ట్రైలర్ టాక్: 'తుంబాడ్' స్టైల్ మేకింగ్ ఆర్ట్‌వర్క్‌తో దడ పుట్టిస్తోంది!
జాకీ ష్రాఫ్, శరద్ కేల్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ థ్రిల్లర్ ‘కాళీ ఖేతీ’ ట్రైలర్ విడుదలైంది. శాపగ్రస్తమైన పొలం, దాని చుట్టూ దాగి ఉన్న రహస్యాలు, పూర్వీకుల ఆత్మల నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. హారిస్ ఇంతియాజ్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 20న PVR INOX ద్వారా థియేటర్లలో విడుదల కానుంది.
By: Sivaji Kontham | 13 Nov 2026 3:48 PM ISTఅక్కడ ఒంటరిగా ఒక ఇల్లు.. ఆ ఇంటి చుట్టూ తోట. ఆ తోట ఇంటి వైపే చూస్తుంది. ఆ ఇంట్లో మనుషులు ఏం చేస్తున్నా ఇది గమనిస్తుంది.. ఆ తర్వాత వెన్నులో ఒణుకుపుట్టే సన్నివేశాలు ఒకటొకటిగా దర్శనమిస్తాయి. ఆ తోటలో చాలా రహస్యాలున్నాయి.. భయపెట్టే ఆత్మలు ఉన్నాయి.. అవి అక్కడే ఎందుకు ఉన్నాయి? ఎవరిని ఏం చేయబోతున్నాయి? ఇవన్నీ తెలియాలంటే జాకీ ష్రాఫ్ నటించిన ఈ హారర్ థ్రిల్లర్ సినిమా చూడాల్సిందే.
తాజాగా రిలీజైన `కాళీ ఖేతీ` ట్రైలర్ ఆద్యంతం గగుర్పాటుకు గురి చేస్తోంది. ఆస్కార్ విన్నింగ్ సినిమాలా అద్భుతమైన లైటింగ్ స్కీమ్.. గుండె దడ పుట్టించే రీరికార్డింగ్ తో విజువల్స్ కేక పుట్టిస్తున్నాయి. ఒక హారర్ సినిమాకి లైటింగ్, ఆర్ట్ వర్క్, సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం ఎంత ముఖ్యమో.. అవన్నీ సరిగ్గా సెట్టయితే ఎలా ఉంటుందో ఈ ట్రైలర్ చెబుతోంది.
నవంబర్ 20న పీవీఆర్ ఐనాక్స్ ద్వారా థియేటర్లలో విడుదల కానున్న`కాళీ ఖేతీ` సైకలాజికల్ రూరల్ హారర్ డ్రామాతో ఆద్యంతం రక్తి కట్టించనుందని తాజా ట్రైలర్ చెబుతోంది. బ్లాక్‌కాన్వాస్ స్టూడియో బ్యానర్‌పై హారిస్ ఇంతియాజ్ ఖాన్ రచించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రం సాధారణ హారర్ సినిమాలకు భిన్నంగా.. ఒక మారుమూల వ్యవసాయ గ్రామంలో నడుస్తుంది. శాపగ్రస్తమైన ఒక పొలం చుట్టూ తిరిగే భయానక రహస్యాలు ఏమిటన్నది తెరపైనే చూడాలి. కిరణ్ దేవ్‌హాన్స్ సినిమాటోగ్రఫీ, అలకానంద దాస్‌గుప్తా సంగీతం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. ఈ సినిమాలో ఫ్యామిలీ పూర్వీకుల ఆత్మలు.. వాటి వెనక దాగి ఉన్న నిజాలు రక్తి కట్టిస్తాయి. అతీంద్రియ శక్తుల మధ్య చిక్కుకున్న తండ్రీకొడుకులుగా జాకీ ష్రాఫ్, శరద్ కేల్కర్ కనిపించనున్నారు.
రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా `తుంబాడ్`, `చోరీ` వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన ఫోక్ హారర్ చిత్రాలను గుర్తుచేసేలా ఈ ట్రైలర్ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా జాకీ ష్రాఫ్, శరద్ కేల్కర్‌ల నటన, వారి అద్భుతమైన గొంతు సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఈ సినిమాకి చీకటి సన్నివేశాలు మరో ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి. జాకీ ష్రాఫ్ కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్ని పోషించారు. ఈ సినిమాలో మరో పరిణతి చెందిన పాత్రతో రక్తి కట్టించబోతున్నారని ట్రైలర్ చెబుతోంది.
