'ఖైదీ 2' కోసం లోకేష్ పిలిస్తే వెళ్లడమే!
అయితే లోకేష్ కనకరాజ్ ఇటీవల `డీసీ` చిత్రంతో నటుడిగా మారడం ... ఆ సినిమా సక్సెస్ కావడంతో ఆయన దర్శకత్వ ప్రణాళికల్లో ఆలస్యం చోటుచేసుకుంటుంది.
By: Srikanth Kontham | 4 Sept 2026 6:00 AM ISTదక్షిణాది చలనచిత్ర పరిశ్రమలో సరికొత్త ట్రెండ్‌ను సెట్ చేసిన లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)కి పునాది వేసిన చిత్రం `ఖైదీ`. కార్తీ కథానాయకుడిగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనం చిన్నది కాదు. ఈ సినిమా ముగింపులోనే కొనసాగింపుగా `ఖైదీ 2` ఉంటుందని ప్రకటించడంతో అప్పటి నుంచి సీక్వెల్ ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే లోకేష్ కనకరాజ్ ఇటీవల `డీసీ` చిత్రంతో నటుడిగా మారడం ... ఆ సినిమా సక్సెస్ కావడంతో ఆయన దర్శకత్వ ప్రణాళికల్లో ఆలస్యం చోటుచేసుకుంటుంది. లోకేష్ దర్శకత్వంలో రావాల్సిన కొన్ని ప్రతిష్టాత్మక చిత్రాలు పెండింగ్‌లో పడ్డాయి. అందులోనూ ఎల్ సీయూ లో అత్యంత కీలకమైన `ఖైదీ 2` పట్టాలెక్కడంలో ఆలస్యం కావడం అభిమానులను కొంత నిరాశకు గురి చేస్తోంది.
ఈ వరుస పరిణామాల నేపథ్యంలో ఖైదీ సీక్వెల్ గురించి సోషల్ మీడియాలోనూ అనేక ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై కథానాయకుడు కార్తీ స్పందిస్తూ స్పష్టమైన ప్రకటన చేశారు. `ఖైదీ 2` కోసం నేను కూడా మీలాగే ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నాను. లోకేష్ నుంచి పిలుపు రావడమే ఆలస్యం. నేను షూటింగ్‌కు వెళ్లడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాను` అని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలతో ప్రాజెక్ట్ రద్దయిందనే ప్రచారానికి స్వస్తి పలకడమే కాకుండా సినిమా కచ్చితంగా ఉంటుందని మరోసారి తేల్చిచెప్పారు.
కార్తీ ప్రకటనతో `ఖైదీ 2`పై అభిమానుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. లోకేష్ కనకరాజ్ ప్రస్తుతం ఉన్న కమిట్‌మెంట్లు పూర్తి చేసిన వెంటనే సీక్వెల్‌ను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. డిల్లీ పాత్రలో కార్తీ నటన ...కూతురి సెంటిమెంట్, ఆ రాత్రి జరిగే హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాను మళ్లీ వెండితెరపై చూడాలని ప్రేక్షకులు తహతహలాడుతున్నారు. మొదటి భాగం కంటే రెండవ భాగాన్ని మరిన్ని ఎల్ సీయూ కనెక్షన్లతో భారీ స్కేల్‌లో ప్లాన్ చేస్తున్నారు.
లోకేష్ కనకరాజ్ యూనివర్స్‌లో ఢిల్లీ పాత్రే అత్యంత ప్రాధాన్యమైనది. `విక్రమ్`, `లియో` చిత్రాలలో కూడా డిల్లీ పాత్రకు సంబంధించిన రిఫరెన్సులు ఉండటంతో `ఖైదీ 2` కథ ఎలాంటి మలుపు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. లోకేష్ త్వరలోనే `ఖైదీ 2` ప్రీ-ప్రొడక్షన్ పనులపై దృష్టి పెడతారని కోలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి.
పాన్-ఇండియా స్థాయిలో భారీ అంచనాలున్న `ఖైదీ 2` పట్టాలెక్కడమే ఆలస్యమైనా? బాక్సాఫీస్ వద్ద సంచలనాలు నమోదు చేయడం ఖాయంగా అభిమానలు భావిస్తున్నారు. కార్తీ సిద్ధంగా ఉన్నానని చెప్పడంతో ఇప్పుడు బంతి లోకేష్ కోర్టులోనే ఉంది. మరి లోకేష్ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ కోసం ఎప్పుడు క్లాప్ కొడతారో? అభిమానులకు ఆ స్వీట్ న్యూస్ ఎప్పుడు? అందిస్తారో చూడాలి.
