18గం.లు గొడ్డు చాకిరి చేయించుకుని..!
యష్ రాజ్ ఫిలింస్- ధర్మ ప్రొడక్షన్స్ వంటి టాప్ బ్యానర్లు ఇలా చేయడం తనను ఆశ్చర్యపరిచిందని ఆమె అన్నారు.
By: Sivaji Kontham | 3 Nov 2025 10:13 AM ISTగ్లామర్ రంగంలో తెరవెనక సంగతులు బయటికి తెలిసేది చాలా తక్కువ. హీరో, హీరోయిన్, నటీనటులతో చుట్టూ ఎటు చూసినా లగ్జరీ యాంబియెన్స్, వెలుగు జిలుగులు మాత్రమే ఎక్కువగా ఫోకస్ అవుతుంటాయి. కానీ తెరవెనక చాలీ చాలని భత్యాలతో కూలి పని చేసే వారి గురించి తెలిసింది చాలా తక్కువ. కొందరు తమ పనికి సరిపడా వేతనం అందడం లేదని ఆవేదన చెందుతుంటారు. సినీకార్మికుల పోరాటాల గురించి ఎంత చెప్పినా తక్కువే.
సాధారణంగా 8 గంటలు లేదా 10 గంటల పాటు పని చేయడం సహజమే అయినా తనతో రోజుకు 18 గంటల పాటు పని చేయించుకుని, చివరికి చాలీ చాలని వేతనం ఇచ్చేవారని అమెరికాకు చెందిన ఒక సెట్ డిజైనర్ తన ఆవేదనను వ్యక్తం చేసారు. యష్ రాజ్ ఫిలింస్- ధర్మ ప్రొడక్షన్స్ వంటి టాప్ బ్యానర్లు ఇలా చేయడం తనను ఆశ్చర్యపరిచిందని ఆమె అన్నారు. ఈ బ్యానర్లు తెరకెక్కించిన `కల్ హో నా హో` చిత్రానికి తాను పని చేసానని, కానీ గొడ్డు చాకిరి చేయించుకుని కేవలం 75 డాలర్లు మాత్రమే చెల్లించేవారని ఆమె తెలిపారు. రోజూ 17-18 గంటల పాటు పని చేసేదానిని. అక్కడ సినిమాలో భారతీయ రెస్టారెంట్ గా ఉపయోగించిన ఒక డైనర్ ను రీమోడలింగ్ చేసే పనిని తనకు అప్పగించారని, కానీ పనికి తగ్గ వేతనం ఏరోజూ ఇవ్వలేదని ఆమె తెలిపారు.
2003లో విడుదలైన `కల్ హో నా హో` చిత్రానికి నిఖిల్ అద్వాణీ దర్శకత్వం వహించారు. షారుఖ్ ఖాన్, ప్రీతి జింటా, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో తారల గ్లామ్ అండ్ గ్లిజ్ సహా భావోద్వేగాలు ప్రధాన హైలైట్. కల్ హో నహో బాలీవుడ్ క్లాసిక్ హిట్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. కానీ మేకింగ్ వెనక చాలా తెలియని నిజాలు ఉంటాయి. అవన్నీ ఇటీవల పాడ్ కాస్ట్ ల కారణంగా వెలుగు చూస్తున్నాయి. ఆమె ఇప్పుడు సెట్ డిజైనర్ ఉద్యోగం వదిలేసి ఇన్ ఫ్లూయెన్సర్ గా మారడం తన జీవితంలో మేలి మలుపు.
