Begin typing your search above and press return to search.

మగధీర షూటింగ్‌లో కాజల్‌కు చరణ్ స్పెషల్ టార్చర్!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉండగా, ఆయనతో కలిసి పనిచేసిన సహనటులు చరణ్ వ్యక్తిత్వంపై ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   31 May 2026 3:12 PM IST
మగధీర షూటింగ్‌లో కాజల్‌కు చరణ్ స్పెషల్ టార్చర్!
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉండగా, ఆయనతో కలిసి పనిచేసిన సహనటులు చరణ్ వ్యక్తిత్వంపై ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. తాజాగా స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మగధీర షూటింగ్ రోజులను గుర్తు చేసుకుంటూ చెప్పిన ఓ సరదా సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

టాలీవుడ్ హిస్ట‌రీలో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన మగధీర సినిమా రామ్ చరణ్ కెరీర్‌లోనే కాకుండా కాజల్ కెరీర్‌లో కూడా మైలురాయిగా నిలిచింది. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో యుద్ధ సన్నివేశాలు, గుర్రపు స్వారీ ఎపిసోడ్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే ఆ అద్భుతమైన సన్నివేశాల వెనుక సెట్స్‌లో జరిగిన కొన్ని సరదా జ్ఞాపకాలను తాజాగా కాజల్ బయటపెట్టారు.

మగధీర షూటింగ్ టైమ్ లో చరణ్ తన సొంత గుర్రం బాదల్‌ను తరచూ సెట్స్‌కు తీసుకువచ్చేవాడట. యాక్షన్ మరియు గుర్రపు స్వారీ సీన్స్ కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ పొందిన‌ ఆ గుర్రంతో చరణ్‌కు మంచి అనుబంధం ఉండేదని ఆమె తెలిపారు. అయితే షూటింగ్ గ్యాప్‌లో చరణ్ చేసే అల్లరి మాత్రం మరింత ఆసక్తికరంగా ఉండేదట. కాజల్ సెట్స్‌లో కనిపించిన ప్రతిసారీ బాదల్.. బాదల్.. అంటూ గుర్రాన్ని పిలుస్తున్నట్లుగా నటిస్తూ తనను ఆటపట్టించేవాడని నవ్వుతూ గుర్తు చేసుకున్నారు. ఆ నాటి షూటింగ్ లో జరిగిన ఆ చిన్న చిన్న సంఘటనలు ఇప్పటికీ తన మదిలో సజీవంగా ఉన్నాయని కాజల్ వెల్లడించారు. స్టార్ హీరో అయినప్పటికీ చరణ్ ఎప్పుడూ సెట్స్‌లో హాయిగా, సరదాగా ఉండేవాడని ఆమె పేర్కొన్నారు.

అయితే కాజల్ కేవలం ఈ సరదా జ్ఞాపకాలకే పరిమితం కాలేదు. రామ్ చరణ్ వ్యక్తిత్వం, క్రమశిక్షణ గురించి కూడా ప్రశంసలు కురిపించారు. తనతో కలిసి మగధీర, నాయక్, గోవిందుడు అందరివాడేలే లాంటి సినిమాల్లో పనిచేసిన అనుభవంతో చెబుతున్నానని, చరణ్ ప్రతి ఒక్కరినీ ఎంతో గౌరవంగా చూసుకుంటాడని తెలిపారు. కొత్తవాళ్లు, సీనియర్లు అనే తేడా లేకుండా అందరితో ఒకే విధంగా మెలుగుతాడని చెప్పారు.

అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవితో కూడా పనిచేసిన అనుభవం తనకు ఉందని, తండ్రీ కొడుకులు ఇద్దరిలోనూ ఒకే విధమైన క్రమశిక్షణ, వినయం కనిపిస్తాయని కాజ‌ల్ పేర్కొన్నారు. చిరంజీవి గారు, రామ్ చరణ్ ఇద్దరూ వ్యక్తిత్వంలో, పనిపట్ల ఎంతో డెడేకేష‌న్ తో ఒకరికి ఒకరు ప్రతిబింబంలా ఉంటారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఒకవైపు పెద్ది రిలీజ్‌కు సిద్ధమవుతుండగా, మరోవైపు మగధీర రోజుల జ్ఞాపకాలు మరోసారి అభిమానుల్లో నాస్టాల్జియాను నింపుతున్నాయి. చరణ్ స్టార్‌డమ్ వెనుక ఉన్న క్రమశిక్షణతో పాటు ఆయనలోని సరదా మనస్తత్వాన్ని కూడా కాజల్ మాటలు మరోసారి ప్రేక్షకులకు పరిచయం చేశాయి.