Begin typing your search above and press return to search.

ముంచుకొస్తున్న మృత్యువును ముందే క‌నిపెట్టిన న‌టుడు!

ఒకరి చావు గురించి ముందే తెలిసిపోతే, లేదా ముందే తెలుసుకునే అవ‌కాశం క‌లిగితే, దానిని `ఫైన‌ల్ డెస్టినేష‌న్` అనాలా? అంద‌రూ చివ‌రికి చేరుకునేది అక్క‌డికే.

By:  Sivaji Kontham   |   12 Feb 2026 10:31 PM IST
ముంచుకొస్తున్న మృత్యువును ముందే క‌నిపెట్టిన న‌టుడు!
X

ఒకరి చావు గురించి ముందే తెలిసిపోతే, లేదా ముందే తెలుసుకునే అవ‌కాశం క‌లిగితే, దానిని `ఫైన‌ల్ డెస్టినేష‌న్` అనాలా? అంద‌రూ చివ‌రికి చేరుకునేది అక్క‌డికే. కానీ కొంద‌రు దానికి భ‌య‌ప‌డితే, మ‌రికొంద‌రు ధైర్యంగా త‌న చావు గురించి తానే ముందే చెప్పి ఆశ్చ‌ర్య‌ప‌రుస్తారు. ఫైన‌ల్ డెస్టినేష‌న్ ఫ్రాంఛైజీ ఆద్యంతం చావు ఎప్పుడు ఎవ‌రిని ఎలా త‌రుముకు వ‌స్తుందో ముందే క‌లలు క‌ని తెలుసుకునే యువ‌తి క‌థ‌తో ఎంతో ర‌క్తి క‌ట్టిస్తుంది. ఇప్పుడు ప్ర‌ముఖ న‌టుడు త‌న చావు గురించి ముందే హింట్ ఇచ్చి, ఆ త‌ర్వాత అన్నంత ప‌నీ చేసాడు. అతడి ఆత్మ‌హ‌త్యకు కార‌ణం ఏమిట‌న్న‌ది తెలియ‌లేదు కానీ, మొత్తానికి ఇది మిస్టీరియ‌స్ మ‌ర‌ణంగా రికార్డుల‌కెక్కింది.

ఇదంతా ఎవ‌రి గురించి? అంటే.. దక్షిణ కొరియా నటుడు, కే డ్రామా స్టార్ జంగ్ ఉన్-వూ గురించిన స్టోరి ఇది. ప్ర‌స్తుతం అత‌డి మరణం ప‌రిశ్ర‌మ‌లో విషాదం నింపింది. జంగ్ ఉన్ వూ.. చాలా చిన్న వ‌య‌సు(39 కే)లో మరణించారు. ఆయన మరణవార్తను కొరియన్ మీడియా ఇప్ప‌టికే ధృవీకరించింది. కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఆయన మరణానికి గల క‌చ్చితమైన కారణాలను ఇంకా వెల్లడించలేదు.

చివరి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ అంతరార్థం:

జంగ్ ఉన్ మరణానికి ఒక రోజు ముందు (ఫిబ్రవరి 10న) ఇన్‌స్టా పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఆయన మూడు ఫోటోలను షేర్ చేశారు. వీటిలో లెస్లీ చియుంగ్, అమీ వైన్ హౌస్ ఈ రెండిటితో పాటు త‌న ఫోటోను కూడా మూడో ఫోటోగా ఉంచాడు. 2003లో ఆత్మహత్య చేసుకుని మరణించిన హాంకాంగ్ నటుడు లెస్లీ చియుంగ్ ఫోటోతో పాటు, 2011లో మద్యం విషప్రయోగం వల్ల 27 ఏళ్లకే మరణించిన బ్రిటిష్ గాయని అమీ వైన్‌హౌస్ ఫోటోని కూడా అత‌డు త‌న ఫోటోతో పాటు షేర్ చేసాడు. ``నిన్ను మిస్ అవుతున్నాను.. నిన్ను చూసి అసూయపడుతున్నాను.. చింతిస్తున్నాను... PIR.BG`` అని రాసాడు.

ఈ శీర్షిక‌లోని PIR.BG అనే పదాన్ని రివర్స్‌లో చదివితే GB.RIP (గుడ్ బై, రెస్ట్ ఇన్ పీస్) అనే అర్థం వస్తుందని, ఇది ఆయన ముందే ఇచ్చిన సంకేతం కావచ్చని అభిమానులు భావిస్తున్నారు.

జంగ్ ఉన్-వూ కెరీర్ మ్యాట‌ర్ కి వస్తే, అత‌డు 2006లో `రౌండప్ 3` అనే డ్రామాతో తన నటన జీవితాన్ని ప్రారంభించారు. ఆ త‌ర్వాత సీరియ‌ల్స్ లోను న‌టించాడు. వన్ వెల్-రైజ్డ్ డాటర్, ది రిటర్న్ ఆఫ్ కాల్వ్ గెమ్-బోక్, మై ఓన్లీ వన్, వెల్కమ్ టు వైకికి 2 వంటి సీరియల్స్ తో అత‌డు ప్రేక్షకులకు చేరువయ్యారు. అత‌డికి పాపుల‌ర్ అవార్డులు ద‌క్కాయి. 2012లో ఎస్‌.బి.ఎస్‌ డ్రామా అవార్డ్స్‌లో న్యూ స్టార్ అవార్డు అందుకున్నారు. 2021లో వచ్చిన `మెమరీ: మానిప్యులేటెడ్ మర్డర్` అత‌డు నటించిన చివరి సినిమా.

యువ‌న‌టుడు జంగ్ ఉన్ వూ అంత్యక్రియలు ఫిబ్రవరి 13వ తేదీన జింపోలోని న్యూ కొరియా హాస్పిటల్ ఫ్యూనరల్ హాల్‌లో జరగనున్నాయి. ఒక ప్రతిభావంతుడైన నటుడు ఇలా చిన్న వయసులోనే తనువు చాలించడం కొరియన్ చిత్ర పరిశ్రమకు పెద్ద లోటు. అత‌డి మ‌ర‌ణ వార్త విని ఉలిక్కి ప‌డిన స‌హ‌చ‌రులు క‌న్నీటి ప‌ర్యంత‌మై వీడ్కోలు ప‌లుకుతున్నారు.