Begin typing your search above and press return to search.

చ‌దువుల్లో మూడు సార్లు ఫెయిలైన స్టార్ కుమార్తె!

డ్యాన్సర్లుగా ఉన్న స్నేహితుల కోసం వీడియోలకు కొరియోగ్రఫీ చేసిన అక్ష‌ర‌ నిజానికి దర్శకత్వం వహించాలనే బలమైన కోరికతోనే పరిశ్రమలోకి అడుగుపెట్టారు.

By:  Srikanth Kontham   |   2 Oct 2026 5:00 PM IST
చ‌దువుల్లో మూడు సార్లు ఫెయిలైన స్టార్ కుమార్తె!
X

విశ్వ నటుడు కమల్ హాసన్ కుమార్తెగా కోలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన అక్ష‌ర హాస‌న్ కెరీర్ ఎలా సాగుతుందో చెప్పాల్సిన ప‌నిలేదు. `ష‌మితాబ్` తో ఎంట్రీ ఇచ్చిన అమ్మ‌డు ఆ త‌ర్వాత మ‌రో నాలుగైదు సినిమాలు చేసింది గానీ... అనుకున్న విధంగా స‌క్సెస్ అవ్వ‌లేదు. అలాగ‌ని ప‌రిశ్ర‌మ‌కు దూరం కాలేదు. ఇప్ప‌టికీ యాక్టివ్ గానే సినిమాలు చేస్తుంది. కానీ త‌న‌ను తాను ఇంకా నిరూపించుకోలేదు. న‌టించిన సినిమాల్లో త‌న‌దైన ఐడెంటిటీ వేయ‌లేక‌పోతుంది. ప్ర‌స్తుతం ఓ రెండు మూడు సినిమాల్లో న‌టిస్తోన్న అక్ష‌ర హాస‌న్ వ్యక్తిగత జీవితం -కెరీర్ ప్రయాణానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

తాను హైస్కూల్ చదువును మధ్యలోనే ఆపేసినట్లు అమ్మ‌డు ఓపెన్ అయింది. పాఠశాల రోజుల్లో మూడుసార్లు ఫెయిల్ అయ్యానని నిర్మొహమాటంగా వెల్లడించారు. ఆ సమయంలో చదువుపై పూర్తిగా ఆసక్తి కోల్పోయానని..ఇక పరీక్షలలో ఉత్తీర్ణత సాధించలేననే విషయాన్ని గ్రహించి హైస్కూల్ నుంచే బయటకు వచ్చేశానని తెలిపారు. స్టార్ కిడ్ అయినా? విఫల ప్రయత్నాన్ని ఏమాత్రం దాచకుండా ఈ విధంగా బహిరంగంగా చెప్పడం అక్ష‌ర హాస‌న్ నిజాయితీకి నిదర్శనం. తన సినీ ప్రయాణం నటిగా లేదా అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రారంభం కాలేదని.. ఒక కొరియోగ్రాఫర్‌గా సంగీత వీడియోలకు పనిచేస్తూ మొదటి అడుగు వేశానని అక్షర గుర్తు చేసుకున్నారు.

డ్యాన్సర్లుగా ఉన్న స్నేహితుల కోసం వీడియోలకు కొరియోగ్రఫీ చేసిన అక్ష‌ర‌ నిజానికి దర్శకత్వం వహించాలనే బలమైన కోరికతోనే పరిశ్రమలోకి అడుగుపెట్టారు. డైరెక్టర్ కావాలనే ఆశయంతో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పనిచేసినట్లు.. అయితే న‌టిగా ప్రయత్నించకుండా ఉంటే ఎలా? అని భావించి నటిగా మారానని తెలిపారు. ఎప్పటికైనా కెమెరా వెనుక నిలబడి దర్శకత్వం వహిస్తానని ఆకాంక్షను వ్యక్తం చేశారు.

అలాగే త‌ల్లిదండ్రుల పెంప‌కం గురించి ఓపెన్ అయ్యారు. పేరెంట్స్ తమను ఎంతో స్వేచ్ఛగా పెంచారని అక్షర కొనియాడారు. `మీరు నటుల పిల్లలు, కాబట్టి ఖచ్చితంగా నటులే కావాలి` అనే ఆంక్షలను తమపై ఎప్పుడూ మోపలేదన్నారు. ఒకవేళ నటనపై ఆసక్తి లేకపోతే నటులు కావాల్సిన అవసరం లేదని, మీకు నచ్చిన రంగంలో రాణించమని ప్రోత్సహించారని చెప్పారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఈ స్వేచ్ఛ తమ భుజాలపై ఉన్న పెద్ద బాధ్యతారాహిత్యాన్ని .. మానసిక ఒత్తిడిని తొలగించిందని వ్యాఖ్యానించారు.

కుటుంబంలో ఒకరికొకరు సినిమాలపై ఇచ్చే విమర్శల గురించి ప్రస్తావిస్తూ తమ ఇంట్లో అభిప్రాయాలను నిర్మొహమాటంగా పంచుకుంటామన్నారు. ఏదైనా సినిమా లేదా షో విడుదలైన తర్వాత కుటుంబ సభ్యుల మధ్య పారదర్శకమైన చర్చలు జరుగుతాయన్నారు. అయితే తాను అడిగితే తప్ప తండ్రి కమల్ హాసన్ తన నటనపై నేరుగా విమర్శలు చేయరని అక్షర స్పష్టం చేశారు. తమ ఇంట్లో ఉండే ఆరోగ్యకరమైన వాతావ‌ర‌ణం నటులుగా ఎదిగేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.