నటి కల్పిక 'అరెస్టు' నుంచి ఉపశమనం వెనక
టాలీవుడ్ నటి కల్పిక వివాదాస్పద వైఖరి గురించి గత కొంతకాలంగా మీడియాలో చాలా చర్చ సాగుతోంది.
By: Sivaji Kontham | 1 Aug 2025 7:16 PM ISTటాలీవుడ్ నటి కల్పిక వివాదాస్పద వైఖరి గురించి గత కొంతకాలంగా మీడియాలో చాలా చర్చ సాగుతోంది. ఇంతకుముందు బ్రిస్టోలో సిబ్బంధితో ఘర్షణ కారణంగా మీడియా హెడ్ లైన్స్ లోకొచ్చింది. ఈ ఘటనలో విచారణ సాగుతుండగానే, మరో ప్రయివేట్ రిసార్ట్ లో సిబ్బంధితో ఘర్షణకు దిగిన వీడియోలు సంచలనంగా మారాయి. కల్పిక సదరు రిసార్ట్ ఆఫీస్ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తిస్తున్న వీడియో వైరల్ గా మారింది. ఆ తర్వాత ప్రముఖ టీవీ చానెళ్లలో డిబేట్లు కూడా పరిస్థితి తీవ్రతకు అద్దం పట్టాయి.
పోలీసులు వెంటాడారు:
తనకు సిగరెట్ కావాలని అడిగితే సరిగా సమాధానం ఇవ్వలేదంటూ స్టాఫ్ పై విరుచుకుపడిన కల్పిక వ్యవహారం చర్చగా మారింది. అంతేకాదు.. ఒక కేసులో ఇరుక్కుని మనశ్శాంతిని వెతుకుతూ రిసార్టులను ఆశ్రయించినట్టు టీవీ చానెల్ ఇంటర్వ్యూలో కల్పిక వ్యాఖ్యానించడం షాకిచ్చింది. కల్పిక ఇదంతా బిగ్ బాస్ లో చోటు సంపాదించుకునేందుకు ఆడుతున్న డ్రామా! అంటూ కొందరు కొట్టి పారేస్తుండగా, మరికొందరు కల్పికను తల్లిదండ్రులు వివాదాల నుంచి ఎలాగైనా బయటకు తేవాలని కోరుతున్నారు. బ్రిస్టో వ్యవహారంలో కల్పికపై కేసు ఫైల్ చేసిన అనంతరం పోలీసులు అరెస్ట్ కోసం వెతుకుతుండగా చాలా మెలో డ్రామా బయటపడింది. కల్పిక రిసార్టుల్లో ప్రశాంతత వెతకడానికి వెళ్లానని చెప్పడం ఆశ్చర్యపరిచింది.
మానసిక సమస్యలే కారణమా?
తాజా సమాచారం మేరకు, హైకోర్టు కల్పిక అరెస్టును నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కల్పిక తండ్రి మొరను కోర్టు ఆలకించింది. తన కుమార్తె ప్రస్తుతం డిప్రెషన్ సహా ఇతరత్రా మానసిక సమస్యలతో పోరాడుతోందని, తనకు మతి చలించిందని కోర్టుకు విన్నవించడం చర్చనీయాంశంగా మారింది. కల్పిక అరెస్టు నుంచి ఉపశమనం కల్పించడానికి కారణం ఆమె తండ్రి ఇచ్చిన వాంగ్మూలం అని తెలిసింది.
ఇప్పటికి తప్పించుకున్నా కానీ..!
ప్రస్తుతానికి కల్పిక అరెస్ట్ నుంచి తప్పించుకున్నా, తన ప్రవర్తన గురించి ప్రజల్లో చాలా చర్చ సాగుతోంది. మానసికంగా తీవ్ర భావోద్వేగానికి గురైన కల్పిక పిచ్చిగా ప్రవర్తిస్తోందని కొందరు నెటిజనులు కామెంట్ చేస్తున్నారు. అయితే అరెస్టుకు భయపడి ఇలా డ్రామాలాడుతోంది! అంటూ కొందరు కొట్టి పారేస్తున్నారు. కల్పికను అరెస్ట్ నుంచి బయటపడేసేందుకే తండ్రితో ఈ డ్రామా ఆడించింది! అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
నిజంగానే కల్పికకు మానసిక అనారోగ్య సమస్యలు ఉంటే కుటుంబ అండ ఇప్పుడు చాలా అవసరం. తనను కాపాడేందుకు నిపుణులైన మానసిక వైద్యుల సమక్షంలో ట్రీట్ మెంట్ కొనసాగించాల్సి ఉంటుంది. ఇప్పటికి చట్టపరమైన చర్యల నుండి తాత్కాలిక ఉపశమనం పొందింది. కానీ మునుముందు పరిస్థితులు అదుపు తప్పకుండా ఉండాలంటే, భావోద్వేగాలను అదుపులో ఉంచుకునేలా స్ట్రాంగ్ గా కల్పిక మారాల్సి ఉంటుంది. దీనికోసం నిపుణుల సమక్షంలో శిక్షణ అవసరమని సూచిస్తున్నారు.
