'పెద్ద బొట్టు వెట్టిందిరా ఎల్లమ్మ'.. జనాలను కదిలించే జాతర గీతం!
తెలుగు జానపద సంస్కృతి, తెలంగాణ మట్టి వాసనను ఉట్టిపడేలా తెరకెక్కిన అద్భుతమైన జాతర గీతం `పెద్ద బొట్టు వెట్టిందిరా ఎల్లమ్మ`.
By: Sivaji Kontham | 5 Oct 2026 8:11 AM ISTతెలుగు జానపద సంస్కృతి, తెలంగాణ మట్టి వాసనను ఉట్టిపడేలా తెరకెక్కిన అద్భుతమైన జాతర గీతం `పెద్ద బొట్టు వెట్టిందిరా ఎల్లమ్మ`. నక్షత్ర మూవీస్ పతాకంపై కల్వకోట వెంకట రమణ, ఎస్.ఆర్. కళ్యాణమండపం రాజు నిర్మిస్తున్న `గౌడ్‌సాబ్` చిత్రం నుంచి ఈ పాట ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో బ్లాక్‌బస్టర్ పాటలకు కొరియోగ్రఫీ అందించిన గణేష్ మాస్టర్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
ఎల్లమ్మ తల్లి ఆభరణాలను ఎంతో వైభవంగా తీర్చిదిద్ది.. దాదాపు 200 మంది నర్తకులతో ఎక్కడా రాజీ పడకుండా ఈ పాటను తెరకెక్కించిన తీరు అద్భుతం. `పెద్ద బొట్టు… ఎత్తు ఎత్తు` అనే హుక్ లైన్ మొదటిసారి వినగానే ప్రేక్షకులను ఆకట్టుకునేలా బలమైన ఐడెంటిటీని సృష్టించింది. లిరికల్ వీడియో మెరిపించగా ఫుల్ వీడియో సాంగ్ పైనా అంచనాలు పెరిగాయి.
ఈ పాటకు సంగీతంతో పాటు సాహిత్యన్ని కూడా అందించిన వెంగి, తెలంగాణ జానపద మూలాన్ని చెక్కు చెదరకుండా అలాగే ఉంచుతూ సినిమా స్థాయికి తగ్గట్టు మాస్ ఎనర్జీని జోడించారు. ``పెద్ద బొట్టు వెట్టిందిరా ఎల్లమ్మ`` అనే పల్లవి పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. తెలంగాణ సంస్కృతి, ఎల్లమ్మ ఆరాధన, బోనాల జాతర వాతావరణం వంటి స్థానిక అంశాలను జోడించడం ద్వారా ఈ పాట ప్రాంతీయ గొప్పతనాన్ని చాటిచెప్పింది. ముఖ్యంగా ఆర్టిస్ట్ ఎనర్జిటిక్ నృత్యశైలికి తగ్గట్టుగా.. నేపథ్యంలోని బేబి సురేష్ భీమగని కళా దర్శకత్వం (సెట్లు- కలర్ గ్రేడింగ్) కూడా ప్రత్యేకతను ఆపాదించిందని చెప్పాలి. ఇలాంటి జానపదాలు వినగా వినగా వాటిలోని మట్టివాసన- సంస్కృతి హృదయాలను తాకుతుంది.
ఈ పాటలో ప్రముఖ గాయకుడు కైలాష్ ఖేర్ ఎంపిక అత్యంత ప్రత్యేకంగా నిలిచింది. ఆయన గొంతులోని గంభీరత, రఫ్ టెక్స్చర్, సహజమైన ఫోక్ శైలి పాటకి కావలసిన అసలైన జాతర వాతావరణాన్ని తీసుకొచ్చాయి. ఆయన గానం కేవలం పాటను పాడటమే కాకుండా, ఈ కంపోజిషన్‌కు ఒక సౌండ్ ఐడెంటిటీని తీసుకొచ్చిందని చెప్పవచ్చు.
మొత్తంగా చూస్తే వెంగి సంగీతం-సాహిత్యం, కైలాష్ ఖేర్ గంభీరమైన గాత్రం, తెలంగాణ ఫోక్ నేపథ్యం అన్నీ కలిసి ఈ పాటకు ఒక స్పష్టమైన మాస్ ఫోక్ గుర్తింపును తీసుకువచ్చాయి. బోనాల పాటల్లో ఇది ముందువరుసలో నిలుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. జాతరల్లో జనాలను కదిలించేలా, సామూహిక ఉత్సాహాన్ని నింపేలా ఈ గీతం అద్భుతంగా రూపొందింది. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్, ఆర్.ఎం.స్వామి సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన బలం కానున్నాయి.
