భారతీయ సినిమాలో 'కమల్ ది గ్రేట్'.. ఎందుకో తెలుసా?
భారతీయ సినిమాకు నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా, గాయకుడిగా, మేకప్ ఆర్టిస్టుగా కమల్ హాసన్ అందించిన సేవలకు దాదాసాహెబ్ ఫాల్కే-2026 పురస్కారాల్లో ‘అవుట్‌స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ టు ది ఫిల్మ్ ఇండస్ట్రీ’ గౌరవం దక్కింది. ‘పుష్పక విమానం’ నుంచి ‘విక్రమ్’, ‘కల్కి 2898 ఏడీ’ వరకు ప్రయోగాలతో భారతీయ సినిమాకు కొత్త దారులు చూపిన ఆయన ప్రస్థానానికి ఈ పురస్కారం గుర్తింపుగా నిలిచింది.
By: Sivaji Kontham | 22 Nov 2026 4:18 PM ISTభారతీయ సినిమా చరిత్రలో ప్రయోగాలకు..సరికొత్త సాంకేతిక పరిణామాలకు.. నటనా విశ్వరూపానికి నిలువెత్తు చిహ్నంగా నిలిచిన కమల్ హాసన్.. దాదాసాహెబ్ ఫాల్కే-2026 పురస్కారాలలో `ఔట్‌స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ టు ది ఫిల్మ్ ఇండస్ట్రీ` విభాగంలో గౌరవం అందుకోవడం కళామతల్లికే వన్నె తెచ్చే అంశం. దశాబ్దాలుగా కేవలం ఒక నటుడిగానే కాకుండా, దర్శకుడిగా, నిర్మాతగా, మేకప్ ఆర్టిస్టుగా, గాయకుడిగా, రచయితగా భారతీయ సినిమా స్థాయిని అంతర్జాతీయ వేదికలకు తీసుకెళ్లిన సుదీర్ఘ ప్రస్థానం ఆయనది. కమర్షియల్ హంగులను పక్కన పెట్టి సాహసోపేతమైన ప్రయోగాత్మక కథలతో ప్రేక్షకులను మెప్పించడం నుంచి.. ప్రతి పాత్రలోనూ కొత్తదనాన్ని ఆవిష్కరించడం వరకు కమల్ చేసిన సేవలు భారతీయ సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి.
సినిమా నిర్మాణంలోని దాదాపు ప్రతి విభాగంలోనూ కమల్ హాసన్ విలక్షణతలో తనదైన ముద్ర వేశారు. కథా రచన- స్క్రీన్‌ప్లే-దర్శకత్వ విభాగాల్లో ఆయన ఎప్పుడూ కొత్త దారులను అన్వేషిస్తూ.. సామాజిక అంశాలను, మానవ మనస్తత్వాలను డెప్త్ తో టచ్ చేసే చిత్రాలను రూపొందించారు. రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ ని స్థాపించి సాధారణ కమర్షియల్ ఫార్ములాకు భిన్నమైన హై టెక్నికల్ స్టాండార్డ్ ఉన్న చిత్రాలను నిర్మిస్తూ కొత్త తరం ప్రతిభకు వేదికలు కల్పించారు. మరోవైపు పాత్రకు ప్రాణం పోయడానికి గంటల తరబడి ప్రోస్థటిక్ మేకప్‌తో కూర్చునే సహనం.. ప్లేబ్యాక్ సింగర్‌గా తన గాత్రంతో పాటలకు ప్రాణం పోసే తీరు అతడిని అసమాన బహుముఖ ప్రజ్ఞాశాలిగా నిలబెట్టాయి.
సినీపరిశ్రమకు అసాధారణ సేవలు అందించిన వారికి దక్కే ఈ పురస్కార విభాగానికి కమల్ హాసన్ అన్నివిధాలా అర్హులని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అతడి ప్రయాణం కేవలం వ్యక్తిగత విజయాల కోసం సాగింది కాదు. భారతీయ సినిమా సాంకేతికతను.. ఆడియో-విజువల్ ప్రమాణాలను... కథా చెప్పే విధానాన్ని ఆధునీకరించడానికి చేసిన నిరంతర తపనగా జూరీ పరిగణించింది. భాషా సరిహద్దులను చెరిపేస్తూ సౌత్ టు నార్త్ అన్ని భాషల ప్రేక్షకులతో మమేకమవుతూ.. కొత్త టెక్నాలజీని భారతీయ సినిమాకు పరిచయం చేయడంలో ముందుండటమే ఈ గౌరవానికి నిజమైన అర్హత.
నటుడిగా కమల్ హాసన్ చేసిన ప్రయోగాలలో దశాబ్ధాల క్రితమే `పుష్పక విమానం` ఒక మైలురాయిగా నిలిచింది. ఒక్క డైలాగ్ కూడా లేకుండా కేవలం హావభావాలు.. బాడీ లాంగ్వేజ్‌తోనే నిరుద్యోగి ఆవేదనను.. ఆశలను.. హాస్యాన్ని ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పడం అంత సులభమైన విషయం కాదు. ఆ చిత్రంతోనే కమల్ నటుడిగా అసాధారణమైన ప్రతిభావంతుడు అని ప్రపంచానికి అర్థమైంది. అక్కడి నుంచి వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ సాగిన లెజెండరీ నటుడి ప్రయాణం.. `కల్కి 2898 ఏడీ`, `విక్రమ్` వరకు కొత్త టర్న తీసుకుంది. సైన్స్ ఫిక్షన్- పురాణ నేపథ్యం కలగలిసిన కల్కి చిత్రంలో సుప్రీమ్ యాస్కిన్ పాత్రలో తనదైన శైలి నట ప్రదర్శనతో కమల్ రక్తి కట్టించారు. కల్కి సీక్వెల్ లో అతడి విశ్వరూపం ప్రజలు చూడబోతున్నారు. ఏ తరహా పాత్రలోనైనా ప్రేక్షకులను ఆశ్చర్యపరచగల నటుడిగా కమల్ హాసన్ ఎప్పుడూ నిరూపిస్తూనే ఉన్నారు. ఆర్టిస్టుగా, టెక్నీషియన్ గా అతడు భవిష్యత్ తరాల సినీ కళాకారులకు ఎప్పటికీ ఒక మార్గదర్శకంగా నిలుస్తున్నారు.
