జ్వాల గుత్తా - విష్ణు విశాల్ కుమార్తె మీరా మొదటి బర్త్ డే వేడుకలు
భారత బ్యాడ్మింటన్ స్టార్ జ్వాల గుత్తా - తమిళ నటుడు విష్ణు విశాల్ జంట ప్రేమ వివాహం గురించి తెలిసిందే.
By: Sivaji Kontham | 27 April 2026 12:10 AM ISTభారత బ్యాడ్మింటన్ స్టార్ జ్వాల గుత్తా - తమిళ నటుడు విష్ణు విశాల్ జంట ప్రేమ వివాహం గురించి తెలిసిందే. ఈ దంపతులకు ఒక గారాల పట్టీ కూడా ఉంది. చిన్నారి రాకతో ఆ ఇంట్లో సంబరాలు అంబరాన్ని తాకాయి. ఏప్రిల్ 22న వారి గారాల పట్టి `మీరా` మొదటి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. విశేషమేమిటంటే.. అదే రోజు ఈ జంట నాలుగవ వివాహ వార్షికోత్సవం కూడా కావడంతో ఆనందం రెట్టింపు అయింది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని జ్వాల గుత్తా తన ఇన్ స్టాలో ఒక అందమైన కుటుంబ ఫోటోను షేర్ చేస్తూ.. తల్లిదండ్రులుగా తమ ప్రయాణంలోని మధుర అనుభూతులను అభిమానులతో పంచుకున్నారు. మెట్లపై కూర్చుని ఉన్న ఈ జంట మధ్యలో ఎరుపు రంగు దుస్తుల్లో ఉన్న చిన్నారి మీరా ఫోటో ముఖం దాచేసినా కానీ.. నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది.
తల్లిదండ్రులు కావడానికి తాము పడ్డ కష్టాలను.. ముఖ్యంగా ఐవీఎఫ్ ప్రక్రియ ద్వారా ఎదుర్కొన్న సవాళ్లను ఈ సందర్భంగా వారు గుర్తుచేసుకున్నారు. మీరా తమ జీవితాల్లోకి వచ్చాక గడిచిన ఈ ఏడాది కాలం ఎంతో అల్లరితో చిన్న చిన్న సాహసాలతో .. గొప్ప పాఠాలతో నిండిపోయిందని జ్వాల పేర్కొన్నారు. తమ ప్రపంచాన్ని మరింత ఉత్కంఠగా మార్చిన మీరాను దంపతులు ప్రేమగా `లిటిల్ హార్ట్` అని పిలుచుకుంటారు. గతేడాది జూలైలో మొదటిసారిగా పాపను పరిచయం చేస్తూ `మీరా` అంటే `షరతులేని ప్రేమ, శాంతి` అని అర్థమని వివరించారు.
ఈ దంపతుల జీవితంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ఒక కీలక పాత్ర పోషించడం గమనార్హం. జ్వాల - విష్ణు తల్లిదండ్రులు కావడానికి అమీర్ ఖాన్ ఎంతో మార్గదర్శకత్వం వహించారు. ఐవీఎఫ్ చికిత్స సమయంలో ఒక స్పెషలిస్ట్‌ను సిఫార్సు చేయడమే కాకుండా.. ముంబైలో చికిత్స పొందుతున్న పది నెలల కాలంలో జ్వాలకు అమీర్ కుటుంబం ఎంతో అండగా నిలిచింది. అమీర్ తల్లి, సోదరి జ్వాలను తమ సొంత మనిషిలా చూసుకున్నారని విష్ణు విశాల్ గుర్తుచేసుకున్నారు. ఈ అనుబంధం కారణంగానే హైదరాబాద్ వచ్చి మరీ అమీర్ ఖాన్ పాపకు నామకరణం చేయడం విశేషం.
వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. జ్వాల గుత్తా - విష్ణు విశాల్ 22 ఏప్రిల్ 2021న వివాహం చేసుకున్నారు. మొదటి బిడ్డ కోసం నాలుగేళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది. ఇక విష్ణు విశాల్‌కు మొదటి వివాహం ద్వారా `ఆర్యన్` అనే కుమారుడు కూడా ఉన్నాడు. ఇప్పుడు ఐవీఎఫ్‌లో అతడికి రెండో బిడ్డ వరంగా లభించింది. ఐవీఎఫ్ వంటి క్లిష్టమైన ప్రక్రియను ఎంచుకుని దానిని విజయవంతంగా పూర్తి చేయడంలో అమీర్ ఖాన్ ఇచ్చిన స్ఫూర్తిని ఈ జంట ఎప్పటికీ మర్చిపోలేమని చెబుతుంటారు. కష్టకాలంలో తమకు అండగా నిలిచిన వ్యక్తి తమ బిడ్డకు పేరు పెట్టడం తమకు ఎంతో గౌరవంగా అనిపించిందని వారు పేర్కొన్నారు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. విష్ణు విశాల్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అతడు నటించిన `ఆర్యన్` చిత్రం బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన పొందనా.. అతడు స్వయంగా నిర్మించిన `హాట్ స్పాట్ 2` మంచి విజయాన్ని అందుకుంది. త్వరలో తన సూపర్ హిట్ చిత్రం `గట్టా కుస్తీ`కి సీక్వెల్‌గా వస్తున్న `గట్టా కుస్తీ 2` షూటింగ్‌లో పాల్గొననున్నారు. చెల్లా అయ్యావు దర్శకత్వంలో రాబోతున్న ఈ స్పోర్ట్స్ కామెడీ డ్రామాలో ఐశ్వర్య లక్ష్మి మరోసారి అతడి సరసన నటించనుంది.
