సావిత్రి ప్రతిభకు తగ్గ అవకాశాలు ఇవ్వలేదు: కమల్ హాసన్
''గ్లామర్ ఇండస్ట్రీలో మహిళల సామర్థ్యానికి తగ్గ ప్రోత్సాహం లేదు!`` అని అన్నారు ఉలగనాయగన్ కమల్ హాసన్.
By: Sivaji Kontham | 8 Dec 2025 3:00 PM IST''గ్లామర్ ఇండస్ట్రీలో మహిళల సామర్థ్యానికి తగ్గ ప్రోత్సాహం లేదు!'' అని అన్నారు ఉలగనాయగన్ కమల్ హాసన్. ఆరోజుల్లో `మహానటి` సావిత్రిలోని అపార దర్శకత్వ ప్రతిభపై ప్రశంసలు కురిపించిన కమల్ హాసన్, ఆమె స్థాయికి తగ్గట్టు దర్శకత్వంలో పరిశ్రమ అవకాశాలు కల్పించలేదని అన్నారు. అప్పట్లో సావిత్రి తాను కలిసి పని చేసిన చాలా మంది దర్శకుల కంటే ప్రతిభావంతమైన దర్శకురాలు అని అన్నారు. వారిని మించిన ట్యాలెంట్ ఉంది.. కానీ పురుషాధిక్య ప్రపంచంలో ఆమె ఎదగలేదని కూడా కమల్ హాసన్ వ్యాఖ్యానించారు. సావిత్రిని తన తల్లితో సమానంగా అభిమానించే వ్యక్తిగా కమల్ హాసన్ ఈ వ్యాఖ్యలు చేసారు.
మనోరమ హోర్టస్ ఉత్సవంలో సావిత్రి దర్శకత్వ ప్రతిభను కమల్ ప్రశంసించారు. కేవలం సావిత్రి విషయంలోనే కాదు, చాలా మంది మహిళా ప్రతిభావంతులకు పురుషాధిక్య ప్రపంచంలో అవకాశాలు లేవని కమల్‌హాసన్ అన్నారు. సావిత్రి ఆరోజుల్లో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారో కూడా కమల్ మాట్లాడారు. లింగ విభేధం ఎప్పుడూ ఉంది. మహిళలకు ఆరోజుల్లో సరైన అవకాశాలు లేవని కూడా కమల్ అభిప్రాయపడ్డారు. నాటి రోజులతో పోలిస్తే ఇప్పుడు లింగ భేధంతో పని లేకుండా అవకాశాలున్నాయని అన్నారు. ముఖ్యంగా దర్శకత్వ శాఖలో నిరూపించడానికి మహిళలకు లింగ భేధం సమస్యగా మారిందని కూడా వ్యాఖ్యానించారు. కెమెరా వెనుక మహిళలకు అవకాశాలను పరిమితం చేసే పురుషాధిక్య సంస్కృతిని ఎత్తి చూపారు కమల్.
సావిత్రి `చిన్నారి పాపలు`(1968) చిత్రంతో దర్శకురాలిగా అరంగేట్రం చేసారు. ఆ తరువాత దానిని తమిళంలో `కుళంతై ఉల్లం` పేరుతో సావిత్రి రీమేక్ చేసారు. స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కించారు. పాపులర్ నటులతో కలిసి పని చేసిన సావిత్రి దర్శకురాలిగా కథ చెప్పడంలో ఎంతో ప్రతిభ కనబరిచినా కానీ ఆ తర్వాత అవకాశాలు రాలేదని కమల్ అన్నారు. మేల్ డామినేటెడ్ పరిశ్రమను మ్యానేజ్ చేయడానికి సావిత్రి మూగగా నటించాల్సి వచ్చిందని కూడా తెలిపారు. నటీమణుల సామర్థ్యానికి తగ్గ పాత్రలు ఆఫర్ చేయకపోయినా తక్కువ స్థాయి పాత్రలలో నటిస్తున్నారని అన్నారు.
సినిమాల విజయంపై మహిళా ప్రేక్షకుల ప్రభావం గురించి కూడా కమల్ హాసన్ విశ్లేషించారు. మహిళలు థియేటర్లకు రాకపోతే సినిమా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా నిలబడదని, పరిశ్రమ బాక్సాఫీస్ ఫలితాలను నిర్ధేశించేది మహిళలేనని అన్నారు.
కమల్ హాసన్ చివరిసారిగా మణిరత్నం `థగ్ లైఫ్`లో నటించారు. దీనికి మిశ్రమ సమీక్షలు వచ్చినా కమల్ హాసన్ అద్భుత నటనకు ప్రశంసలు కురిసాయి. స్టంట్ కొరియోగ్రాఫర్ అన్బరివ్ దర్శకత్వం వహించే తాజా చిత్రంలోను కమల్ నటించనున్నారు. అలాగే సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించే సినిమాను సొంత బ్యానర్ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ లో కమల్ స్వయంగా నిర్మిస్తున్నాడు.
