చేతిలో కొడవలి.. కమల్ కొత్త గేమ్ మొదలైంది!
రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా ఒకేసారి బయటకు వచ్చింది.
By: M Prashanth | 3 Sept 2026 3:21 PM IST‘థగ్ లైఫ్’ తర్వాత కమల్ హాసన్ హీరోగా ఏ సినిమా ముందుగా సెట్స్‌పైకి వెళ్తుందనే విషయంలో కొంత గ్యాప్ వచ్చింది. అన్బరివ్ దర్శకత్వంలో ఒక సినిమా ప్రకటించినా అది వెంటనే మొదలుకాలేదు. రజనీకాంత్‌తో చేయాల్సిన మరో ప్రాజెక్ట్ కూడా లైన్లో ఉంది. ఈ మధ్యలో ఎస్ యూ అరుణ్ కుమార్‌తో కొత్త సినిమాను కమల్ ప్రకటించారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా ఒకేసారి బయటకు వచ్చింది.
ఆ ఫోటోలో కమల్ చేతిలో పెద్ద కొడవలి పట్టుకుని కనిపించారు. బ్లాక్ షర్ట్, ఆలివ్ గ్రీన్ ప్యాంట్, గ్రే హెయిర్‌తో సింపుల్‌గానే ఉన్నా క్యారెక్టర్ మాత్రం రఫ్‌గా ఉండబోతోందనే ఫీలింగ్ ఇచ్చారు. సినిమా టైటిల్, కథ, పాత్ర గురించి ఇంకా ఏమీ చెప్పలేదు. కానీ రెగ్యులర్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ కాకుండా డైరెక్ట్ గా కమల్ క్యారెక్టర్ లుక్‌తో ప్రాజెక్ట్‌ను పరిచయం చేయడం వల్ల మొదటి అప్డేట్‌కే కొంత క్యూరియాసిటీ వచ్చింది.
అరుణ్ కుమార్ ఈసారి ఎలాంటి కథతో వస్తాడనే క్యూరియాసిటి కూడా పెరిగింది. పన్నయ్యారుమ్ పద్మినియుమ్, సేతుపతి, చిత్తా, వీర ధీర సూరన్ లాంటి సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా స్టార్ హీరో ఉన్నా కథలో పాత్రకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే దర్శకుడిగా ఆయనకు పేరు వచ్చింది. విక్రమ్‌తో చేసిన ‘వీర ధీర సూరన్’ తర్వాత ఇప్పుడు కమల్ హాసన్‌ను డైరెక్ట్ చేసే అవకాశం దక్కింది.
కమల్‌కు కూడా ఇలాంటి సినిమా ఇప్పుడు అవసరమైన టైమ్‌లో వచ్చింది. మణిరత్నంతో ఎన్నో ఏళ్ల తర్వాత చేసిన ‘థగ్ లైఫ్’ భారీ అంచనాల మధ్య వచ్చి ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఆ తర్వాత వెంటనే మరో భారీ సినిమా మొదలుపెట్టకుండా, కథ ఆధారంగా సినిమాలు చేసే అరుణ్ కుమార్‌తో వెళ్లడం కొంచెం వేరే ప్లాన్ అనిపిస్తోంది. పైగా కమల్ కొత్త పాత్రలు, కొత్త లుక్స్ ట్రై చేయడంలో ఎప్పుడూ వెనకాడలేదు.
ఇప్పటివరకు బయటకు వచ్చిన లుక్ లో క్యారెక్టర్‌కు ఏదో పగ ఉన్నట్టు కనిపిస్తోంది. చేతిలో కొడవలి ఉండటంతో యాక్షన్ సినిమా అని అనిపించినా, అరుణ్ కుమార్ సినిమాల్లో యాక్షన్ ఒక్కటే కథను నడపదు. ‘చిత్తా’లో ఎమోషన్, ‘వీర ధీర సూరన్’లో క్రైమ్ ప్రపంచాన్ని వేరేలా చూపించాడు. కమల్‌తో ఇప్పుడు ఏ రకమైన కథ ఎంచుకున్నాడన్నది తదుపరి అప్డేట్‌తోనే తెలుస్తుంది.
ఇక హీరోయిన్, మిగతా నటీనటులు, సంగీత దర్శకుడు, షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది అనే వివరాలు ఇంకా రావాల్సి ఉన్నాయి. మరోవైపు రాజ్ కమల్ బ్యానర్‌పై రజనీకాంత్ ‘ధర్మన్’ను నిర్మిస్తున్నారు కమల్. ఇప్పుడు మరో న్యూ ప్రాజెక్ట్. ఇక ఈ రెండు ప్రాజెక్టులతో నిర్మాతగా ఎలాంటి లాభాలు అందుకుంటారో చూడాలి.
