Begin typing your search above and press return to search.

27 ఏళ్ల తర్వాతే బాలీవుడ్ గుర్తించింది.. జ్యోతిక సెన్సేష‌న‌ల్ కామెంట్స్

దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ఎన్నో విజయాలను అందుకున్న నటి జ్యోతిక తాజాగా తన బాలీవుడ్ ప్రయాణంపై చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.

By:  Sravani Lakshmi Srungarapu   |   21 Jun 2026 5:00 AM IST
27 ఏళ్ల తర్వాతే బాలీవుడ్ గుర్తించింది.. జ్యోతిక సెన్సేష‌న‌ల్ కామెంట్స్
X

దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ఎన్నో విజయాలను అందుకున్న నటి జ్యోతిక తాజాగా తన బాలీవుడ్ ప్రయాణంపై చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. దాదాపు మూడు దశాబ్దాల పాటు తమిళ, తెలుగు సినిమాల్లో అగ్రస్థానంలో కొనసాగిన ఆమెకు ఆ 27 ఏళ్ల కాలంలో ఒక్క హిందీ సినిమా ఆఫర్ కూడా రాలేదని వెల్లడించడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

1998లో రిలీజైన దోలి సజా కె రఖ్నా సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన జ్యోతిక, ఆ సినిమా ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో వెంటనే సౌత్ సినిమాల వైపు మళ్లారు. త‌ర్వాత తమిళ సినీ పరిశ్రమలో ఆమె స్టార్ హీరోయిన్‌గా ఎదిగి ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాల్లో నటించారు. అయితే అంతటి స్టార్‌డమ్ ఉన్నప్పటికీ బాలీవుడ్ నుంచి ఎలాంటి అవకాశాలు రాకపోవడం వెనుక ఆసక్తికర కారణాలను ఆమె వివరించారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో జ్యోతిక మాట్లాడుతూ, గత 27 ఏళ్లలో ఒక్కసారి కూడా బాలీవుడ్ నుంచి ఎవరూ త‌న‌ను సంప్రదించలేద‌ని, తాను హిందీ సినిమాలు చేయకూడదని డిసైడ్ అయ్యాన‌ని చాలామంది భావించి ఉండొచ్చ‌ని, కానీ నిజానికి త‌న‌కు ఒక్క స్క్రిప్ట్ కూడా ఆఫర్ కాలేద‌ని ఆమె చెప్పారు.

ఇటీవల సైతాన్, డబ్బా కార్టెల్ వంటి హిందీ ప్రాజెక్ట్‌లతో మళ్లీ బాలీవుడ్‌లో కనిపిస్తున్న జ్యోతిక, మరో ఇంట్రెస్టింగ్ విష‌యాన్ని కూడా వెల్ల‌డించారు. తాను ముంబైకి మకాంను మార్చిన తర్వాతే హిందీ సినిమా అవకాశాలు రావడం ప్రారంభమ‌య్యాయ‌ని, అయితే బాలీవుడ్‌లోకి రావాలనే ఉద్దేశంతో తాను ముంబైకి రాలేద‌ని, త‌న పిల్లలు, తల్లిదండ్రుల కోసం అక్కడికి షిఫ్ట్ అయ్యాన‌ని, కానీ ఆ తర్వాత అవకాశాలు రావడం మొదలైంద‌ని చెప్పారు.

ఇక ఉత్తరాది, దక్షిణాది సినీ పరిశ్రమల మధ్య ఉన్న గీతలు ఇప్పుడు చెరిగిపోతున్నాయని జ్యోతిక అభిప్రాయపడ్డారు. నార్త్, సౌత్ మధ్య ఉన్న దూరం తగ్గింద‌ని, రెండు ఇండస్ట్రీలు మరింత దగ్గరయ్యాయి. అందుకే ఇప్పుడు త‌నకు హిందీ ప్రాజెక్టులు వస్తున్నాయని అనుకుంటున్నాన‌ని ఆమె పేర్కొన్నారు. జ్యోతిక చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో మారుతున్న పరిస్థితులను ప్రతిబింబిస్తున్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకప్పుడు ప్రాంతీయ పరిమితులతో నడిచిన సినీ ప్రపంచం ఇప్పుడు పాన్ ఇండియా దిశగా సాగుతుండగా, జ్యోతిక ఎక్స్‌పీరియెన్స్ ఆ మార్పుకు నిదర్శనంగా నిలుస్తోంది.