'జన నాయగన్' లీక్స్..కమల్ పంచ్ ఎవరిపై?
ఈ నేపథ్యంలోనే ఈ మూవీకి సంబంధించిన లీక్ కలకలం సృష్టిస్తోంది. దీనిపై తమిళనాట తీవ్ర చర్చ జరుగుతోంది.
By: Ravindar Gorantla | 11 April 2026 3:14 PM ISTదళపతివి విజయ్ కథనాయకుడిగా నటించిన చివరి సినిమా `జన నాయగన్`. తెలుగు హిట్ ఫిల్మ్ `భగవంత్ కేసరి` స్టోరీని కొత మార్చి రాజకీయ అరంగేట్రానికి సరిపడేలా సిద్ధం చేసి ఈ మూవీని రూపొందించారు. జనవరి 9న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా సెన్సార్ వివాదం కారణంగా వాయిదాపడింది. అప్పటి నుంచి నిరవధికంగా వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పటికీ ఈ మూవీ రిలీజ్‌పై స్పష్టతలేదు. ఈ నేపథ్యంలోనే ఈ మూవీకి సంబంధించిన లీక్ కలకలం సృష్టిస్తోంది. దీనిపై తమిళనాట తీవ్ర చర్చ జరుగుతోంది.
`జన నాయగన్` లీకులపై స్టార్ హీరోలు స్పందించి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో హీరో విజయ్‌కి అండగా నిలిచారు. నిర్మాత వెంకట్ కె. నారాయణ షాక్‌కు గురై వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టారు. లీక్ అయిన సీన్‌లని వెంటనే సోషల్ మీడియా నుంచి తొలగించాలని, లేకుండా కఠిన చర్చలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. లీక్ అయిన సన్నివేశాలను షేర్ చేయడం కూడా చట్టపరమైన నేరమని ఎవరూ షేర్ చేయవద్దంటూ అభిమానులకు విజ్ఞప్తి చేశారు.
`జన నాయగన్` లీక్‌పై మెగాస్టార్ చిరంజీవి నుంచి విజయ్ దేవరకొండ వరకు స్పందించారు. తమ మద్దతుని విజయ్‌కి తెలియజేశారు. తాజాగా కమల్ హాసన్ కూడా స్పదించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. `జన నాయగన్` సినిమా లీక్ అవడం అనుకోకుండా జరిగిన విషయం కాదు. ఇది వ్యవస్థ వైఫల్య ఫలితం. దీని పనులు సకాలంలో జరిగి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. సెన్సార్ బోర్డ్‌లో జరిగిన విపరీతమైన జాప్యం పైరజీకి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించింది.
పైరసీ రాజకీయాలకు అతీతమైనది. అది కళపై, కళాకారుడిపై చేసే దాడి. వందలాది మంది కళాకారులు, సాంకేతిక నిపుణుల కృషిని ప్రమాదంలో పడేస్తుంది. అలాగే మనం ప్రేమించే సినిమాను నిలబెడుతున్న వాళ్లపై నిజాయితగా పన్ను చెల్లిస్తున్న నిర్మాతలు, థియేటర్ యజమానులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. వ్యవస్థ విఫలమైనప్పుడు సినిమాని ఎవరు కాపాడతారు? విడుదల విషయంలో చట్టపరమైన ఇబ్బందులు ఎదురైనప్పుడు విచారణ వేగవంతం చేయాలి. గతంలో మీరు నాకు అండగా నిలిచినట్టే నిజమైన సినిమా ప్రేమికులు ఇప్పుడు కూడా ఏకమవ్వండి. ఈ చిత్రాన్ని థియేటర్లలోనే చూద్దాం` అంటూ పోస్ట్ పెట్టారు.
వ్యవస్థ విఫలమైందంటూ కమల్ చేసిన విమర్శ ఎవరిని ఉద్దేశించి అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తమిళనాట అధికార పార్టీకి సపోర్ట్‌గా నిలిచిన కమల్ అదే పార్టీ లోక్ సభ అభ్యర్థిగా పార్లమెంట్‌లో అడుగుపెట్టడం తెలిసిందే. అయితే కమల్ విమర్శలు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీని అనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. మరి కమల్ కామెంట్‌లపై తమిళ రాజకీయ వర్గాలు ఎలా స్పందిస్తారో వేచి చేడాల్సిందే.
