తెలుగు కామెడీ.. కార్తీ నమ్మకం నిలబడేనా?
టాలీవుడ్, కోలీవుడ్ మధ్య బార్డర్స్ చెరిగిపోయి చాలా కాలమైంది. మన డైరెక్టర్లు అక్కడ, వాళ్ళ హీరోలు ఇక్కడ సినిమాలు చేయడం కామన్ అయిపోయింది.
By: M Prashanth | 26 Nov 2025 11:04 AM ISTటాలీవుడ్, కోలీవుడ్ మధ్య బార్డర్స్ చెరిగిపోయి చాలా కాలమైంది. మన డైరెక్టర్లు అక్కడ, వాళ్ళ హీరోలు ఇక్కడ సినిమాలు చేయడం కామన్ అయిపోయింది. అయితే కామెడీ జానర్ లో మాత్రం ఈ క్రాస్ ఓవర్ ప్రయోగాలు అంత ఈజీ కాదని గతంలో రుజువైంది. ఇప్పుడు మరో యంగ్ డైరెక్టర్ సరిగ్గా అలాంటి సాహసమే చేయడానికి సిద్ధమవుతున్నాడు. దీంతో ఇండస్ట్రీలో ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది.
సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ ఇప్పుడు కోలీవుడ్ బ్రదర్స్ ను టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. సూర్యతో సినిమా చేస్తూనే, తమ్ముడు కార్తీతో కూడా ప్రాజెక్ట్ సెట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు దర్శకుడిగా 'మ్యాడ్' ఫేమ్ కళ్యాణ్ శంకర్ పేరు వినిపిస్తోంది. సరిగ్గా ఇక్కడే ఆడియన్స్ కు పాత జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. ఒకప్పుడు ఇలాగే ఒక సెన్సేషనల్ హిట్ కొట్టిన డైరెక్టర్ తమిళనాడు వెళ్లి చేతులు కాల్చుకున్నాడు.
గతంలో 'జాతిరత్నాలు'తో నవ్వించిన అనుదీప్, తమిళ హీరో శివకార్తికేయన్ తో 'ప్రిన్స్' అనే సినిమా చేశాడు. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది. ఆ కామెడీ అక్కడ వర్కవుట్ అవ్వలేదు. ఇప్పుడు కళ్యాణ్ శంకర్ కూడా అదే తరహా కామెడీ డైరెక్టర్. పైగా రీసెంట్ గా వచ్చిన 'మ్యాడ్ 2' కూడా భారీ అంచనాల మధ్య వచ్చి, వాటిని అందుకోలేకపోయింది అనే టాక్ ఉంది. ఇలాంటి టైమ్ లో కళ్యాణ్ శంకర్, కార్తీని ఎలా హ్యాండిల్ చేస్తాడనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
కానీ ఇక్కడో బలమైన పాయింట్ ఉంది. హీరో కార్తీ కథల ఎంపికపై ప్రేక్షకుల్లో మంచి నమ్మకం ఉంది. ఆయన ఏదైనా కథ ఒప్పుకున్నాడంటే అందులో కచ్చితంగా బలమైన 'కంటెంట్' ఉంటుందని ఆడియన్స్ బలంగా నమ్ముతారు. ఖైదీ, ఆవారా లాంటి సినిమలే ఇందుకు నిదర్శనం. రొటీన్ గా ఉంటే కార్తీ అస్సలు చేయడు. అలాంటి హీరో కళ్యాణ్ శంకర్ కు ఓకే చెప్పాడంటే, కథలో ఏదో కొత్త మ్యాజిక్ ఉండే ఉంటుందని భావిస్తున్నారు.
నాగవంశీ ప్లానింగ్ బాగున్నా, డైరెక్టర్ ట్రాక్ రికార్డ్ పైనే అందరి కళ్ళు ఉన్నాయి. జాతిరత్నాలు డైరెక్టర్ కు ఎదురైన అనుభవం కళ్యాణ్ శంకర్ కు ఎదురవ్వకూడదని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కార్తీ జడ్జిమెంట్ గెలుస్తుందా? లేక తెలుగు కామెడీ తమిళంలో తేడా కొడుతుందా? అనేది చూడాలి. మొత్తానికి ఈ ప్రాజెక్ట్ అటు ఆసక్తిని, ఇటు చిన్నపాటి టెన్షన్ ను క్రియేట్ చేస్తోంది. కార్తీ నమ్మకాన్ని కళ్యాణ్ శంకర్ నిలబెట్టుకుంటే మాత్రం, నాగవంశీ ఖాతాలో మరో క్రేజీ హిట్ పడ్డట్టే. చూడాలి మరి ఈ 'మ్యాడ్' కాంబో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో.
