భారతీయుడు-3 సంగతి అంతేనా? ఎవరి దారిలో వారు?
విశ్వనటుడు కమల్ హాసన్, ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో రూపొందిన భారతీయుడు-2 మూవీ గత ఏడాది రిలీజైన విషయం తెలిసిందే.
By: M Prashanth | 17 Sept 2025 5:00 AM ISTవిశ్వనటుడు కమల్ హాసన్, ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో రూపొందిన భారతీయుడు-2 మూవీ గత ఏడాది రిలీజైన విషయం తెలిసిందే. 1996లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం భారతీయుడు కు సీక్వెల్ గా తెరకెక్కిన ఆ సినిమా.. మంచి అంచనాల మధ్య రిలీజ్ అయింది. కానీ భారీ డిజాస్టర్ గా నిలిచి విమర్శలు ఎదుర్కొంది.
ముఖ్యంగా ట్రోలర్స్ కు మీమ్స్ స్టఫ్ గా మారింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా అటు నిర్మాతలకు ఇటు సినిమాను కొనుగోలు చేసిన బయ్యర్స్ కు తీవ్ర నష్టాలు మిగిల్చింది. అయితే ఇండియన్ 2ను మొదట ఒక సినిమాగా ప్లాన్ చేశారు శంకర్. కానీ దాని ఎక్కువ రన్ టైమ్ కారణంగా, దీనిని రెండు భాగాలుగా తీసుకొస్తున్నట్లు తెలిపారు.
అందుకే పార్ట్-3 ట్రైలర్ తో పార్ట్-2 మూవీ క్లోజ్ చేశారు. అయితే ఆ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. కానీ సినిమా రిలీజ్ అవుతుందో లేదోనని కొన్ని రోజులుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. థియేటర్స్ లోకి సినిమా రాదని, ఓటీటీలో రిలీజ్ అవుతుందని ప్రచారం జరిగింది. కానీ థియేటర్స్ లోనే రిలీజ్ అవుతుందని శంకర్ తెలిపారు.
ఆ తర్వాత సినిమా మిగతా పార్ట్ షూటింగ్ జరగదని, రద్దు అయినట్లేనని వార్తలు వచ్చాయి. ముఖ్యంగా సినిమా నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ప్రాజెక్టు నుంచి తప్పుకుందని టాక్ వినిపించింది. ఇంకా షూటింగ్ పెండింగ్ ఉండడంతో తమ వల్ల కాదని ఇండియన్ 3 సినిమాను పూర్తిగా పక్కన పెట్టినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరిగింది.
కానీ ఆ తర్వాత లైకా ప్రొడక్షన్స్ ఇండియన్ 3 పై మళ్లీ వర్క్ ను తిరిగి ప్రారంభిస్తుందని, రెడ్ జెయింట్ ప్రొడక్షన్స్ సంస్థ భాగస్వామిగా చేరుతుందని ఊహాగానాలు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ భారతీయుడు-3 ఆగిపోయిందని టాక్ వస్తోంది. లైకా ప్రొడక్షన్స్ తన ఒప్పందాన్ని ఉపసంహరించుకుందని జోరుగా ప్రచారం జరుగుతోంది.
అంతేకాదు ఓటీటీ పార్టనర్ నెట్ ఫ్లిక్స్ తన ఒప్పందాన్ని ఉపసంహరించుకుందని తెలుస్తోంది. అటు కమల్ హాసన్ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. శంకర్ కూడా దాదాపు అంతే. దీంతో భారతీయుడు-3 పూర్తిగా ఉండకపోవచ్చని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ఇప్పుడు ఆ విషయం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే చిత్రాన్ని పక్కన పెట్టడం సరైన చర్య అని నెటిజన్లు కూడా సమర్థిస్తున్నారు. మరేం జరుగుతుందో వేచి చూడాలి.
