NKR నాలుగేళ్ల ఎదురుచూపులకు తెర పడేనా?
2023లో విడుదలైన ఆ రెండు సినిమాలు కళ్యాణ్ రామ్‌ను ఏకంగా ఏడాది బ్రేక్ తీసుకునేలా చేశాయి.
By: Ramesh Palla | 26 Sept 2026 12:03 PM ISTనందమూరి కళ్యాణ్ రామ్ గత ఏడాది 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమాలో లేడీ అమితాబ్ బచ్చన్ విజయశాంతి ముఖ్య పాత్రలో నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమాపై కళ్యాణ్ రామ్ చాలా ఆశలు పెట్టుకుని నటించాడు. కానీ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయింది. విజయశాంతి సూపర్ హిట్ మూవీ వైజయంతి ఇన్‌పుట్స్ సైతం సినిమాకు పెద్దగా హెల్ప్ చేయలేక పోయాయి. అంతకు ముందు కళ్యాణ్ రామ్ నుంచి వచ్చిన అమిగోస్, డెవిల్ సైతం తీవ్రంగా నిరాశ పరిచాయి. 2023లో విడుదలైన ఆ రెండు సినిమాలు కళ్యాణ్ రామ్‌ను ఏకంగా ఏడాది బ్రేక్ తీసుకునేలా చేశాయి. బ్రేక్ తీసుకున్నా కళ్యాణ్ రామ్ కి కలిసి రాలేదు. ఎట్టకేలకు కళ్యాణ్ రామ్‌కి ఓ హిట్ పడబోతుందని అభిమానులతో పాటు, ఇండస్ట్రీ వర్గాల వారు, మీడియా సర్కిల్స్ వారు బలంగా నమ్ముతున్నారు.
బింబిసార సినిమా తర్వాత కళ్యాణ్ రామ్...
2022లో బింబిసార సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయాన్ని సొంతం చేసుకున్న కళ్యాణ్ రామ్ మళ్లీ ఇన్నాళ్ల తర్వాత హిట్ కొట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కళ్యాణ్ రామ్ ప్రస్తుతం వెంకటేష్‌తో కలిసి అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'జనవరి 12 విడుదల' సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. 2207 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అనిల్ రావిపూడి గత చిత్రాలు సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వర ప్రసాద్ గారు సినిమాలు సంక్రాంతి బ్లాక్ బస్టర్‌లుగా నిలిచాయి. అందుకే ఈ సినిమా సైతం 2027 సంక్రాంతికి భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే విశ్వాసం ను అంతా వ్యక్తం చేస్తున్నారు. అనిల్ రావిపూడి మార్క్ వినోదానికి తెలుగు ప్రేక్షకులు బాగా అలవాటు పడ్డారు. కనుక జనవరి 12 విడుదల సినిమా కచ్చితంగా సూపర్ హిట్ అని వెంకటేష్, కళ్యాణ్ రామ్ అభిమానులు ధీమాగా ఉన్నారు.
వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబో....
నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్‌లో హిట్స్ కంటే ఎక్కువగా ఫెయిల్యూర్స్ ఉన్నాయి అనేది అందరూ ఒప్పుకునే విషయం. బింబిసార సినిమాకు ముందు కళ్యాణ్ రామ్ కి 'పటాస్' సినిమాతో హిట్ దక్కింది. ఆ సినిమాతోనే అనిల్ రావిపూడి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. అప్పటి నుంచి అపజయం లేకుండా అనిల్ రావిపూడి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. దాదాపు పదేళ్ల తర్వాత కళ్యాణ్ రామ్‌తో సినిమాకు అంతా సెట్ అయింది. ఇప్పటికే షూటింగ్ ప్రారంభం అయిన వీరి కాంబో మూవీ మరో విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అనడంలో సందేహం లేదు. వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబో హిట్ కాంబినేషన్ అని ఇప్పటికే పలు సార్లు నిరూపితం అయ్యింది. మరో వైపు నందమూరి కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి కాంబో పటాస్‌తో హిట్ సొంతం చేసుకుంది, కనుక మరోసారి వీరి కాంబో హిట్ కొట్టడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
సంక్రాంతికి 'జనవరి 12 విడుదల'...
వరుసగా సంక్రాంతి సీజన్‌లో తన సినిమాలను దించుతున్న దర్శకుడు అనిల్ రావిపూడి 2027 సంక్రాంతిని సైతం ఇప్పటికే కబ్జా చేయడం జరిగింది. 2026లో పెద్ద సినిమాలను సైతం వెనక్కి నెట్టిన అనిల్ రావిపూడి, 2025లోనూ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌ను సొంతం చేసుకున్నాడు. వరుసగా మూడో సంక్రాంతి హిట్‌ను తన ఖాతాలో వేసుకునేందుకు గాను అనిల్ రావిపూడి జనవరి 12న 'జనవరి 12 విడుదల' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా విజయం వెంకటేష్ కంటే కళ్యాణ్ రామ్‌కి చాలా ముఖ్యం. అందుకే ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్స్‌గా కీర్తి సురేష్, కృతి శెట్టి నటిస్తున్నారు. వెంకటేష్, కళ్యాణ్ రామ్‌లు బావ - బామ్మర్ధి పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇలా ఇద్దరు పెద్ద హీరోలు బావ బామ్మర్ది పాత్రల్లో నటించి చాలా కాలం అయింది. ఈ సినిమాతో కళ్యాణ్ రామ్, ఆయన ఫ్యాన్స్ నాలుగు ఏళ్లుగా ఎదురు చూస్తున్న హిట్ దక్కేనా, ఆయన ఎదురుచూపులకు తెర పడేనా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
