అంతులేని సినిమా జీవితాన్ని ఇచ్చిన బాలచందర్
దక్షిణాదిన అద్భుతమైన దర్శకుడు ఎవరు అంటే ఠక్కున ఒకే పేరు వినిపిస్తుంది. ఆయనే కె బాలచందర్. ఆయన తానే స్వయంగా కధలు రాస్తారు, వాటిని అంతే అందంగా హృద్యంగా వెండి తెర మీద ఆవిష్కరిస్తారు.
By: Satya P | 28 Feb 2026 4:00 AM ISTదక్షిణాదిన అద్భుతమైన దర్శకుడు ఎవరు అంటే ఠక్కున ఒకే పేరు వినిపిస్తుంది. ఆయనే కె బాలచందర్. ఆయన తానే స్వయంగా కధలు రాస్తారు, వాటిని అంతే అందంగా హృద్యంగా వెండి తెర మీద ఆవిష్కరిస్తారు. ఆలోచనలను రేకెత్తించేలా ఆయన సినిమాలు ఉంటాయి. ప్రధానంగా ఆయన స్త్రీల పక్షపాతి. ఆయన సినిమాలు చూస్తే అదే అర్ధం అవుతుంది. ఆకాశంలో సగం అవకాశాలలో సగం మహిళ అన్న నినాదానికి కట్టుబడి తాను తీసిన సినిమాలు అన్నింటిలో మహిళాలకు ఉదాత్తమైన స్థానాన్ని కల్పించిన వెండితెర శిల్పిగా కె బాలచందర్ ని కచ్చితంగా చెప్పుకోవాలి.
లైఫ్ టర్న్ అయింది :
అపుడే చెన్నై అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి మొదటి బ్యాచ్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని బయటకు వచ్చింది. 1973 బ్యాచ్ అది. ఆ బ్యాచ్ లో ఈ రోజు తమిళ సూపర్ స్టార్ గా ఉన్న రజనీకాంత్, అలాగే 70 దశకంలో హీరోగా ఎన్నో సినిమాలు చేసిన నారాయణరావు, మంచి విలన్ గా పేరు తెచ్చుకున్న ప్రదీప్ శక్తి లాంటి వారు అంతా ఉన్నారు. వీరు ఇలా బయటకు వచ్చారో లేదో కె బాలచందర్ అంతులేని కధ మూవీలో వీరికి చాన్స్ దక్కింది. అంతులేని కధ రజనీకాంత్ తొలి సినిమా. అలాగే నారాయణరావుకు ఇదే ఫస్ట్ మూవీ. ఇక ఈ మూవీతోనే బలనటుడు నుంచి పూర్తి స్థాయి నటుడిగా కమల్ హాసన్ తన అసలైన ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేశారు. ఇక గీత సినిమాతో హీరోగా పరిచయం అయి మంచి చాన్స్ కోసం చూస్తున్న ప్రసాద్ బాబుకు ఈ మూవీలో కీలక పాత్ర దక్కింది. అంతే కాదు ఫ్హీరోయిన్ ఓరియేంటెడ్ మూవీలో అపుడే భూమికోసం మూవీలో చిన్న పాత్ర వేసి రాజ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ మూవీలో హీరోయిన్ గా మెరిసిన జయప్రదను తీసుకున్నారు. ఆమె వయసుకి మించిన పాత్ర ఇది. అతి బరువైన పాత్ర. మొత్తం సినిమా అంతా సరిత మీదనే సాగుతుంది. ఆ సరిత పాత్రను జయప్రద ఎంతో అద్భుతంగా పోషించి తన నటనకు తిరుగులేదని చాటారు. ఇక ఫటాఫట్ జయలక్ష్మిగా తరువాత కాలంలో పేరు తెచ్చుకున్న జయలక్ష్మికి ఇదే తొలి సినిమా. ఆమె జయప్రద ఫ్రెండ్ గా అడ్వాన్స్డ్ థాట్స్ ఉన్న పాత్ర పోషించారు.
దర్శక ప్రతిభతోనే :
ఈ మూవీ అంతా బాలచందర్ దర్శకత్వం ప్రతిభతోనే నిలబెట్టేశారు అని చెప్పాల్సి ఉంది. బ్లాక్ అండ్ వైట్ కి కాలం మెల్లగా చెల్లుతున్న రోజులలో తీసిన అంతులేని కధ ఆనాటి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. 70 దశకం నాటికి సమాజంలో మార్పులు ఎన్నో వచ్చాయి. ఆడవాళ్ళు చదువుకుని ఉద్యోగాలు చేయడానికి ముందుకు వస్తున్న కాలం అది. అలా వారు సొంతంగా స్వతంత్రంగా తాము నిలబడటం కాదు కుటుంబాలకు ఒక పెద్ద దిక్కుగా ఎలా నిలబడ్డారు అన్నది ఈ మూవీలో చూపించారు. కుటుంబాలకు మగవాడే దిక్కు అన్న పితృస్వామ్య వ్యవస్థ నుంచి మహిళలు కూడా కుటుంబాలకు నాయకత్వం వహించగలరు అన్నది ఈ మూవీలో చూపించడం ద్వారా తాను స్త్రీ పక్షపాతిని అని బాలచందర్ నిరూపించుకున్నారు.
మధ్యతరగతి జీవితాలు :
అంతులేని కధ మధ్యతరగతి జీవితాలను కళ్ళకు కట్టినట్లుగా చూపించింది. ఆదాయమంతా ఒక్కరే తీసుకుని రావడం భారాలు మోయడం అందులో మగ దిక్కు లేని సంసారాలకు ఒక మహిళ ఎలా పెద్ద దిక్కుగా నిలిచింది అన్నది కె బాలచందర్ సెల్యూలాయిడ్ మీద ఎంతో చక్కగా చిత్రీకరించారు. ఈ సినిమా మొదట తమిళంలో తీసారు. దాని పేరు అవళ్ ఒరు తోడర్ కథై. ఆ మూవీలో జయప్రద పాత్రను సుజాత పోషించారు. తెలుగులో జయప్రదను ఎంచుకోవడం ద్వారా బాలచందర్ ఆమె కెరీర్ కి బలమైన పునాది వేశారు అనే చెప్పాలి.
యాభై ఏళ్ళు గడచినా :
ఇక ఈ మూవీ 1976 ఫిబ్రవరి 27వ తేదీన విడుదలైన అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో నటించిన వారు అంతా తరువాత కాలంలో సూపర్ స్టార్లు అయ్యారు. లాంగ్ సినీ కెరీర్ ని సొంతం చేసుకున్నారు. రజనీకాంత్ కమల్ హాసన్ లకు తెలుగులో అవకాశాలకు గేట్ వేగా ఈ మూవీ నిలిచింది అని చెప్పాలి. ఈ మూవీకి మాటలు పాటలు ఆచార్య ఆత్రేయ అందిస్తే ఎమ్మెస్ విశ్వనాథన్ సంగీతం ఈ రోజుకీ చెవులలో మారుమోగేలా ఉంటుంది. ముఖ్యంగా తాళి కట్టు శుభవేళ అన్న ఎస్పీబీ సాంగ్ ఎవర్ గ్రీ. అలాగే దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి అన్న జేసుదాస్ సాంగ్ అయితే వెంటాడుతూనే ఉంటుంది.
