ఆటో జానీ.. ఇలా ట్విస్ట్ ఇచ్చాడేంటి..
చిరంజీవి, బాబీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘కాకా’ కొత్త పోస్టర్లో మెగాస్టార్ ‘ఆటో జానీ’గా కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు. 1991లో వచ్చిన ‘రౌడీ అల్లుడు’ పాత్రను గుర్తుచేస్తూ ఈ లుక్ ఆసక్తి పెంచింది. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2027 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
By: M Prashanth | 29 Nov 2026 4:21 PM ISTమెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్ లో వస్తున్న 'కాకా' నుంచి విడుదలైన కొత్త పోస్టర్ ఇప్పుడు ఫ్యాన్స్ కి బిగ్ షాక్ ఇచ్చింది. ఖాకీ చొక్కా, నల్ల కళ్లద్దాలు, నడుముకు గన్ పెట్టుకుని చిరంజీవి కనిపిస్తున్న తీరు పక్కా మాస్ ఫీల్ ఇస్తోంది. ఈ పోస్టర్ తో పాటు సినిమాలో చిరు పాత్ర పేరు 'ఆటో జానీ' అని రివీల్ చేయడంతో అభిమానుల్లో పాత జ్ఞాపకాలు మొదలయ్యాయి.
1991లో వచ్చిన 'రౌడీ అల్లుడు' సినిమాలో చిరంజీవి పోషించిన ఆటో జానీ పాత్రకు ఇప్పటికీ ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఆ చిత్రంలో డబుల్ రోల్ చేసిన చిరు, ఆటో జానీగా తన కామెడీ టైమింగ్, మాస్ మేనరిజమ్స్ తో థియేటర్లను షేక్ చేశారు. దాదాపు ముప్పై ఐదేళ్ల తర్వాత మళ్లీ అదే పేరుతో తెరపైకి రాబోతుండటం విశేషం.
నిజానికి 'ఆటో జానీ' పేరుతో చిరంజీవి సినిమా చేయాలనే ఆలోచన గతంలోనే జరిగింది. రీఎంట్రీలో తన 150వ సినిమాగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఇదే టైటిల్ తో ఓ ప్రాజెక్ట్ అనుకున్నారు. కానీ కథ విషయంలో ఏకాభిప్రాయం కుదరక ఆ సినిమా పట్టాలెక్కలేదు. ఇన్నేళ్ల తర్వాత బాబీ ఆ ఐకానిక్ పేరును తన కథలోకి తీసుకురావడం ఆసక్తికరంగా మారింది.
గతంలో 'వాల్తేరు వీరయ్య'లో చిరంజీవి వింటేజ్ కామెడీని, డ్యాన్సులను బాబీ బాగానే వాడుకున్నారు. కానీ 'కాకా' పోస్టర్లు చూస్తుంటే ఈసారి ట్రీట్ మెంట్ పూర్తిగా మార్చినట్లు అర్థమవుతోంది. కాలర్ పట్టుకుని రఫ్ లుక్ లో చిరంజీవి కనిపిస్తున్న తీరు చూస్తుంటే, పాత తరహా కామెడీ కంటే పవర్ ఫుల్ యాక్షన్ డ్రామాకే ఎక్కువ ప్రాధాన్యం ఉన్నట్లు తెలుస్తోంది.
శంకర్ దాదా కామెడీ టచ్ ఊహించవచ్చు అనిపిస్తోంది. మరోవైపు 'కాకా' సంక్రాంతి రిలీజ్ వాయిదా పడుతుందంటూ కొద్దిరోజులుగా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా 'విశ్వంభర' రేసులోకి వస్తుందనే వార్తల మధ్య ఈ సినిమా వెనక్కి తగ్గుతుందనే ఊహాగానాలు వినిపించాయి. అయితే 2027 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదలవుతుందని మరోసారి స్పష్టం చేయడంతో ఆ రూమర్లకు చెక్ పడింది.
కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. అనస్వర రాజన్, నివేదా పేతురాజ్, అనురాగ్ కశ్యప్ కీలక పాత్రల్లో నటిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ, ఆంటోనీ రూబెన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వరుస పోస్టర్లతో ప్రమోషన్ల వేగం పెంచిన చిత్ర యూనిట్, త్వరలోనే ఫస్ట్ సింగిల్ అప్డేట్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది.
