ఇండియన్ 3 ముందు ఒకే ఒక్క దారి..!
యూనివర్శల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో మూడు దశాబ్దాల క్రితం వచ్చిన 'భారతీయుడు' సినిమాకు ఇప్పటికీ మంచి పేరు ఉంది.
By: Ramesh Palla | 12 Jun 2026 9:00 PM ISTయూనివర్శల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో మూడు దశాబ్దాల క్రితం వచ్చిన 'భారతీయుడు' సినిమాకు ఇప్పటికీ మంచి పేరు ఉంది. అయితే ఆ పేరును క్యాష్ చేసుకునేందుకు శంకర్ చేసిన ప్రయత్నం అట్లర్ ఫ్లాప్ అయ్యింది. ఇండియన్ 2 అంటూ పాన్ ఇండియా మూవీని తీసి శంకర్ తన పరువు తానే తీసుకున్నాడు. గత కొంత కాలంగా తీవ్రమైన సంక్షోభంను ఎదుర్కొంటున్న దర్శకుడు శంకర్ ఇండియన్ 2 సినిమాతో మరింతగా కనుమరుగు అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇండియన్ సినిమాకు సీక్వెల్‌గా రెండు పార్ట్‌లను దర్శకుడు శంకర్ రూపొందించాడు. ఇండియన్ 2 ఇప్పటికే విడుదల కాగా, ఇండియన్ 3 సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తి చేసి ఉంచాడు. ఇండియన్ 2 సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో పాటు, శంకర్ పై పూర్తిగా ఆశలు వదులుకున్న నేపథ్యంలో ఇండియన్ 3 పై నీలి నీడలు కమ్ముకున్నాయి.
ఇండియన్ 3 సినిమా కోసం వెయిటింగ్...
ఇండియన్ 2 సినిమా విడుదల సమయంలోనే ఇండియన్ 3 సినిమా ట్రైలర్‌ను విడుదల చేయడం జరిగింది. అంతే కాకుండా ఇండియన్ 3 లో అసలైన కథ ఉంటుంది అంటూ ఇండియన్ 2 సినిమా ప్రమోషన్ సమయంలో దర్శకుడు శంకర్‌తో పాటు మరికొందరు చెప్పుకొచ్చారు. దాంతో ఇండియన్ 2 కంటే ఇండియన్ 3 పై అంచనాలు, ఆసక్తి పెరిగింది. పైగా ట్రైలర్ సైతం బాగుండటంతో ఇండియన్ 3 వస్తే బాగుండు అని కమల్ అభిమానులతో పాటు అన్ని వర్గాల వారు అనుకుంటున్నారు. కానీ పరిస్థితులు చూస్తూ ఉంటే ఇప్పట్లో ఇండియన్ 3 వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. లైకా ప్రొడక్షన్స్ వారితో శంకర్‌కి ప్రస్తుతం సరైన డీలింగ్స్ లేవు. పైగా ఇప్పటికే ఇండియన్ సీక్వెల్ ప్రాజెక్ట్ వల్ల లైకా ప్రొడక్షన్స్ భారీ మొత్తంలో నష్టాలను చవిచూసింది. అందుకే ఆ ప్రాజెక్ట్ పై మళ్లీ పెట్టుబడి పెట్టడం బూడిదలో పోసిన పన్నీరు అవుతుందని వారు అనుకుంటున్నట్లు తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
కమల్ హాసన్, శంకర్ కాంబోకి ఉన్న క్రేజ్...
కమల్ హాసన్ సైతం ఇండియన్ 3 విషయంలో నమ్మకంగా ఉండటం, ఆయనకు ఆసక్తి ఉండటంతో అభిమానులు, ఇండస్ట్రీ వర్గాల వారు సైతం సినిమాను మళ్లీ పట్టాలెక్కిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. శంకర్ సైతం ఇండియన్ 3 ను ముందుకు తీసుకు వెళ్లి, పూర్తి చేసి విడుదల చేయాలని అనుకుంటున్నాడట. అయితే ఇండియన్ 3 సినిమా ముందుకు సాగాలంటే ఒకే ఒక్క ఆప్షన్ ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమాను ఉన్నది ఉన్నట్లుగా ఓటీటీకి అమ్మేస్తే, సదరు ఓటీటీ వారు వారి పరిది బడ్జెట్‌లో సినిమాను పూర్తి చేయించుకుంటారు. తద్వారా సినిమా పూర్తి అయ్యి ఓటీటీ ద్వారా అయినా ప్రేక్షకుల ముందుకు వస్తుందని కొందరు అంటున్నారు. అయితే ఈ విధానంలో సినిమాను తీసుకు వచ్చేందుకు లైకా ప్రొడక్షన్స్ వారు ఎంత వరకు ఒప్పుకుంటారు, ఏ ఓటీటీ ముందుకు వస్తుంది అనేది క్లారిటీ లేదు.
ఓటీటీలో ఇండియన్ మూవీ స్ట్రీమింగ్...
ఈ మధ్య కాలంలో చాలా సినిమాల ఓటీటీ డీల్స్ షూటింగ్ సమయంలో, స్క్రిప్ట్ దశలోనే పూర్తి అవుతున్నాయి. అందుకే ఈ సినిమాకు సైతం ముందుగానే ఓటీటీ డీల్ ను క్లోజ్ చేసుకుని, బ్యాలన్స్ షూట్‌ను సదరు ఓటీటీ వారికి అప్పగిస్తే బాగుంటుంది అంటున్నారు. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి అయ్యింది. కనుక ఏ ఓటీటీ అయినా సినిమాను పూర్తి చేసి స్ట్రీమింగ్ చేసేందుకు రెడీగా ఉండే అవకాశం ఉంది. ఇండియన్ 3 కి మొదట మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ముఖ్యంగా ఇండియన్ 2 వచ్చిన కొత్తలో ఇండియన్ 3 గురించి ప్రముఖంగా చర్చ జరిగింది. ఇప్పుడు సినిమా గురించి ఎక్కడ చర్చ లేదు. దాంతో ఓటీటీలు కూడా ఈ ప్రాజెక్ట్‌ను తమ భుజాలపై వేసుకునేందుకు ఆసక్తి చూపించక పోవచ్చు అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. పెద్ద హీరోల సినిమాలు ఇలా విడుదలకు ముందు షూటింగ్ ఆగి పోయిన దాఖలాలు చాలా తక్కువగా ఉంటాయి. కనుక కమల్ హాసన్‌కి ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఇప్పుడు కాకున్నా ఇండియన్ 3 ముందు ముందు అయినా ఏదో ఒక పద్దతిలో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని నమ్మకంగా కొందరు ఉన్నారు. అది ఏ పద్దతిన వస్తుంది అనేది కాలమే నిర్ణయించాలి.
