కల్కి-2 నుంచి దీపిక పాత్రనే తీసేస్తే?
గత ఏడాది విడుదలై పాన్ ఇండియా స్థాయిలో సూపర్ హిట్ అయిన సినిమా.. కల్కి 2898 ఏడీ. దీనికి సీక్వెల్ ఉంటుందని అప్పుడే ప్రకటించారు.
By: Garuda Media | 20 Sept 2025 9:33 AM ISTగత ఏడాది విడుదలై పాన్ ఇండియా స్థాయిలో సూపర్ హిట్ అయిన సినిమా.. కల్కి 2898 ఏడీ. దీనికి సీక్వెల్ ఉంటుందని అప్పుడే ప్రకటించారు. దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఏడాది నుంచి ఆ పనిలోనే నిమగ్నమై ఉన్నారు. స్క్రిప్టు దాదాపుగా రెడీ అయింది. ప్రభాస్ ఎప్పుడు అందుబాటులోకి వస్తే అప్పుడు చిత్రీకరణ మొదలుపెడదామని చూస్తున్నారు. ఇంతలో ‘కల్కి’లో సుమతిగా అత్యంత కీలకమైన పాత్ర చేసిన దీపికా పదుకొనే సినిమా నుంచి తప్పుకున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించడం సంచలనంగా మారింది.
ఇలాంటి క్రేజీ సీక్వెల్ నుంచి ప్రధాన పాత్రధారి తప్పుకోవడం కచ్చితంగా చిత్ర బృందానికి ఇబ్బందే. ఆ పాత్రలో మరో నటిని ప్రేక్షకులు అంగీకరిస్తారా.. ఇంకొకరు ఆ పాత్రను అంత కన్విన్సింగ్‌గా పోషించగలరా అన్నది ప్రశ్న. ఈ పాత్రకు దీపిక స్థానంలో ఎవరైతే బాగుంటుంది అని చర్చించుకుంటున్నారు జనం.
ఐతే ‘కల్కి-2’ నుంచి దీపికను తప్పించడంతో సరిపెట్టకుండా ఆమె పాత్రనే లేపేస్తే ఎలా ఉంటుంది.. ఆ దిశగా చిత్ర బృందం ఏమైనా ఆలోచిస్తోందా అనే చర్చ జరుగుతోందిప్పుడు. కల్కి-2కు సంబంధించి ఇప్పటికే దీపిక మీద కొన్ని సన్నివేశాలు తీశారు. అంతటితో పరిమితం చేసి.. కథ ప్రకారం ఆమె పాత్రను ఇక చూపించాల్సిన అవసరం లేకుండా ఏమైనా మార్పు చేసే అవకాశముందా అని సోషల్ మీడియా జనాలు మాట్లాడుకుంటున్నారు.
‘కల్కి’ టీం ముందు నుంచి చెబుతున్నది ఏమంటే.. రెండో భాగంలో కమల్ హాసన్, ప్రభాస్‌ల పాత్రల నిడివి, ప్రాధాన్యం ఇంకా ఎక్కువ ఉంటుందని. అమితాబ్‌కు సైతం బాగానే స్కోప్ ఉంటుందట. ఈ ముగ్గురినీ హైలైట్ చేస్తూ కథలో దీపిక పాత్ర ప్రాధాన్యాన్నే తగ్గించేస్తే ఎలా ఉంటుంది.. వాయిస్ ఓవర్లో ఆ పాత్ర గురించి చెప్పించి దాని కథ ముగించేస్తే ఇంకో నటి గురించి ఆలోచించాల్సిన అవసరమే ఉండదు కదా.. సుమతి గురించి ప్రేక్షకులు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేకుండా మిగతా పాత్రలతో మ్యాజిక్ చేస్తే ఏ ఇబ్బంది ఉండదు కదా.. ఈ దిశగా ఏమైనా టీం ఆలోచిస్తోందా అని ‘కల్కి’ ఫ్యాన్స్ ఊహాగానాల్లో మునిగిపోయారు.
