Begin typing your search above and press return to search.

క‌ల్కి 2898 ఏడి.. ప్ర‌భాస్ ముందున్న అతిపెద్ద ఛాలెంజ్!

పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం `కల్కి 2898 AD` పార్ట్ 1 బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.

By:  Sivaji Kontham   |   1 July 2026 9:50 AM IST
క‌ల్కి 2898 ఏడి.. ప్ర‌భాస్ ముందున్న అతిపెద్ద ఛాలెంజ్!
X

పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం `కల్కి 2898 AD` పార్ట్ 1 బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలోని ప్రథమార్ధం ముగింపులో పురాణేతిహాసాలతో ముడిపడిన పాత్రలను చూపించిన విధానంపై అప్పట్లో కొందరు విమర్శకులు పెదవి విరిచారు. పురాణాల్లోని కొన్ని పాత్రల చిత్రణ సరిగా లేదంటూ విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో `కల్కి పార్ట్ 2` లో కర్ణుడి పాత్రను హిస్టారికల్ మైథాలజీలో ఉన్న అసలైన కథకు సరిగ్గా కనెక్ట్ చేస్తూ తీర్చిదిద్దడం దర్శకుడు నాగ్ అశ్విన్‌కు అత్యంత కీలకమైన బాధ్య‌త‌గా మారింది.

`కల్కి 2898 ఏడి` పార్ట్ 2లో కర్ణుడి పాత్రపై కేవలం సాధారణ సినీ అభిమానుల కన్ను మాత్రమే కాదు.. `మహాభారతం` ఫాలోవర్స్ - హిందూవాదుల దృష్టి కూడా బలంగా ఉండబోతోంది. నాగ్ అశ్విన్ విభిన్న కాలాల నేపథ్యంలో.. ఒక సరికొత్త ఫిక్షన్ ప్రపంచాన్ని సృష్టిస్తూనే... మన పురాణాల నుంచి తీసుకున్న పాత్రలను ఎక్కడా పక్కదారి పట్టకుండా బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. సెంటిమెంట్స్ దెబ్బతినకుండా... హిందూవాదుల నుంచి ఎలాంటి విమర్శలు రాకుండా పురాణ ఇతిహాసాల్లోని ప్రాముఖ్యతను కాపాడుతూ ఈ పాత్రను తెరపై ప్రెజెంట్ చేయడం సినిమా విజయానికి ఎంతో అవసరం.

ముఖ్యంగా ఈ రెండో భాగంలో కర్ణుడి పాత్రలోని త్యాగం, బాధ, అంతర్మథనాన్ని మరింత లోతుగా చూపిస్తారా? లేక ప‌రిమితులు ఉన్నాయా? అన్న‌ది ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ నిర్ణ‌యించాలి. కర్ణుడు అంటే కేవలం శౌర్యం, పరాక్రమం మాత్రమే కాదు.. అడుగడుగునా ఒక తీవ్రమైన భావోద్వేగంతో కూడుకున్న పాత్ర అది. అందువల్ల ప్రభాస్ ఈ పాత్రలో కేవలం యాక్షన్ సీన్లకే పరిమితం కాకుండా... తన హావభావాలతో, కళ్లలోనే పలికించే నటనతో విమర్శకులను సైతం మెప్పించాల్సి ఉంటుంది. మొదటి భాగంలో భైరవుడిగా కామిక్ టైమింగ్ చూపిస్తూ వినోదం పంచిన ప్రభాస్.. పార్ట్ 2 లో కర్ణుడిగా వైవిధ్యమైన ఆహార్యాన్ని, గాంభీర్యాన్ని ప్రదర్శించడం న‌టుడిగా ఒక అగ్నిపరీక్ష లాంటిదే.

అయితే, ఈ పాత్ర పరంగా ప్రభాస్‌కు కొన్ని సహజమైన సానుకూలతలు ఉన్నాయి. ప్రభాస్ ఇదివరకు నటించిన బాహుబలి, సలార్ వంటి చిత్రాల్లో డైలాగులు ఎక్కువగా చెప్పకుండా... నిశ్శబ్దంగా ఉంటూనే తన నటనతో, కటౌట్‌తో ప్రేక్షకులను కట్టిపడేశారు. కర్ణుడి లాంటి గొప్ప దార్శ‌నిక‌ హీరో పాత్ర ప్రభాస్ పవర్‌ఫుల్ బాడీ లాంగ్వేజ్‌కు చాలా బాగా సెట్ అవుతుంది. ఆ భారీ రూపానికి ఒక కిరీటం, విల్లు తోడైతే వచ్చే రాజసం మ‌రో లెవ‌ల్ లో ఉంటుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఆ గంభీరమైన కటౌట్ కర్ణుడి పాత్రకు టాలీవుడ్‌లో బెస్ట్ ఆప్షన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

కానీ ఈ అనుకూలతలతో పాటే ఒక పెద్ద సవాల్ ను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. మొదటి భాగంలో దాదాపు సినిమా అంతా భైరవుడి క్యారెక్టర్‌లో కాస్త అల్లరిగా.. కామెడీ టైమింగ్ ప్రదర్శించిన ప్రభాస్‌ను చూసిన ఆడియన్స్.. పార్ట్ 2 లో ఒక్కసారిగా కర్ణుడి పూర్తి స్థాయి ఎమోషనల్ డెప్త్‌ను ఎలా స్వీకరిస్తారనేది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. కథానాయకుడిలోని ఈ రెండు భిన్నమైన కోణాలను థియేటర్లలో ప్రేక్షకులు ఏ మేరకు ఓన్ చేసుకుంటారనేది...నాగ్ అశ్విన్ రాసుకునే స్క్రీన్‌ప్లే- పాత్ర‌ల చిత్ర‌ణ‌.. ప్రభాస్ చూపించే నటనపైనే ఆధారపడి ఉంటుంది.

కర్ణుడి పాత్ర కేవలం ఒక యోధుడిగానే కాకుండా.. అతడి త్యాగం, అనుభవించిన నమ్మకద్రోహం, అతడిలోని అంతర్మథనాన్ని మరింత లోతుగా చూపిస్తామని నాగ్ అశ్విన్ ఓ ఇంట‌ర్వ్యూలో హింట్ ఇచ్చారు. పురాణాల్లో కర్ణుడికి ఉన్న `ట్రాజిక్ హీరో` ఇమేజ్‌ను ప్రభాస్ నటన ద్వారా మరింత ఎమోషనల్‌గా పండించాల్సి ఉంటుంది. అన్నిర‌కాల విమర్శల ముళ్లబాటను దాటి ప్రభాస్ ఈ పాత్రతో సరికొత్త అభిమానాన్ని సాధిస్తాడ‌నే ఆశిద్దాం.