Begin typing your search above and press return to search.

షూటింగ్‌లకు కొత్త రూల్స్.. స్టార్ హీరోయిన్లు ఇండస్ట్రీని మార్చేస్తున్నారా?

ఒకప్పుడు సినిమా షూటింగ్ అంటే తెల్లవారుజాము నుంచి అర్థరాత్రి వరకు కొనసాగే వ‌ర్కింగ్ డేస్ గా సహజంగా భావించేవారు. షూటింగ్ పూర్తయ్యే వరకు టైమ్ కు పెద్దగా ప్రాధాన్యం ఉండేది కాదు.

By:  Sravani Lakshmi Srungarapu   |   5 July 2026 3:00 PM IST
షూటింగ్‌లకు కొత్త రూల్స్.. స్టార్ హీరోయిన్లు ఇండస్ట్రీని మార్చేస్తున్నారా?
X

ఒకప్పుడు సినిమా షూటింగ్ అంటే తెల్లవారుజాము నుంచి అర్థరాత్రి వరకు కొనసాగే వ‌ర్కింగ్ డేస్ గా సహజంగా భావించేవారు. షూటింగ్ పూర్తయ్యే వరకు టైమ్ కు పెద్దగా ప్రాధాన్యం ఉండేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు క్రమంగా మారుతున్నట్లు కనిపిస్తున్నాయి. ప‌ర్స‌న‌ల్ లైఫ్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, మానసిక ఆరోగ్యం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ స్టార్ హీరోయిన్స్ తమ వ‌ర్కింగ్ అవ‌ర్స్ విషయంలో చాలా క్లియ‌ర్ రూల్స్ పెట్టడం చర్చనీయాంశంగా మారుతోంది.

ఇటీవల వ‌ర్కింగ్ అవ‌ర్స్ లిమిట్ పై తన అభిప్రాయాన్ని వెల్లడించి పెద్ద డిస్క‌ష‌న్ కు కారణమైన దీపిక పదుకొనే తర్వాత, ఇప్పుడు కాజల్ అగర్వాల్ కూడా అదే దిశగా స్పందించడం ఈ అంశాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. పెళ్లి, మాతృత్వం తర్వాత తన లైఫ్ లో ప్రియారిటీస్ మారాయని, ఫ్యామిలీకి టైమ్ కేటాయించడం కూడా వృత్తిపరమైన బాధ్యతలెంత ముఖ్య‌మో అంతే ముఖ్యమని ఆమె స్పష్టం చేశారు. అందుకే వ‌ర్కింగ్ అవ‌ర్స్ తో పాటూ వారానికి ఒక రోజు పూర్తిగా ఫ్యామిలీకే కేటాయించేలా ముందుగానే అగ్రిమెంట్ లో పేర్కొంటున్నట్లు వెల్లడించారు.

కాజల్ కామెంట్స్ కేవలం ఆమె ప‌ర్స‌న‌ల్ డెసిష‌న్ గా మాత్రమే కాకుండా, సినీ ఇండ‌స్ట్రీలో మారుతున్న వ‌ర్క్ క‌ల్చ‌ర్ కు ప్రతిబింబంగా కూడా కనిపిస్తున్నాయి. ఇతర రంగాల్లో ఉద్యోగులకు ప‌ర్టిక్యుల‌ర్ వ‌ర్క్ అవ‌ర్స్, వీకెండ్ హాలీడేస్, ప‌ర్స‌న‌ల్ టైమ్ కు గౌరవం ఉండగా, సినిమా రంగంలో మాత్రం ఇప్పటికీ లాంగ్ షూటింగ్స్ సాధార‌ణంగా కొనసాగుతున్నాయనే విమర్శలు ఎప్పటినుంచో ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఆర్టిస్టులు కూడా తమ హెల్త్, ఫ్యామిలీ, ప‌ర్స‌న‌ల్ లైఫ్ ను దృష్టిలో పెట్టుకుని పని విధానంలో మార్పులు కోరుకోవడం సహజమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు నిర్మాతలు, డైరెక్ట‌ర్ యాంగిల్ కూడా భిన్నంగానే ఉంటుంది. భారీ బడ్జెట్ సినిమాలు, అనేక మంది నటీనటుల డేట్లు, లొకేషన్ పరిమితులు, వాతావరణ పరిస్థితులు వంటి అంశాల మధ్య షూటింగ్ షెడ్యూల్‌ను నిర్వహించడం ఇప్పటికే పెద్ద సవాలుగా మారింది. ఇలాంటి టైమ్ లో ప్రతి యాక్ట‌ర్ వేర్వేరు టైమ్ లిమిట్స్ విధిస్తే ప్రాజెక్టుల షూటింగ్ ప్లాన్ పై ప్రభావం చూపే అవకాశముందని పరిశ్రమలోని కొందరు భావిస్తున్నారు.

అయితే వ‌ర్క్ అవ‌ర్స్ పై జరుగుతున్న ఈ డిస్క‌ష‌న్ ను కేవలం స్టార్ హీరోయిన్ల డిమాండ్‌గా మాత్రమే చూడలేం. ఇది ఆర్టిస్టుల‌ హక్కులు, హెల్తీ వ‌ర్క్ క‌ల్చ‌ర్, మానసిక ప్రశాంతత వంటి విస్తృత అంశాలతో ముడిపడి ఉంది. సుదీర్ఘ షూటింగ్‌ల వల్ల ఏర్పడే శారీరక అలసట, ఒత్తిడి, కుటుంబానికి దూరమయ్యే పరిస్థితులు కూడా ఇప్పుడు చర్చలోకి వస్తున్నాయి. ప్రత్యేకంగా పెళ్లి, పిల్లల తర్వాత కెరీర్‌ను కొనసాగిస్తున్న నటీమణులు తమ వ్యక్తిగత బాధ్యతలు, వృత్తి మధ్య సమతుల్యతను కోరుకోవడం కొత్త ఆలోచన కాదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టి పని చేయడం స‌క్సెస్ కు ప్రమాణంగా భావిస్తే, ఇప్పుడు బ్యాలెన్డ్స్ లైఫ్‌స్టైల్‌నే స‌క్సెస్ కు కొత్త డెఫినిష‌న్ గా చూస్తున్నారు. కాజల్ కామెంట్స్ తో మరోసారి తెరపైకి వచ్చిన ఈ డిస్క‌ష‌న్ ఫ్యూచ‌ర్ లో మరింత మంది నటీనటులు కాంట్రాక్టుల్లో వ‌ర్క్ అవ‌ర్స్ కు సంబంధించిన స్పష్టమైన నిబంధనలు చేర్చే పరిస్థితిని తీసుకురావొచ్చు. ఒకప్పుడు 14 నుంచి 16 గంటల షూటింగ్‌లు ఇండ‌స్ట్రీలో సహజమైతే, రానున్న రోజుల్లో సమయపాలన, వర్క్- లైఫ్ బ్యాలెన్స్ కూడా సినిమా నిర్మాణంలో కీలక ప్రమాణాలుగా మారతాయా అన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది.