సెకండ్ ఇన్నింగ్స్ కలిసిరాని హీరోయిన్స్.. మరి కాజల్?
రెండో ఇన్నింగ్స్‌లో కాజల్‌కు 'భగవంత్ కేసరి' మినహా మరో చెప్పుకోదగ్గ హిట్ పడలేదు. ఇక ప్రస్తుతం ఆమె ఆశలన్నీ నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో రాబోతున్న తదుపరి చిత్రంపైనే ఉన్నాయి.
By: Madhu Reddy | 28 July 2026 3:40 PM ISTచిత్ర పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా ఏలిన భామలు పెళ్లి లేదా లాంగ్ గ్యాప్ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడం సహజం. అయితే రీఎంట్రీలో పూర్వ వైభవాన్ని, అనుకున్న స్థాయి విజయాలను అందుకోవడం అందరికీ సాధ్యపడటం లేదు. భూమిక, లైలా, మీరా జాస్మిన్, లయ లాంటి సీనియర్ హీరోయిన్ల జాబితాలోనే ఇప్పుడు చందమామ కాజల్ అగర్వాల్ కూడా చేరిపోయారా? అనే చర్చ టాలీవుడ్‌లో వేడెక్కిస్తోంది..పూర్తి వివరాల్లోకి వెళితే..
రీఎంట్రీలో తడబడిన స్టార్ హీరోయిన్లు:
గతంలో స్టార్ హీరోయిన్లుగా వెలిగిన భూమికా చావ్లా పెళ్లి తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రీఎంట్రీ ఇచ్చినా లీడ్ రోల్స్ దక్కలేదు ఇక మొన్న వచ్చిన యుఫోరియా కూడా ఆశించినంత రిజల్ట్ రాలేదు. లైలా, మీరా జాస్మిన్ లాంగ్ గ్యాప్ తర్వాత తిరిగొచ్చినా ఆశించిన అవకాశాలు రాలేదు. ఇక ఇటీవల లయ రెండు సినిమాలతో ఒకే రోజు వచ్చినా, పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. సెకండ్ ఇన్నింగ్స్ ఈ ముద్దుగుమ్మలందరికీ అనుకున్నంతగా కలిసిరాలేదనే చెప్పాలి.
కాజల్ ప్రయత్నాలు.. దురదృష్టం:
పెళ్లి, తర్వాత రీఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్.. కేవలం కమర్షియల్ పాత్రలకే పరిమితం కాకుండా పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలను ఎంచుకున్నారు. అయితే దురదృష్టం ఆమెను మొదటి నుంచీ వెంటాడుతోంది. 'ఆచార్య'లో ఆమె నటించిన సీన్లు మొత్తానికే ఎడిటింగ్ లో ఎగిరిపోగా, 'ఇండియన్ 2' డిజాస్టర్ అవ్వడంతో తదుపరి పార్ట్‌పై ఆశలు అడుగంటిపోయాయి.
బాక్సాఫీస్ వద్ద దెబ్బకొట్టిన ప్లాప్‌లు:
కాజల్ ప్రధాన పాత్రలో నటించిన 'సత్యభామ' చిత్రం ఆమె క్రేజ్‌ను తిరగరాయలేకపోయింది. ఇక 'కన్నాప్ప' సినిమా కూడా ఆమె కెరీర్‌కు పెద్దగా ఉపయోగపడలేదు. ఇక ఇటీవల వచ్చిన 'ది ఇండియా స్టోరీ'పై కాజల్ కొండంత ఆశలు పెట్టుకుని, మునుపెన్నడూ లేని విధంగా ప్రమోషన్లు చేసినప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది.
'భగవంత్ కేసరి' ఒక్కటే కాస్త రిలీఫ్:
రెండో ఇన్నింగ్స్‌లో కాజల్‌కు 'భగవంత్ కేసరి' మినహా మరో చెప్పుకోదగ్గ హిట్ పడలేదు. ఇక ప్రస్తుతం ఆమె ఆశలన్నీ నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో రాబోతున్న తదుపరి చిత్రంపైనే ఉన్నాయి. మరి ఈ సినిమా అయినా ఆమెకు డ్రీమ్ కమ్‌బ్యాక్ సక్సెస్‌ను అందిస్తుందో లేదో చూడాలి.
బాలయ్య సినిమాతోనైనా గట్టెక్కేనా?:
ఎంతోమంది హీరోయిన్లకు సెకండ్ ఇన్నింగ్స్ సవాళ్లతో కూడుకున్నదిగా మారింది. వరుస ప్లాప్‌లు పడుతున్నప్పటికీ కాజల్ ఏమాత్రం తగ్గకుండా వరుస ప్రాజెక్టులు చేస్తూనే ఉన్నారు. ఇక బాలకృష్ణతో చేయబోయే సినిమాతోనైనా కాజల్ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కి, తన సెకండ్ ఇన్నింగ్స్‌ను విజయవంతంగా కొనసాగించాలని అభిమానులు ఆశిస్తున్నారు.
