Begin typing your search above and press return to search.

కల్కి సక్సెస్.. ఓ సినిమా ఆగిపోవడానికి కారణమైందా?

సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రాజెక్ట్ సక్సెస్ కావడం సాధారణంగా అదే తరహాలో తెరకెక్కుతున్న మరో సినిమాకు మార్కెట్ ను పెంచుతుంది.

By:  Sravani Lakshmi Srungarapu   |   17 Aug 2026 5:44 PM IST
కల్కి సక్సెస్.. ఓ సినిమా ఆగిపోవడానికి కారణమైందా?
X

సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రాజెక్ట్ సక్సెస్ కావడం సాధారణంగా అదే తరహాలో తెరకెక్కుతున్న మరో సినిమాకు మార్కెట్ ను పెంచుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఓ సినిమా స‌క్సెస్.. మరో సినిమా ఆలోచననే మార్చే స్థాయిలో ప్రభావం చూపుతుంది. ఇప్పుడు బాలీవుడ్‌లో షాహిద్ కపూర్ నటించాల్సిన అశ్వత్థామ విషయంలో ఇదే చర్చకు దారితీస్తోంది. ప్రభాస్ ప్రధాన పాత్రలో వచ్చిన కల్కి 2898ఏడీ సృష్టించిన ప్రభావం.. ఇదే మైథాలజీ, ఫ్యూచరిస్టిక్ విజువల్ స్పేస్‌లో తెరకెక్కాల్సిన మరో భారీ ప్రాజెక్ట్‌పై ఆలోచనను మార్చే పరిస్థితిని తీసుకొచ్చింద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

కల్కి 2898ఏడీలో అమితాబ్ బచ్చన్ పోషించిన అశ్వత్థామ పాత్ర ఆడియ‌న్స్ పై ప్రత్యేకమైన ముద్ర వేసింది. మహాభారతంలోని ఓ కీలక పాత్రను ఫ్యూచరిస్టిక్ ప్రపంచంతో ముడిపెట్టి చూపించిన విధానం సినిమాకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. దీంతో అదే పాత్రను కేంద్రంగా చేసుకుని మరో భారీ సినిమా రూపొందించడం అనుకున్నంత ఈజీ కాదనే ప్రశ్న మొదలైంది.

ఒకే తరహా కాన్సెప్ట్‌తో రెండు భారీ సినిమాలు వచ్చినప్పుడు ఆడియ‌న్స్ సహజంగానే వాటిని కంపేర్ చేసి చూస్తారు. కథ, పాత్రల రూపకల్పన, విజువల్స్, యాక్షన్, వ‌ర‌ల్డ్ బిల్డింగ్.. ఇలా ప్రతి అంశంలోనూ పోలికలు వెతుకుతారు. ముఖ్యంగా భారీ బడ్జెట్‌తో రూపొందే సినిమాలకు ఈ పోలిక మరింత ప్రమాదకరంగా మారుతుంది. ఎందుకంటే ఆడియ‌న్స్ కేవలం గ్రాండ్ విజువల్స్‌ను మాత్రమే ఆశించరు. ఇప్పటికే చూసిన దానికంటే కొత్తగా ఏం చూపించబోతున్నారనేది కీలకంగా మారుతుంది.

అయితే అశ్వత్థామ సినిమాను షెల్వ్ చేయడాన్ని కేవలం ఫెయిల్యూర్‌గా చూడాల్సిన అవసరం లేదనే వాదన కూడా ఉంది. భారీ బడ్జెట్ సినిమాల్లో మార్కెట్ సిట్యుయేష‌న్స్, ఆడియ‌న్స్ అంచనాలు, కంటెంట్‌లో కొత్తదనం వంటి అంశాలను ముందుగానే అంచనా వేయడం అత్యంత కీలకం. ఒక ప్రాజెక్ట్‌ను కేవలం అనౌన్స్ చేశామ‌ని ముందుకు తీసుకెళ్లడం కంటే.. సిట్యుయేష‌న్స్ మారినప్పుడు దానిని పునఃపరిశీలించడం ఆర్థికంగా కూడా తెలివైన నిర్ణయమే కావచ్చని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

మరోవైపు కల్కి2పై అంచనాలు కొనసాగుతున్న టైమ్ లో ఇదే మైథాలజీ స్పేస్‌లో కొత్త ప్రాజెక్ట్‌ను తీసుకురావడం మరింత సవాలుగా మారే అవకాశం ఉంది. అందుకే అశ్వత్థామ ఆగిపోవడాన్ని ఒక స్టార్ హీరో భారీ సినిమా మిస్ చేసుకున్న విష‌యంగా మాత్రమే కాకుండా.. మారుతున్న ఆడియ‌న్స్ టేస్ట్‌కు అనుగుణంగా ఫిల్మ్ మేకర్స్ తీసుకుంటున్న స్ట్రాట‌జిక్ డెసిష‌న్ గా కూడా చూడాల్సి ఉంటుంది.