#NBK111 : ఈసారి అలాంటి పాత్ర కాదట..!
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెల్సిందే. వీరిద్దరి కాంబోలో ఇంతకు ముందు వచ్చిన వీర సింహారెడ్డి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
By: Ramesh Palla | 9 July 2026 12:05 PM ISTనందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెల్సిందే. వీరిద్దరి కాంబోలో ఇంతకు ముందు వచ్చిన వీర సింహారెడ్డి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో బాలయ్య సినిమాలన్నీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంటున్న నేపథ్యంలో NBK111 విషయంలో హైప్ పెరుగుతూ వస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్ నటించబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. ఇప్పటికే సినిమా నుంచి కాజల్ అగర్వాల్ లుక్‌ను రివీల్ చేయడం జరిగింది. పవర్ ఫుల్ ఆఫీసర్ పాత్రలో కాజల్ కనిపించబోతున్నట్లుగా ఆ లుక్‌ను చూస్తే అర్థం అవుతుంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ పాత్ర ఏంటా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో ఆమె నుంచి క్లారిటీ వచ్చింది.
భగవంత్ కేసరి సినిమాలో కాజల్ అగర్వాల్..
సాధారణంగా కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్స్ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు అనే అభిప్రాయం ఉంది. ఇంతకు ముందు బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన భగవంత్ కేసరి సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమాలో కాజల్ అగర్వాల్ పాత్ర కూరలో కరివేపాకు అన్నట్లుగా ఉంటుంది. లేకున్నా ఏం పర్వాలేదు అన్నట్లుగా కాజల్ పాత్ర ఉందని ఆ సమయంలో కొందరు కామెంట్ చేశారు. మరికొన్ని సినిమాల్లోనూ కాజల్ అగర్వాల్ అలాంటి పాత్రలే చేయడంతో ఇప్పుడు బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో రూపొందుతున్న సినిమాలోనూ కాజల్ అగర్వాల్ పాత్ర అలాగే ఉంటుందేమో అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలోనూ కాజల్ అగర్వాల్ పాత్ర గురించి మీమ్స్ వస్తున్న నేపథ్యంలో స్వయంగా కాజల్ అగర్వాల్ క్లారిటీ ఇచ్చింది.
బాలకృష్ణ NBK111 సినిమాలో కాజల్..
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ.. ఇంతకు ముందు చేసిన పాత్రలు, సినిమాలతో పోల్చితే ప్రస్తుతం బాలకృష్ణ, గోపీచంద్ మలినేని మూవీ చాలా ప్రత్యేకం అంది. అంతే కాకుండా సినిమాలో తాను క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ పాత్రలో సీరియస్‌గా కనిపించబోతున్నాను. బాలయ్యతో ఇంతకు ముందు చేసిన సినిమాలో మాదిరిగా ఫన్నీగా కాకుండా సీరియస్ రోల్ లో NBK111 మూవీలో కనిపిస్తాను అన్నట్లుగా చెప్పుకొచ్చింది. కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీలో అడుగు పెట్టి సుదీర్ఘ కాలం అవుతున్నప్పటికీ ఇంకా స్టార్ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు దక్కించుకుంటూ ఉందంటే ఈమె క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. NBK111 సినిమాలో సీరియస్ రోల్ చేసి, మంచి పేరు దక్కించుకుంటే మరిన్ని పెద్ద సినిమా ఆఫర్లు ఈ అమ్మడి తలుపు తట్టే అవకాశం ఉందని విశ్లేషకులు, ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ..
బాలకృష్ణను విభిన్నమైన గెటప్ లో గోపీచంద్ మలినేని ఈ సినిమాలో చూపించబోతున్నట్లు చెబుతున్నారు. ఇంతకు ముందు వీరి కాంబోలో వచ్చిన వీర సింహా రెడ్డి సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేసిన విషయం తెల్సిందే. తండ్రి, కొడుకు పాత్రల్లో నటించి మెప్పించాడు. అందుకే మరోసారి డ్యూయల్ రోల్ అయితే బాగుంటుందని అంతా భావిస్తున్నారు. దర్శకుడు ఏం ప్లాన్ చేశాడు, ఇప్పటి వరకు ఆయన నుంచి ఎలాంటి లీక్ బయటకు రాలేదు. కానీ సినిమా వీర సింహా రెడ్డి సినిమాను మించి భారీ విజయాన్ని సొంతం చేసుకోబోతుంది అని అంటున్నారు. బాలకృష్ణ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బడ్జెట్‌తో ఈ సినిమాను వృద్ధి సినిమాస్ బ్యానర్‌లో కిలారు వెంకట సతీష్ నిర్మిస్తున్నారు. ఇక సంగీతాన్ని తమన్ అందిస్తున్నాడు. బాలకృష్ణ సినిమాలకు తమన్ వరుసగా సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి బాలయ్య ఫ్యాన్స్ కి హై తెప్పిస్తానంటూ తమన్ హామీ ఇస్తున్నాడు. ఈ సినిమా విడుదల తేదీ విషయమై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
