Begin typing your search above and press return to search.

'ప్ర‌ళ‌య్' గురించి లీకులిస్తున్న `లోక` బ్యూటీ

భారతదేశపు మొదటి మహిళా సూపర్‌హీరోగా మెరిసి పాన్-ఇండియా స్థాయిలో ప్రశంసలు అందుకున్న కల్యాణికి ఈ బాలీవుడ్ డెబ్యూ కెరీర్‌లో మరో కీలక మైలురాయి కానుంది.

By:  Sivaji Kontham   |   29 Aug 2026 9:34 AM IST
ప్ర‌ళ‌య్ గురించి లీకులిస్తున్న `లోక` బ్యూటీ
X

దక్షిణాది చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ కల్యాణి ప్రియదర్శన్ బాలీవుడ్ అరంగేట్రానికి సిద్ధమయ్యారు. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ `ప్రళయ్` చిత్రంతో హిందీ పరిశ్రమలో అడుగుపెడుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా కల్యాణి సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ.. ఈ మూవీ స్క్రిప్ట్ మొదటి పేజీ ఫోటోను షేర్ చేయడంతో ఈ లీకులు ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్‌గా మారాయి.

ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి. ముంబైలో షెడ్యూల్ చేస్తున్నార‌ని స‌మాచారం. ఈ ఏడాది తన కుటుంబంతో కలిసి ఓనం పండుగను జరుపుకోలేకపోయానని కల్యాణి తెలిపారు. సాంప్రదాయ ఓనం `సద్య`తో పాటు పండుగ వేడుకలను మిస్ అవుతున్నా.. `ప్రళయ్` ప్రాజెక్ట్ కోసం పూర్తిగా దృష్టి సారించినట్లు క‌ళ్యాణి పేర్కొన్నారు. పండుగ సంబరాలకు దూరమైనా.. కొత్త ప్రయాణం విష‌యంలో ఎంతో ఉత్సాహంగా ఉన్నట్లు క‌ళ్యాణి అభిమానులతో షేర్ చేసారు.

ఈ సినిమా కథాంశం ఎంతో వైవిధ్యంగా ఉండబోతోందని సమాచారం. ఒక `డిస్టోపియన్` నేపధ్యంలో `జాంబీ అపోకలిప్స్` ఎలిమెంట్స్‌తో కూడిన ఎమోషనల్ సర్వైవల్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రానుంది. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఒక వ్యక్తి చేసే పోరాటాన్ని, భావోద్వేగాల మేళవింపుతో తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు ముంబైలో వేగంగా జరుగుతున్నాయి.

ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు హన్సల్ మెహతా కుమారుడు జై మెహతా దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనకు ఇది దర్శకుడిగా తొలి సినిమా కావడం విశేషం. ప్రముఖ నిర్మాణ సంస్థ `అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్` ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. సాంకేతికంగానూ.. విజువల్‌గానూ ఈ సినిమా భారతీయ తెరపై ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుందని చిత్ర బృందం చెబుతోంది.

గతంలో వచ్చిన `లోక చాప్టర్ 1: చంద్ర` చిత్రంలో భారతదేశపు మొదటి మహిళా సూపర్‌హీరోగా మెరిసి పాన్-ఇండియా స్థాయిలో ప్రశంసలు అందుకున్న కల్యాణికి ఈ బాలీవుడ్ డెబ్యూ కెరీర్‌లో మరో కీలక మైలురాయి కానుంది. విల‌క్ష‌ణ న‌టుడు రణ్‌వీర్ సింగ్‌తో కల్యాణి ప్రియదర్శన్ మొదటిసారి జోడీ కడుతుండటంతో `ప్రళయ్` సినిమాపై ప్రేక్షకుల్లోనూ, సినీ వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. దురంధ‌ర్ స్టార్ తో న‌టిస్తున్న లోక బ్యూటీగా క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ పేరు మార్మోగుతోంది.