సల్మాన్ 'డి-కంపెనీ' నుంచి 1000 బెదిరింపు మెసేజ్‌లు వచ్చాయి.. అయినా భయపడను.. నిర్మాత బస్తీ సవాల్!
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ చుట్టూ ఉన్న వివాదాలు ఎప్పటికీ ముగిసేలా కనిపించడం లేదు.
By: Sivaji Kontham | 5 Jun 2026 11:21 AM ISTబాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ చుట్టూ ఉన్న వివాదాలు ఎప్పటికీ ముగిసేలా కనిపించడం లేదు. తాజాగా ఆయన 1998 నాటి ప్రసిద్ధ `కృష్ణజింకల వేట` (బ్లాక్‌బక్ పోచింగ్) కేసు ఆధారంగా తెరకెక్కుతున్న `కాలా హీరన్: ది బాటిల్ ఫర్ లెగసీ` అనే చిత్రం తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, కంటెంట్ తన వ్యక్తిగత హక్కులకు భంగం కలిగిస్తున్నాయని కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసును ప్రభావితం చేసేలా ఉన్నాయని పేర్కొంటూ సల్మాన్ ఖాన్ లీగల్ టీమ్ ఈ చిత్ర నిర్మాతలకు నోటీసులు పంపింది. అయితే ఈ నోటీసుపై చిత్ర నిర్మాత అమిత్ జాని స్పందించిన తీరు ఇప్పుడు బాలీవుడ్‌లో దావానలంలా మారింది.
చిత్ర నిర్మాత అమిత్ జాని సల్మాన్ ఖాన్ లీగల్ టీమ్ పంపిన నోటీసును లైవ్ కెమెరా ముందే ముక్కలు ముక్కలుగా చింపిపారేస్తూ సంచలన వీడియోను విడుదల చేశారు. సామాజిక మాధ్యమం `X` లో ఈ వీడియోను షస్త్రర్ చేస్తూ ఈ ఫేక్ కాగితాల ముక్కలే సల్మాన్ లీగల్ టీమ్‌కు తన సమాధానమని అతడు చాలా ఘాటుగా వ్యాఖ్యానించారు. తాము ఎవరి ఒత్తిడికి.. బెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదని.. ఈ ప్రాజెక్ట్ నుండి వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ``మీరు ఎవరినైనా పంపించుకోండి.. మేం చట్టబద్ధంగానే సమాధానం చెప్తాం`` అంటూ సల్మాన్ ఖాన్‌కు నేరుగా సవాల్ విసిరారు.
ఈ లీగల్ నోటీసు వివాదం వెలుగులోకి వచ్చినప్పటి నుండి తనకు ప్రాణహాని తలపెట్టేలా తీవ్రమైన బెదిరింపులు వస్తున్నాయని అమిత్ జాని ఆరోపించారు. గత 36 గంటల్లో సల్మాన్ ఖాన్ అభిమానులమని చెప్పుకునే వారి నుండి దాదాపు 1000 కి పైగా బెదిరింపు సందేశాలు వచ్చాయని పేర్కొన్నారు. తాము ముంబైలో కాలు పెడితే తలలు నరికేస్తామని ధారావి, జోగేశ్వరి వంటి ప్రాంతాల నుండి మెసేజ్‌లు వస్తున్నాయని.. ఇలాంటి పరిస్థితుల్లో తాను సల్మాన్ పంపిన నోటీసుకు సమాధానం ఇవ్వాలా లేక ఈ ప్రాణహాని బెదిరింపులను ఎదుర్కోవాలా అని ఆయన ప్రశ్నించారు.
ఇంతటితో ఆగకుండా.. ఈ వివాదంలోకి అండర్ వరల్డ్ మాఫియా ప్రమేయం కూడా ఉందని నిర్మాత అమిత్ జాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖాన్ కు సంబంధం ఉన్న డి కంపెనీ నుంచి కూడా తనను తన కుటుంబాన్ని చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయని కూడా ఆరోపించారు. అయితే ఈ మెసేజ్‌ల వెనుక ఉన్న అసలు వ్యక్తులెవరో తాను గుర్తించలేనని చెబుతూనే.. సల్మాన్ ఖాన్ అనుచరులు, వీధి రౌడీలు పంపే బెదిరింపు మెసేజ్‌లను... అలాగే డి-కంపెనీ నుంచి వస్తున్న హెచ్చరికలను తాము ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
`కాలా హీరన్` చిత్రం సల్మాన్ ఖాన్ కృష్ణజింకల వేట కేసుతో పాటు.. జైలు జీవితం.. తదనంతర కోర్టు డ్రామా .. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌తో నడుస్తున్న వైరానికి సంబంధించిన కథను తెరపై చూపించనుందని తెలుస్తోంది. అందుకే ఈ ప్రాజెక్ట్ ప్రకటన వెలువడినప్పటి నుంచే పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తోంది. నిర్మాత అమిత్ జాని నోటీసును బహిరంగంగా చింపేయడం, మాఫియా బెదిరింపులపై ప్రతిసవాల్ చేయడం.. బాలీవుడ్‌లో తీవ్ర సంచలనం రేకెత్తించగా... ఈ వ్యవహారంపై సల్మాన్ ఖాన్ లేదా ఆయన లీగల్ టీమ్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
