Begin typing your search above and press return to search.

హ‌ల్ బుకింగ్ క్ల‌ర్క్ నుంచి నిర్మాత‌గా.. 'జగపతి మూవీ క్రియేషన్స్' అధినేత అస్త‌మ‌యం!

ఆయ‌న సినీనిర్మాత‌గా కొన‌సాగుతున్న క్ర‌మంలోనే చిన్న పిల్ల‌ల కోసం కూడా పౌరాణికాల‌ను తెర‌కెక్కించాల‌ని ప్ర‌య‌త్నించారు.

By:  Sivaji Kontham   |   28 Oct 2026 11:29 PM IST
హ‌ల్ బుకింగ్ క్ల‌ర్క్ నుంచి నిర్మాత‌గా.. జగపతి మూవీ క్రియేషన్స్ అధినేత అస్త‌మ‌యం!
X

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అయిన చలసాని వెంకటేశ్వరరావు అలియాస్ జేవీఆర్ ఏజ్ సంబంధ‌ సమస్యలతో బాధపడుతూ అక్టోబర్ 28న విజయవాడలో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌తో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

సాధారణ సినిమా హాలు బుకింగ్ క్లర్క్‌గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించిన చలసాని వెంకటేశ్వరరావు, అంచెలంచెలుగా ఎదిగి ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, నిర్మాతగా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. `జగపతి మూవీ క్రియేషన్స్` బ్యాన‌ర్ ని స్థాపించి ఇందులో ప‌లు హిట్ సినిమాల‌ను నిర్మించారు. తమ్మారెడ్డి భరద్వాజ దర్శకత్వంలో వినోద్ కుమార్ హీరోగా వచ్చిన యాక్షన్ డ్రామా `నేటి దౌర్జన్యం` (1990), బి. విఠలాచార్య దర్శకత్వంలో వచ్చిన భక్తిరస చిత్రం `కరుణించిన కనకదుర్గ` (1992) వంటి చిత్రాలు ఆయన నిర్మాణ ప్రతిభకు నిదర్శనంగా నిలిచాయి.

ఆయ‌న సినీనిర్మాత‌గా కొన‌సాగుతున్న క్ర‌మంలోనే చిన్న పిల్ల‌ల కోసం కూడా పౌరాణికాల‌ను తెర‌కెక్కించాల‌ని ప్ర‌య‌త్నించారు. ఆయ‌న స్వ‌యంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన బాల‌ల చిత్రం దాన‌వీరశూర‌క‌ర్ణ‌ 2015లో పెద్ద విజ‌యం సాధించింది. ఈ చిత్రంతోనే నందమూరి జానకి రామ్ కుమారుడు మాస్టర్ ఎన్టీఆర్‌ను శ్రీకృష్ణుడిగా పరిచయం చేసారు. దీనికి స్వ‌యంగా ఆయ‌నే నిర్మాత‌. ఈ బాలల చిత్రం అప్పట్లో విశేష ప్రేక్షకాదరణ పొందడమే కాకుండా.. 2015 సంవత్సరానికి గాను `ఉత్తమ బాలల‌ చిత్రం`గా నంది అవార్డును గెలుచుకోవడం ఆయన కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది.

సినిమా నిర్మాణ, పంపిణీ రంగాల్లో ఎన్నో మైలురాళ్లను స్పృశించిన వెంకటేశ్వరరావు తన జీవిత చరమాంకంలో విజయవాడలో వృద్ధాశ్రమాన్ని నడుపుతూ సామాజిక సేవా కార్యక్రమాల్లో తలమునకలయ్యారు. సినిమా పరిశ్రమను నమ్ముకుని.. దాని అభివృద్ధి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఒక నిజమైన సినీ పరిశ్రామికుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోతారు. ఆయన అస్తమయం టాలీవుడ్‌కు తీరని లోటు కాగా.. ఆయన అందించిన సేవలు తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉన్నంతవరకు చిరస్మరణీయంగా ఉంటాయి.