విజయ్ కోసం రంగంలోకి దిగిన కమల్ హాసన్!
కళకు, కళాకారులకు, రాజ్యాంగానికి మద్దతు అంటూ సోషల్ మీడియాలో కమల్ ఓ సుదీర్ఘ పోస్ట్‌ని షేర్ చేశారు. కమల్ హాసన్ రాజ్య సభ సభ్యుడు.
By: Tupaki Entertainment Desk | 11 Jan 2026 4:32 AM ISTకోలీవుడ్ స్టార్ విజయ్ `జన నాయగన్` చుట్టూ సెన్సార్ వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. మద్రాస్ హై కోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని -సీబీఎఫ్‌సీ సవాల్ చేసి స్టే విధించడంతో `జన నాయగన్` రిలీజ్‌పై మళ్లీ నీలినీడలు కమ్ముకున్నాయి. దీంతో విజయ్ అభిమానులు సెన్సార్ బోర్డ్‌తో పాటు కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. సినిమా రిలీజ్ ఆలస్యం కావడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాన్స్‌తో పాటు కోలీవుడ్ స్టార్స్ కూడా రంగంలోకి దిగి విజయ్‌కి మద్దతుగా నిలవడంతో వివాదం తారా స్థాయికి చేరింది.
సీబీఎఫ్‌సీ సొలిసిటర్ జనరల్ అభ్యంతరాలని పరిగణలోకి తీసుకున్న మద్రాస్ హైకోర్టు ధర్మాసనం `జన నాయగన్` సెన్సార్ సర్టిఫికెట్ జారీపై తాత్కాలిక స్టే విధించడమే కాకుండా తదుపరి విచారణని ఈ నెల 21కి వాయిదా వేసింది. దీంతో `జన నాయగన్` రిలీజ్‌పై తీవ్ర గందరగోళం ఏర్పడింది. పండగ సీజన్ అప్పటికి పూర్తయిపోతున్న నేపథ్యంలో సినిమాని తీసుకున్న డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు భారీ స్థాయిలో నష్టపోయేప్రమాదం ఉందని పలువురు ఆందోళ వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
కళకు, కళాకారులకు, రాజ్యాంగానికి మద్దతు అంటూ సోషల్ మీడియాలో కమల్ ఓ సుదీర్ఘ పోస్ట్‌ని షేర్ చేశారు. కమల్ హాసన్ రాజ్య సభ సభ్యుడు. దాంతో ఆయన అఫీషియల్ లెటర్ హెడ్‌పై పలు సంచలన విషయాలని ఈ సందర్భంగా ప్రస్తావించారు. భారత రాజ్యాంగం మనందరికి భావ ప్రకటనా స్వేచ్ఛను కల్పించింది.కానీ దానిని నేడు కొందరు అంధకారంలోకి నెట్టేస్తున్నారు. ఇది ఒక్క సినిమాకు సంబంధించిన విషయం కాదు. కళాకారుళకు మన రాజ్యాంగ ప్రజాస్వామ్యంలో ఇచ్చే స్థానం గురించి కూడా ఇది ప్రతిబింబిస్తుంది.
సినిమా అనేది కేవలం ఒక వ్యక్తి కృషి మాత్రమే కాదు. ఇందులో రచయితలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు, చిన్న వ్యాపారాలు కూడా భాగస్వామ్యంగా సమిష్టి కలిసి చేసే శ్రమ. వీరి జీవన విధానం ఇందులో బాగమై ఉంటుంది. సమాజంలో ఇలాంటి అంశాల్లో స్పష్టత లేకపోతే సృజనాత్మకత కుంటుపడుతుంది. ఆపై ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోతాయి. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల పట్ల ప్రజల్లో నమ్మకం తగ్గుతుంది. తమిళనాడుతో పాటు భారతదేశం సినీ ప్రేమికుల కళల పట్ల ఎంతో ప్రేమను, పరిపక్వతను చూపుతారు.
వారికి పారదర్శకతతో పాటు గౌరవం ఇవ్వండి. సినిమా సర్టిఫికెషన్ ప్రక్రియను మరోపారి పునఃపరిశీలించాలి. ఒక సినిమాకు ఇవ్వాల్సిన అనుమతులకు నిర్దిష్ట సమయ పరిమితులు ఉండాలి. అందులో పారదర్శకంగా అధికారులు పనిచేయాలి. సినిమా నుంచి ఏదైనా సీన్‌కు అభ్యంతరం ఉంటే అందుకు సంబంధించిన మార్పులకు వ్రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలి. సినిమా పరిశ్రమ మొత్తం ముందుకు రావాల్సిన సమయం వచ్చింది. వివరణాత్మకంగా మన వాయిస్‌ని ప్రభుత్వాలకు వినిపించాలి. రాజ్యాంగ విలువలకు లోబడి మన గొంతుకని పలు రంగాలకు వినిపించాలి. ప్రభుత్వాలతో చర్చించాలి` అంటూ సుదీర్భ పోస్ట్ పెట్టారు. దీనిపై ప్రస్తుతం నెట్టింట చర్చ జరుగుతోంది.
