కల్కి డిబేట్: 'మహాభారతం' లో కర్ణుడు గొప్పా? అర్జునుడు గొప్పా?
సినిమాటిక్ లిబర్టీ పేరిట ఒక పాత్రను హీరోగా చూపించే క్రమంలో మరొక చారిత్రక వీరుడిని తక్కువ చేసి చూపించారనే ఆవేదన నెటిజన్లలో వ్యక్తమవుతోంది.
By: Sivaji Kontham | 14 July 2026 11:47 AM ISTనాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన 'కల్కి 2898 AD' చిత్రం అద్భుతమైన దృశ్యకావ్యంగా ప్రశంసలు అందుకుని విజయం సాధించినా దాని క్లైమాక్స్ మాత్రం ఒక పెద్ద వివాదానికి తెరలేపింది. సినిమాలో ప్రభాస్ పోషించిన భైరవ పాత్ర అసలు రూపం 'కర్ణుడు' అని చూపించడం, అలాగే క్లైమాక్స్ యుద్ధంలో అర్జునుడి గాండీవాన్ని కర్ణుడి విల్లు మెరుపుతీగలా ఎదుర్కోవడం వంటి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. అసలు పురాణేతిహాసాల గురించి పెద్దగా అవగాహన లేని నేటి తరం (జెన్ Z) ప్రేక్షకులలో కర్ణుడు, అర్జునుడి కంటే గొప్పవాడు! అనే ఒక తప్పుడు అవగాహనను, భ్రమను ఈ చిత్రం సృష్టించిందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. సినిమాటిక్ లిబర్టీ పేరిట ఒక పాత్రను హీరోగా చూపించే క్రమంలో మరొక చారిత్రక వీరుడిని తక్కువ చేసి చూపించారనే ఆవేదన నెటిజన్లలో వ్యక్తమవుతోంది.
అసలు మహాభారత ఇతిహాసాన్ని తటస్థంగా పరిశీలిస్తే.. యుద్ధ నైపుణ్యాల పరంగానూ, ధర్మ వర్తన పరంగానూ అర్జునుడే సర్వశ్రేష్ఠుడు అని స్పష్టమవుతుంది. మహాభారత యుద్ధానికి ముందే జరిగిన విరాట పర్వ ఉత్తర గోగ్రహణ యుద్ధంలో అర్జునుడు ఒక్కడే ఒంటరిగా భీష్మ, ద్రోణ, కృప, కర్ణ, అశ్వత్థామ వంటి మహామహులనందరినీ ఓడించి విజయం సాధించాడు. కర్ణుడు మహావీరుడే అయినా అనేక సందర్భాల్లో (ఉదాహరణకు ఘటోత్కచుడితో యుద్ధంలో ప్రాణభయంతో వాసవి శక్తిని ఉపయోగించడం, ద్రౌపదీ వస్త్రాపహరణాన్ని సమర్థించడం వంటివి) అతని నైతిక పతనం కనిపిస్తుంది. అర్జునుడు ఎల్లప్పుడూ ధర్మం పక్షాన నిలబడి.. శ్రీకృష్ణుడి మార్గదర్శకత్వంలో కర్తవ్యపాలన చేశాడు. కేవలం దానగుణం ఒక్కటే కర్ణుడిని గొప్పవాడిని చేయదు. ధర్మ స్థాపన కోసం పోరాడిన అర్జునుడే నిజమైన ఉత్తమ వీరుడు అని యువతరం గ్రహించాల్సిన అవసరం ఉంది.
'కల్కి'పై చర్చ: అసలు ప్రశ్న అది కాదు
శ్రీకృష్ణుడే స్వయంగా కర్ణుడిని ఒక సందర్భంలో ప్రశంసించారు! అని నాగ్ అశ్విన్ స్పష్టం చేశారు. కానీ సినిమా విషయంలో అడుగుతున్న అసలు ప్రశ్న అది కాదు. కర్ణుడు, అశ్వత్థామ ఇద్దరూ ప్రతినాయకులైన'కౌరవుల' పక్షాన నిలిచి అకృత్యాలకు పాల్పడ్డారు.. అయినా ఈ సినిమాలో వారిని వీరులుగా చూపించారు. నాగ్ అశ్విన్ ఎప్పుడూ సమాధానం ఇవ్వని అసలు చర్చ ఇదే.
బిబేక్ దేబ్రాయ్ అనువాదం ప్రామాణికమా?
దర్శకుడు నాగ్ అశ్విన్ తన పాత్ర చిత్రణను సమర్థించుకుంటూ బిబేక్ దేబ్రాయ్ రాసిన ఇంగ్లీష్ అనువాదాన్ని చదవాలని సూచించారు. అసలు బిబేక్ దేబ్రాయ్ రాసిన మహాభారతం ప్రామాణికమేనా అంటే... అవును అనొచ్చు. అది అత్యంత విశ్వసనీయమైనది. ఎందుకంటే దేబ్రాయ్ గారు పూణేలోని 'భండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్' (BORI) సుదీర్ఘ పరిశోధనల అనంతరం రూపొందించిన 'క్రిటికల్ ఎడిషన్' ను ఆధారంగా చేసుకుని శ్లోకాల వారీగా దీనిని అనువదించారు. భారతదేశంలో అత్యంత ప్రామాణికంగా భావించే సంస్కృత మహాభారత ప్రతి ఇది. అయితే.. నాగ్ అశ్విన్ సూచించినట్లు ఈ ప్రామాణిక గ్రంథం ఎక్కడా కర్ణుడిని అర్జునుడి కంటే గొప్పవాడిగా ప్రొజెక్ట్ చేయలేదు. వేద వ్యాసుడు రాసిన మహాభారతం నుంచి చాలా విషయాలను దేబ్రాయ్ రాసిన పుస్తకం యథాతథంగా ఉంచింది.
బిబేక్ దేబ్రాయ్ గ్రంథంలో కర్ణుడి ప్రస్తావన ఎలా ఉంది?
బిబేక్ దేబ్రాయ్ తన అనువాదంలో కర్ణుడిని ఒక అసాధారణ వీరుడిగా, దాతగా చూపిస్తూనే... అతనిలోని లోపాలను, అతను చేసిన తప్పులను ఎక్కడా దాచలేదు. దేబ్రాయ్ అనువాదంలో ద్రౌపదిని సభలోకి లాగినప్పుడు కర్ణుడు అన్న కర్కశమైన మాటలు.. అభిమన్యుడిని చుట్టుముట్టి చంపిన కుట్రలో భాగస్వామ్యం వహించడం వంటి చారిత్రక వాస్తవాలు యథాతథంగా ఉన్నాయి. బిబేక్ దేబ్రాయ్ తన రచనలో ఎక్కడా ''కర్ణుడే అర్జునుడి కంటే గొప్పవాడు'' అని రాయలేదు. నాగ్ అశ్విన్ తన సృజనాత్మక మార్పులకు ప్రామాణిక గ్రంథాన్ని రక్షణ కవచంగా వాడుకున్నారే తప్ప నిజానికి దేబ్రాయ్ అనువాదంలో కర్ణుడిని ఎక్కడా 'వైట్‌వాష్' (పాపాలను కడిగేయడం) చేయలేదు. అతడి తప్పులను, ఒప్పులను నిష్పాక్షికంగానే నమోదు చేశారు.
సినిమాటిక్ లిబర్టీ వర్సెస్ చారిత్రక సత్యం:
ఫిక్షన్ (కల్పిత కథలు) రాసేటప్పుడు... పురాణాల స్ఫూర్తితో పాత్రలను సృష్టించేటప్పుడు దర్శకుడికి సృజనాత్మక స్వేచ్ఛ ఉంటుంది. కానీ ఆ స్వేచ్ఛను సమర్థించుకోవడానికి ప్రామాణిక గ్రంథాలను తప్పుగా అన్వయించి మాట్లాడటం వివాదాలకు దారితీస్తుంది. నాగ్ అశ్విన్ తన కథకు అనుగుణంగా కర్ణుడి పాత్రకు ప్రాధాన్యత ఇచ్చుకోవచ్చు.. కానీ అది అసలు మహాభారత సత్యం కాదని ప్రేక్షకులు నేరుగా ప్రశ్నిస్తున్నారు. 'కల్కి 2' లోనైనా దర్శకుడు అర్జునుడి పాత్రకు తగిన గౌరవాన్ని ఇస్తూ.. సమతూకం పాటిస్తారని ఆశిద్దాం. కల్పిత పాత్రల వెనుక ఉన్న సినిమాటిక్ గ్లోరీని చూసి మురిసిపోకుండా... అసలైన ధర్మ మార్గాన్ని, వీరత్వాన్ని యువతరం మహాభారత గ్రంథాల ద్వారా తెలుసుకోవడమే దీనికి సరైన పరిష్కారం.
