సీక్వెల్ గురించి నాగ్ అశ్విన్ ఏం చెబుతాడో?
ప్రభాస్ ప్రస్తుతం వరుసగా భారీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. ఓవైపు సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్, మరోవైపు హను రాఘవపూడితో ఫౌజి చిత్రీకరణల్లో ఉన్నాడు.
By: Sivaji Kontham | 4 Jan 2026 2:50 PM ISTప్రభాస్ ప్రస్తుతం వరుసగా భారీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. ఓవైపు సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్, మరోవైపు హను రాఘవపూడితో ఫౌజి చిత్రీకరణల్లో ఉన్నాడు. ఫౌజి ఈ ఏడాది ఆగస్టులో విడుదలకు రావాల్సి ఉండగా, స్పిరిట్ ఏడాది అంతా నిరంతరాయంగా చిత్రీకరణలో ఉండనుంది. అయితే ప్రభాస్ నటించాల్సిన సీక్వెల్ సినిమాలు కల్కి 2, సలార్ 2 సంగతేంటి? అంటూ అభిమానులు ఎప్పుడూ ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఇవి రెండూ ప్రభాస్ కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్ చిత్రాల జాబితాలో చేరాయి. అందుకే సీక్వెల్స్ పైనా సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇలాంటి సమయంలో `కల్కి 2898 ఏడి` సీక్వెల్ ను నాగ్ అశ్విన్ ఈ ఫిబ్రవరిలో ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారని కథనాలొస్తున్నాయి ఓవైపు స్పిరిట్ ని పూర్తి చేస్తూనే, `ఫౌజి` ఫైనల్ చిత్రీకరణలను ముగించి, అటుపై రిలీజ్ కి సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఇదే సమయంలో `కల్కి 2898 ఏడి` సీక్వెల్ షూట్ మొదలవుతుందా? అన్నదానిపై ఇంకా నాగ్ అశ్విన్ బృందం అధికారికంగా స్పందించాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఇంకా కల్కి 2898 ఏడి కాస్టింగ్ గురించి ఎలాంటి వివరాలు వెల్లడి కాలేదు. దీపికా పదుకొణె సీక్వెల్ నుండి వైదొలిగాక కథానాయికగా ఎవరు నటిస్తారు? అన్నదానిపై స్పష్ఠత లేదు.
సీక్వెల్ లో దీపిక పాత్ర దైవిక రక్షకుడైన `కల్కి` తల్లిగా కనిపిస్తుంది. సుమతి లేదా సమ్-80 అనే ముఖ్యమైన పాత్ర సీక్వెల్ కథను నడిపించాల్సి ఉంది. ఇప్పుడు దీపిక స్థానంలోకి ఎవరు వస్తారు? అన్నది తెలియాల్సి ఉంది. మొదటి భాగంలో అశ్వత్థామ గర్భిణిగా ఉన్న దీపికను `ప్రాజెక్ట్ కె` చీకటి ఎజెండా నుండి రక్షించాడు. ఆ తర్వాత ప్రయాణం ఏమిటన్నది సీక్వెల్ లో చూడాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో కమల్ హాసన్ ప్రతినాయకుడి పాత్రలో తన విశ్వరూపాన్ని చూపించేందుకు సిద్ధమవుతున్నారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.
`కల్కి 2898 ఏడి` సీక్వెల్ తో పాటు ప్రభాస్ కెరీర్ లో అత్యంత ముఖ్యమైన మరో సీక్వెల్ గురించిన అప్ డేట్ కూడా రావాల్సి ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందే ఈ సీక్వెల్ కి `సలార్ పార్ట్ 2: శౌర్యాంగ పర్వం` అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో డ్రాగన్ చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు.
1000 కోట్లు ఈసారి పాజిబులే:
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన `కల్కి 2898 AD` 2024లో అతిపెద్ద హిట్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా విడుదలై దాదాపు ఒకటిన్నర సంవత్సరాలు కావస్తున్నా అభిమానుల్లో ఉత్సుకత అలానే ఉంది. రెండవ భాగం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదటి భాగం దాదాపు 800కోట్లు వసూలు చేయగా రెండో భాగం కచ్ఛితంగా 1000 కోట్లు అంతకుమించి వసూలు చేస్తుందని కూడా అభిమానులు అంచనా వేస్తున్నారు. ఇటీవలి కాలంలో సీక్వెల్ సినిమాలు మినిమం 1000 కోట్లు ఆర్జిస్తున్నాయి. అందువల్ల కల్కి లాంటి క్రేజ్ ఉన్న సీక్వెల్ ఆ స్థాయి వసూళ్లను అందుకోవడం కష్టమేమీ కాదని కూడా అంచనా వేస్తున్నారు. కల్కి 2898 ఏడి సీక్వెల్ గురించి ఏదైనా కొత్త విషయం చెప్పేందుకు నాగ్ అశ్విన్ మీడియా ఎదుటకు వస్తారేమో వేచి చూడాలి.
