Begin typing your search above and press return to search.

'కే ర్యాంప్' మూవీ రివ్యూ

గత ఏడాది దీపావళికి ‘క’ మూవీతో పెద్ద హిట్ కొట్టాడు యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం. ఈసారి కూడా ఈ పండక్కి అతను కొత్త సినిమాను దించాడు.

By:  Prakash Chimmala   |   18 Oct 2025 2:24 PM IST
కే ర్యాంప్ మూవీ రివ్యూ
X

‘కే ర్యాంప్’ మూవీ రివ్యూ

నటీనటులు: కిరణ్ అబ్బవరం- యుక్తి తరేజా- సాయికుమార్- నరేష్- మురళీధర్ గౌడ్- వెన్నెల కిషోర్- సంజయ్ స్వరూప్- కామ్న జెఠ్మలాని- కిరాక్ సీత తదితరులు

సంగీతం: చేతన్ భరద్వాజ్

ఛాయాగ్రహణం: సతీష్ రెడ్డి మాసం

మాటలు: రవీంద్ర రాజా

నిర్మాతలు: రాజేష్ దండ- శివ బొమ్మక్

కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: జైన్స్ నాని

గత ఏడాది దీపావళికి ‘క’ మూవీతో పెద్ద హిట్ కొట్టాడు యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం. ఈసారి కూడా ఈ పండక్కి అతను కొత్త సినిమాను దించాడు. అదే.. కే ర్యాంప్. కొత్త దర్శకుడు జైన్స్ నాని రూపొందించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి కిరణ్ కు ఈ దీపావళి కూడా విజయాన్నందించేలా ఉందా? తెలుసుకుందాం పదండి.

కథ:

కుమార్ అబ్బవరం (కిరణ్ అబ్బవరం) బాగా డబ్బున్న తండ్రికి కొడుకు. చిన్నప్పట్నుంచి అతడికి చదువు మీద ధ్యాస ఉండదు. ఎప్పుడూ తాగుతూ అల్లరి చిల్లరిగా తిరుగుతుంటాడు. తన దగ్గరుంటే కొడుకు బాగుపడట్లేదని.. కుమార్ ను కేరళలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో డొనేషన్ కట్టి చేర్పిస్తాడు అతడి తండ్రి. అక్కడికెళ్లాక కూడా కుమార్ లో ఏ మార్పూ ఉండదు. అక్కడే అతడికి మెర్సీ (యుక్తి తరేజా) పరిచయం అవుతుంది. ఆమె చేసిన సాయానికి ఇంప్రెస్ అయి తనతో ప్రేమలో పడిపోతాడు కుమార్. నెమ్మదిగా మెర్సీ కూడా అతణ్ని ప్రేమిస్తుంది. తాను కోరుకున్న అమ్మాయి ప్రేమించిందని కుమార్ సంబరపడుతుంటే.. మెర్సీకి ఉన్న ఓ సమస్య గురించి అతడికి తెలుస్తుంది. అక్కడ్నుంచి కుమార్ జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. ఇంతకీ మెర్సీ సమస్యేంటి? దాని వల్ల కుమార్ పడ్డ ఇబ్బందులేంటి? ఈ సమస్య పరిష్కారం అయిందా లేదా అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

‘కే ర్యాంప్’ ఇంట్రడక్షన్ సీన్లో హీరో తాగుతుంటాడు. హీరోయిన్ పరిచయ సన్నివేశంలో కూడా హీరో తాగుతూనే కనిపిస్తాడు. సినిమాలో తొలి పాటకు ముందు కూడా అదే పని చేస్తుంటాడు. ఫైట్ సీన్లో కూడా హీరోకు తాగితే కానీ కొట్టేంత బలం రాదు. సుసైడ్ అటెంప్ట్ చేసి హీరోయిన్ హాస్పిటల్లో చేరితే.. ఆమెను ఫేస్ చేయాల్సిన పరిస్థితుల్లో కూడా హీరో అక్కడ కూడా ఆశ్రయించేది మందునే. సినిమాలో కథ కీలక మలుపు తిరిగే సీన్లో కూడా హీరో మందుకొట్టి కింద పడిపోయి ఉంటాడు. సినిమాకు మహరాజ పోషకులైన యువతకు సినిమాను.. లీడ్ క్యారెక్టర్ని కనెక్ట్ చేయడానికి ‘మందు’ను మించిన మార్గం లేదని అనుకున్నారేమో తెలియదు మరి. హీరో పాత్రను ఇలా పరిచయం చేసి.. సిల్లీగా సీన్లు నడిపిస్తుంటే ఇక సినిమా మీద ఏం ఆశలు ఉంటాయి? కిరణ్ అబ్బవరం ‘క’కు ముందున్న ఫాంలోకే వెళ్లిపోతున్నాడనే అనిపిస్తుంది. కానీ ఉన్నట్లుండి కథలో వచ్చే ట్విస్టుతో ప్రేక్షకుల్లో ప్రేక్షకుల్లో ఆశలు లేచొస్తాయి. ఆ మలుపు దగ్గర్నుంచి ‘కే ర్యాంప్’ క్రేజీ రైడ్ గా మారుతుంది. కొంచెం క్రింజ్ గా.. మరీ లౌడ్ గా అనిపించినా సరే.. ద్వితీయార్ధంలో కామెడీ వర్కవుట్ కావడంతో ‘కే ర్యాంప్’కు యూత్-మాస్ లో పాస్ మార్కులు పడిపోతాయి.

ప్రధాన పాత్రలకు ఏదో ఒక డిజార్డర్ పెట్టి కామెడీ పండిచడంలో దర్శకుడు మారుతి దిట్ట. భలే భలే మగాడివోయ్.. మహానుభావుడు చిత్రాల్లో అతను ఇలాగే ప్రేక్షకుల మనసులు గెలిచాడు. వేరే దర్శకులు కూడా అతణ్ని అనుసరించారు. కానీ ఒక దశలో ఆ కథలన్నీ ఒకేలా అనిపించడంతో వాటిని పక్కన పెట్టేయాల్సి వచ్చింది. కానీ కొంచెం గ్యాప్ తర్వాత కొత్త దర్శకుడు జైన్స్ నాని.. తన డెబ్యూ మూవీకి ఈ ఫార్ములానే ఎంచుకున్నాడు. చెప్పిన మాట మీద నిలబడకపోయినా.. టైం తప్పినా.. వెర్రెత్తి ప్రవర్తించే హీరోయిన్ పాత్ర చుట్టూ క్రేజీ సీన్లు రాసుకున్నాడు. ఈ పాత్ర కొత్తగా అనిపించకపోయినా.. దాంతో ముడిపడ్డ సీన్లు మాత్రం ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి. బాగా నవ్విస్తాయి. కథానాయిక పాత్రలో ఈ విచిత్ర కోణం బయటికి వచ్చిన దగ్గర్నుంచి ప్రేక్షకుల అటెన్షన్ రాబట్టే ‘క్యా ర్యాంప్’.. చివరి వరకు వారిని బాగానే ఎంగేజ్ చేస్తుంది. ముఖ్యంగా వెన్నెల కిషోర్ తో ముడిపడ్డ ఒక ఎపిసోడ్ ద్వితీయార్ధంలో హిలేరియస్ అనిపిస్తుంది. మిగతా సీన్లు కూడా ప్రేక్షకులను నవ్విస్తాయి. చివర్లో ఇచ్చిన కథకు ఇచ్చిన ఎమోషనల్ టచ్ అంతగా కుదరకపోయినా.. అంతకుముందు సీన్లు బాగా పేలడంతో ‘కే ర్యాంప్’ నాట్ బ్యాడ్ అనే ఫీలింగ్ కలిగిస్తుంది.

కానీ ఈ కథలో మలుపు రావడానికి ముందు వరకు మాత్రం ‘కే ర్యాంప్’ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. హీరోను కొంత వరకు అల్లరి చిల్లరిగా చూపించడం వరకు ఓకే కానీ.. ఇందులో కిరణ్ పాత్ర మాత్రం మరీ చికాకు పెట్టేలా సాగుతుంది. ఫస్టాఫ్ అంతా హీరో మందు కొడుతుంటాడు. లేదంటే హీరోయిన్ వెనుక తిరుగుతుంటాడు. ఇంతకుమించి సీన్లేమీ రాసుకోలేదు. ప్రేమ సన్నివేశాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. హీరో ఫైట్ చేస్తే హీరోయిన్ ప్రేమలో పడిపోయే సీన్లు ఎన్ని సినిమాల్లో చూడలేదు. తాగి పడిపోయిన హీరోకు హీరోయిన్ నోట్లో నోరు పెట్టి ఊపిరి అందించే సీన్ క్రింజ్ అనిపించకుండా ఎలా ఉంటుంది? ఐతే సినిమాను ఎంత బాగా మొదలుపెట్టినా.. మధ్యలో కాడి వదిలేస్తే చివరికి నెగెటివ్ ఫీలింగే వస్తుంది. అదే సమయంలో ఆరంభం బాగా లేకపోయినా.. మధ్యలో పుంజుకుంటే ఆఖరికి పాజిటివ్ ఫీల్ వస్తుంది. ‘కే ర్యాంప్’ రెండో కోవకు చెందడం దానికున్న అడ్వాంటేజ్. తొలి గంటలో ఎంత విసిగించినా.. రెండో గంటలో క్రేజీ కామెడీ వల్ల పాస్ మార్కులు పడిపోతాయి.

నటీనటులు:

కిరణ్ అబ్బవరం తన నటన యూత్ కు నచ్చేలా సాగుతుంది. హీరోయిన్ వెర్రితో నానా కష్టాలు పడే పాత్రలో అతను ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశాడు. సెకండాఫ్ లో తన పెర్ఫామెన్స్ బాగుంది. ఇకపై ఇలాంటి ఇర్రెస్పాన్సిబుల్ క్యారెక్టర్లు ఓవర్ డోస్ అయిపోతున్న నేపథ్యంలో ఇకపై అతను కొంచెం మారితే మంచిది. హీరోయిన్ యుక్తి తరేజాకు కీలకమైన పాత్రే దక్కింది. ఆమె గ్లామర్ తో ఆకట్టుకుంది కానీ.. నటన అంత గొప్పగా లేదు. మంచి పెర్ఫామర్ ను ఈ పాత్ర కోసం ఎంచుకోవాల్సింది. దర్శకుడు ప్రతి సన్నివేశంలోనూ సెక్సీగా చూపించడానికి ప్రయత్నించాడు. దాని వల్ల పాత్ర ఔచిత్యం దెబ్బ తింది. మురళీధర్ గౌడ్ నవ్వించాడు. నరేష్ పాత్ర పండలేదు. అది చికాకు పెడుతుంది. సాయికుమార్ తండ్రి పాత్రలో అలవాటైన రీతిలో నటించాడు. వెన్నెల కిషోర్ కాసేపే కనిపించినా తన కామెడీ పేలింది. మిగతా నటీనటులంతా మామూలే.

సాంకేతిక వర్గం:

‘ఎస్ఆర్ కళ్యాణమండపం’తో కిరణ్ అబ్బవరం కెరీర్లో మరపురాని ఆడియో ఇచ్చిన చేతన్ భరద్వాజ్.. ఈసారి యావరేజ్ పాటలే ఇచ్చాడు. నేపథ్య సంగీతం చెవుల తుప్పు వదిలించేస్తుంది. సతీష్ రెడ్డి మాసం ఛాయాగ్రహణం బాగానే సాగింది. ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే. రవీంద్ర రాజా మాటలు కొన్నిచోట్ల పేలాయి. కానీ చాలా చోట్ల డైలాగ్స్ హద్దులు దాటిపోయాయి. కథకుడు-దర్శకుడు జైన్స్ నాని ఎంచుకున్న ప్లాట్ పాయింట్.. దాని చుట్టూ నడిపిన కామెడీ వరకు ఓకే. తన నరేషన్ మరీ లౌడ్ అనిపిస్తుంది. తన స్క్రీన్ ప్లే ఎంగేజింగ్ గా లేదు. ఐతే కామెడీ సీన్లను మాత్రం ఇప్పటి యూత్ నచ్చేలా తీయగలిగాడు.

చివరగా: కే ర్యాంప్.. సగం క్రింజ్.. సగం క్రేజీ

రేటింగ్ - 2.5/5