Begin typing your search above and press return to search.

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

భారీ చిత్రాల్లో నటిస్తున్నా కాజల్ అగర్వాల్ పాత్రలు మాత్రం ప్రేక్షకులకు ఆలస్యంగా పరిచయమవుతున్నాయి. 'ఇండియన్ 2'లో ఆమె సన్నివేశాలను మూడో భాగం కోసం ఉంచగా, 'రామాయణం' మొదటి భాగంలో మండోదరి పాత్రకు ఐదు నిమిషాలైనా స్క్రీన్ టైమ్ దక్కలేదు. అయితే రెండో భాగంలో తన పాత్రకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని కాజల్ గతంలోనే వెల్లడించారు. మరోవైపు 'సత్యభామ', 'కన్నప్ప' వంటి సినిమాల్లో కీలక పాత్రలు చేశారు.

By:  M Prashanth   |   6 Nov 2026 11:19 AM IST
కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!
X

ఒకప్పుడు తెలుగు, తమిళ సినిమాల్లో స్టార్ హీరోల సరసన వరుస అవకాశాలు అందుకున్న కాజల్ అగర్వాల్‌కు ఇప్పుడు విచిత్రమైన పరిస్థితి ఎదురవుతోంది. భారీ సినిమాల్లో నటిస్తున్నా ఆమె పాత్రల కోసం ప్రేక్షకులు రెండో భాగం వరకు ఎదురుచూడాల్సి వస్తోంది. కమల్ హాసన్ 'ఇండియన్' సిరీస్‌లో ఎదురైన అనుభవమే ఇప్పుడు మరో పెద్ద ప్రాజెక్టులోనూ కనిపిస్తోంది. దీంతో కాజల్ ఎంచుకుంటున్న పాత్రల గురించి డిఫరెంట్ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'ఇండియన్ 2' కోసం కాజల్ షూటింగ్‌లో పాల్గొన్నారు. సినిమా సెట్స్‌పై ఉన్నప్పటి నుంచే ఆమె పాత్రపై అభిమానుల్లో ఆసక్తి ఉండేది. కానీ 2024లో రెండో భాగం విడుదలైనప్పుడు కాజల్ తెరపై కనిపించలేదు. ఆమె నటించిన సన్నివేశాలను 'ఇండియన్ 3' కోసం ఉంచినట్లు తెలిపారు. కానీ ఆ సినిమా రిలీజ్ పై ఇంకా సరైన క్లారిటీ రావడం లేదు.

ఇప్పుడు నితీశ్ తివారీ తెరకెక్కించిన 'రామాయణం'లోనూ కాజల్‌కు దాదాపు అలాంటి అనుభవమే ఎదురైంది. రావణుడిగా యశ్ నటించగా, ఆయన భార్య మండోదరి పాత్రను కాజల్ పోషించారు. అయితే మొదటి భాగంలో ఆమె కనీసం 5 నిమిషాల సీన్ పడలేదు. యశ్‌కు మంచి ప్రాధాన్యం దక్కినా ఆయనతో కాజల్ సన్నివేశాలు పరిమితంగానే ఉన్నాయి.

అయితే 'రామాయణం' విషయంలో కాజల్‌కు తన పాత్ర నిడివిపై ముందుగానే అవగాహన ఉంది. మొదటి భాగంతో పోలిస్తే రెండో భాగంలో మండోదరికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కథలో రావణుడి భార్యగా మండోదరికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా రావణుడి నిర్ణయాలను ప్రశ్నించే సందర్భాల్లో ఆ పాత్రకు నటనకు అవకాశం ఉంటుంది. ఆ సన్నివేశాలను రెండో భాగంలో ఎలా ఉపయోగించుకుంటారనేది చూడాలి.

ఇక 'ఇండియన్ 2' ఆశించిన విజయం సాధించకపోవడంతో మూడో భాగం విడుదలపై కన్ఫ్యూజన్ ఉంది. ఈమధ్య ఒక పోస్టర్ తో హింట్ ఇచ్చినా కాజల్ నటించిన సన్నివేశాలను ఎంతవరకు హైలెట్ చేస్తారనేది కీలకం. మరోవైపు 'రామాయణం'ను మొదటి నుంచే రెండు భాగాలుగా ప్లాన్ చేశారు. అందుకే మండోదరి పాత్రకు రెండో భాగంలో ఎక్కువ స్కోప్ ఉండటం కథలో భాగమే.

కాజల్ కెరీర్‌లో ఈమధ్య కొన్ని మెయిన్ క్యారెక్టర్లు చేసిన సినిమాలు కూడా వచ్చాయి. 'సత్యభామ'లో పోలీస్ అధికారిణిగా కనిపించారు. అటు 'కన్నప్ప'లో పార్వతి పాత్రను పోషించారు. ఇలా ఒకవైపు తన పాత్ర చుట్టూ కథ నడిచే సినిమాలు చేస్తూనే, మరోవైపు భారీ ప్రాజెక్టుల్లో తక్కువ స్క్రీన్ టైమ్ ఉన్న పాత్రలను కూడా ఎంచుకుంటున్నారు. ఇక నెక్స్ట్ ఎలాంటి సినిమాలు చేస్తారో చూడాలి.