అనుకున్నదాని కంటే ఎక్కువ నవ్విస్తే.. వరుస ఛాన్సులు పక్కానా?
దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోలు వెంకటేష్- కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కొత్త మల్టీస్టారర్ మూవీ ఇప్పుడే ఆసక్తిని పెంచుతోంది.
By: M Prashanth | 24 Jun 2026 12:29 PM ISTదర్శకుడు అనిల్ రావిపూడి, హీరోలు వెంకటేష్- కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కొత్త మల్టీస్టారర్ మూవీ ఇప్పుడే ఆసక్తిని పెంచుతోంది. షూటింగ్ మొదలవుతుందన్న విషయాన్ని ప్రకటిస్తూ విడుదల చేసిన ప్రమోషనల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు కొత్త చర్చకు కూడా తెరతీసింది. ముఖ్యంగా ఆ సినిమాలో కళ్యాణ్ రామ్ కామెడీ ఎలా ఉండబోతోందన్న అంశం అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.
ప్రమోషనల్ వీడియోలో అనిల్ రావిపూడిని వెంకటేష్, కళ్యాణ్ రామ్ సరదాగా ఆటపట్టించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే వీడియో చూసిన కొందరు నెటిజన్లు కామెడీ టైమింగ్ విషయంలో వెంకటేష్ ముందు కళ్యాణ్ రామ్ కొంత వెనుకబడ్డారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కామెడీ అంటేనే నేచురల్ ఎక్స్ప్రెషన్స్, పంచ్ లకు సరైన రెస్పాన్స్, టైమింగ్ చాలా ముఖ్యమని చెబుతున్నారు.
అయితే కళ్యాణ్ రామ్ కు కామెడీ కొత్తేమీ కాదు. ఆయన కెరీర్ లో ప్రత్యేక స్థానం సంపాదించిన పటాస్ చిత్రాన్ని చూస్తే ఆ విషయం స్పష్టమవుతోంది. పోలీస్ స్టేషన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సీన్స్, ఎంఎస్ నారాయణ, శ్రీనివాస్ రెడ్డితో ఆయన చేసిన కామెడీ ఇప్పటికీ ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటుంది. అలాగే అసాధ్యుడు వంటి చిత్రాల్లోనూ కామెడీ ట్రాక్ తో మెప్పించారు. అవసరమైనప్పుడు నవ్వులు పండించే స్టామినా తనకు ఉందని గతంలో నిరూపించారు.
అయితే ఈసారి సవాల్ మరింత పెద్దది. ఎందుకంటే ఎదురుగా ఉన్నది వెంకటేష్. కామెడీ టైమింగ్, నేచురల్ యాక్టింగ్ లో వెంకటేష్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. అందుకే సినిమాలో ఇద్దరి మధ్య కామెడీ కాంపిటేషన్ ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవైపు వెంకటేష్ ఎక్స్పీరియన్స్, మరోవైపు కళ్యాణ్ రామ్ కొత్త యాంగిల్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఇక్కడ మరో కీలక అంశం అనిల్ రావిపూడి. దర్శకుడిగా తొలి అవకాశం ఇచ్చింది కళ్యాణ్ రామే. పటాస్ తో ఇద్దరి ప్రయాణం ప్రారంభమైంది. అందువల్ల కళ్యాణ్ రామ్ స్ట్రెంత్స్, వీకెనెస్ అనిల్‌కు బాగా తెలుసు. ప్రేక్షకులు ఆయన నుంచి ఏమి ఆశిస్తారో కూడా స్పష్టంగా తెలుసు. అందుకే ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ పాత్రను ప్రత్యేకంగా డిజైన్ చేసి ఉండొచ్చని టాక్ వినిపిస్తోంది.
ఇప్పటికే మాస్ హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న కళ్యాణ్ రామ్, ఈ సినిమాతో ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో మరోసారి మెరిసితే భవిష్యత్తులో ఇలాంటి పాత్రలకు మరిన్ని అవకాశాలు రావచ్చు. ఆడియన్స్ కూడా ఆయనలోని కొత్త యాంగిల్ ను రిసీవ్ చేసుకునే అవకాశం ఉంది. ఏదేమైనా ఒక ప్రమోషనల్ వీడియో ఆధారంగా నిర్ణయానికి రావడం తొందరపాటు. కానీ ఆ చర్చ మాత్రం సినిమాపై ఆసక్తి మరింత పెంచింది. ఇప్పుడు అందరి దృష్టి ఒక్కటే.. వెంకటేష్ తో కలిసి కళ్యాణ్ రామ్ ఎంతగా నవ్విస్తారు? అనుకున్నదాని కంటే ఎక్కువగా మెప్పిస్తే ఆయనకు వరుస కామెడీ అవకాశాలు రావడం ఖాయమని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
