ఆయన జెన్ జీ కంటే ముందుంటారు.. సింగీతంకు నేను ఇంకా అసిస్టెంటే!
సింగీతంతో కలిసి చేసిన సినిమాల అనుభవాలను పంచుకుంటూ కమల్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
By: Sravani Lakshmi Srungarapu | 7 Jun 2026 3:53 PM IST94 ఏళ్ల వయసులోనూ సృజనాత్మకతకు చిరునామాగా నిలుస్తున్న దర్శక దిగ్గజం సింగీతం శ్రీనివాసరావుపై లోకనాయకుడు కమల్ హాసన్ మరోసారి తన అపారమైన గౌరవాన్ని చాటుకున్నారు. ఈ నెల 11న రిలీజ్ కానున్న సింగ్ గీతం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న కమల్, సింగీతంతో తనకున్న నాలుగు దశాబ్దాల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ చేసిన ప్రసంగం సభను భావోద్వేగంతో నింపింది. సింగీతం వయసులో పెద్దవారైనా, ఆలోచనల్లో మాత్రం నేటి తరం కంటే ముందుంటారని ప్రశంసించిన కమల్, తాను ఇప్పటికీ ఆయన అసిస్టెంట్‌గానే ఉండాలని కోరుకుంటున్నానని చెప్పడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
తనకు 21 ఏళ్ల వయసులోనే సింగీతం శ్రీనివాసరావుతో పరిచయం ఏర్పడిందని కమల్ గుర్తు చేసుకున్నారు. అప్పట్లో ఇద్దరి మధ్య జరిగిన డిస్కషన్స్ లో పుట్టిన రెండు కథల్లో ఒకటి తర్వాత పుష్పక విమానంగా రూపుదిద్దుకోగా, మరొకటి నాలుగు దశాబ్దాల పాటు ఎదురు చూసి ఇప్పుడు సింగ్ గీతం రూపంలో ప్రేక్షకుల ముందుకు వస్తోందని వెల్లడించారు. మంచి ఆలోచనలకు కాలంతో సంబంధం ఉండదని, నిజమైన సృజనాత్మకత తరాలను దాటి నిలుస్తుందని కమల్ వ్యాఖ్యానించారు.
సింగీతంతో కలిసి చేసిన సినిమాల అనుభవాలను పంచుకుంటూ కమల్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. పుష్పక విమానం షూటింగ్ టైమ్ లో మొత్తం సినిమాను ఎయిర్ కండిషన్డ్ వాతావరణంలో తీశామని అప్పట్లో గర్వంగా చెప్పుకునేవాళ్లమని, కానీ తాజాగా కల్కి 2898AD కోసం హైదరాబాద్‌లోని వేడెక్కిన స్టూడియోల్లో షూటింగ్ చేయాల్సి వచ్చిందని నవ్వుతూ గుర్తు చేసుకున్నారు. అలాగే విచిత్ర సోదరులు (తమిళంలో అపూర్వ సహోదరులు) షూటింగ్ ఎంత కష్టసాధ్యమో వివరిస్తూ, తొలి 20 రోజుల షూట్‌ను పూర్తిగా రద్దు చేసి మళ్లీ మొదలుపెట్టామని తెలిపారు. అలా చేయకపోయి ఉంటే ఆ సినిమా ఫ్లాప్ అయ్యేదని, ఆ నిర్ణయమే సినిమాను కాపాడిందని కమల్ వెల్లడించారు.
ఆ రోజుల్లో టెక్నికల్ ఛాలెంజెస్ ఎంత క్లిష్టంగా ఉండేవో వివరిస్తూ, ప్రతి షాట్ పూర్తయ్యాక వీణా స్టూడియో నుంచి ప్రసాద్ ల్యాబ్‌కు ఫిల్మ్ తీసుకెళ్లి మాస్కింగ్ సరిగా వచ్చిందో లేదో పరిశీలించాల్సి వచ్చేదని చెప్పారు. ఆ ప్రక్రియకు 45 నిమిషాల టైమ్ పట్టడంతో, షూటింగ్ లేటవకుండా తమ సొంతంగా ఒక చిన్న ప్రివ్యూ సెటప్ ఏర్పాటు చేసుకున్నామని వివరించారు. క్లైమాక్స్ టైమ్ లో సమయాభావం కారణంగా ల్యాబ్ పైకప్పుపైనే షూటింగ్ చేసి, కింద ల్యాబ్‌లో ఫుటేజ్ చూసి ఓకే అయితే వెంటనే నెక్ట్స్ షాట్‌కు వెళ్లేవాళ్లమని గుర్తు చేశారు.
సింగీతం టాలెంట్ ను కొనియాడుతూ, ఆయన ఇప్పటికీ జెన్ జీ కంటే ఒక అడుగు ముందే ఉంటారని, వయసు శరీరానికి మాత్రమే పరిమితమని, మనసు ఎప్పటికీ యవ్వనంగా ఉండగలదని సింగీతం నిరూపించారని కమల్ అన్నారు. మూడు నాలుగు నెలల ముందే ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పి ఉంటే, తాను కూడా ఈ సినిమా టీమ్ లో ఒక మెంబర్ గా పనిచేసేవాడినని కమల్ వ్యాఖ్యానించారు. కమల్ ప్రసంగం మొత్తం ఒక విషయం స్పష్టంగా చెప్పింది. భారతీయ సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన పుష్పక విమానం, విచిత్ర సోదరులు వంటి క్లాసిక్స్ వెనుక ఉన్న గురువు సింగీతం శ్రీనివాసరావుపై ఆయనకు ఉన్న గౌరవం కాలంతో మరింత పెరిగిందని. సింగ్ గీతం ప్రమోషనల్ ఈవెంట్ కేవలం ఒక సినిమా కార్యక్రమంలా కాకుండా, గురు శిష్యుల మధ్య ఉన్న అరుదైన అనుబంధానికి నిదర్శనంగా నిలిచింది.
