్ ప్రదేశ్‌లో మంచు చిరుతలు, తమిళనాడులో నీలగిరి తహర్, డుగాంగ్‌లు, అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో ఖడ్గమృగాలు, రెడ్ పాండాల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టి వాటి వంశాలను కాపాడుతున్నారు.

మొత్తానికి భారతదేశ వన్యప్రాణుల సంరక్షణ చరిత్ర కేవలం ఒక దేశానికి సంబంధించినది మాత్రమే కాకుండా.. ప్రపంచం మొత్తం ఆదర్శంగా తీసుకుని అధ్యయనం చేయదగిన గొప్ప విజయగాథ. దీన్ని కొన్ని పక్షపాత దేశాలు కాలనీయల్ మైండ్‌సెట్‌(వ‌ల‌స‌వాద మ‌న‌స్త‌త్వం)తో చూడటం సరికాదని.. భారత్ సాధించిన ఈ అద్భుతమైన ప్రగతిని ప్రపంచం గర్వంగా స్వాగతించాలని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

ది ఎకానమిస్ట్ కథనంపై క‌మ‌ల్ హాస‌న్ ఫైర్:

ప్రముఖ అంతర్జాతీయ పత్రిక `ది ఎకానమిస్ట్`' వన్యప్రాణి సంరక్షణపై ప్రచురించిన వివాదాస్పద కథనాన్ని విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ తీవ్రంగా త‌ప్పు ప‌డుతున్నారు. ఈ అంశంపై ప్రముఖులు స్పందిస్తుండగా.. నెటిజన్లు సైతం తమ అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు తెలియజేస్తున్నారు. ఇలాంటి అరుదైన విష‌యాల‌పై అపార‌మైన విజ్ఞానాన్ని సాముపార్జించిన‌ క‌మ‌ల్ హాస‌న్ పైనా నెటిజ‌నులు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. భారతీయ సనాతన సంప్రదాయాలు-మూలాలు ఎప్పుడూ ప్రకృతిని, జంతువులను దైవంగా భావించి పూజిస్తాయని.. మన సంస్కృతిలో పర్యావరణ పరిరక్షణ సహజసిద్ధంగానే ఉంటుందని మరికొందరు బలంగా వాదించారు.

పాశ్చాత్య దేశాల పత్రికల పక్షపాత ధోరణిని .. వాటి వలసవాద మైండ్‌సెట్‌ను ఎక్స్ వేదికగా నెటిజన్లు పెద్ద ఎత్తున ఎండగట్టారు. దేశం సాధిస్తున్న పర్యావరణ విజయాలను గర్వంగా స్వాగతించాల్సిన అవసరం ఉందని.. విదేశీ విమర్శలను ధీటుగా తిప్పకొట్టాలని ఈ సోషల్ మీడియా డిబేట్ స్పష్టం చేసింది. భారత్ అనుసరిస్తున్న సంరక్షణ విధానాలు నేడు ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని యూజర్లు కొనియాడారు.