భారతీయ పెళ్లి కూతురికి సడన్ సర్ప్రైజ్ ఇచ్చిన జస్టిన్ బీబర్.. వధువు రియాక్షన్ ఏంటంటే?
2025 ఆగస్టు 31 ఆదివారం రోజున లాస్ ఏంజిల్స్ లో ఒక భారతీయ మహిళ తన వివాహాన్ని బంధువులు, స్నేహితుల మధ్య ఘనంగా జరుపుకుంది.
By: Madhu Reddy | 2 Sept 2025 10:51 AM ISTజస్టిన్ బీబర్.. సంగీత ప్రియులకు ఈయన గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. కెనడియన్ గాయకుడిగా, పాటల రచయితగా సంగీత ప్రపంచాన్ని ఉర్రూతలూగించారు.. 15 సంవత్సరాల వయసులోనే తన మొదటి ఆల్బమ్ ను విడుదల చేసి అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈయన..ఈమధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ మంచి, చెడులపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇదిలా ఉండగా అప్పుడప్పుడు ఈయన చేసే పనుల వల్ల కూడా వార్తల్లో నిలుస్తున్నారని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే తాజాగా ఒక భారతీయ వధువు పెళ్లికి హాజరయ్యి పెళ్లికూతురుని ఒక్కసారిగా ఆశ్చర్యపరిచారు. తన పెళ్లి వేడుకలో జస్టిన్ బీబర్ ను చూసిన ఆమె ఆశ్చర్యంతో అరుపులు, కేకలతో ప్రాంగణాన్ని హోరెత్తించింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
భారతీయ వధువును సర్ప్రైజ్ చేసిన జస్టిన్ బీబర్..
2025 ఆగస్టు 31 ఆదివారం రోజున లాస్ ఏంజిల్స్ లో ఒక భారతీయ మహిళ తన వివాహాన్ని బంధువులు, స్నేహితుల మధ్య ఘనంగా జరుపుకుంది. అయితే ఈ వివాహానికి ఊహించని గెస్ట్ గా విచ్చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు ప్రముఖ సింగర్ జస్టిన్ బీబర్.. ముఖ్యంగా తన పెళ్లికి ఎవరు ఊహించని బహుమతి లభించేసరికి ఆ అమ్మాయి ఆనందంతో ఉబ్బితబ్బిబవుతోంది.. ఇకపోతే జస్టిన్ బీబర్ పెళ్లి కూతుర్ని ఆశ్చర్యపరచడమే కాకుండా ఆ పెళ్ళికి హాజరైన అతిధులను కూడా ఆశ్చర్యపరిచారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
సింపుల్ లుక్ తో ఆకట్టుకున్న జస్టిన్ బీబర్..
అందులో జస్టిన్ బీబర్ చాలా సింపుల్ లుక్ లో.. వైట్ టీ షర్టు బ్లూ కలర్ కోట్ వేసుకొని కనిపించగా.. వధువు చెక్స్ కలిగిన ఆకుపచ్చని చీరకు.. బంగారు వర్ణం బోర్డర్ కలిగిన పట్టుచీరను కట్టుకొని చాలా అందంగా కనిపించింది. ముఖ్యంగా సింపుల్ జువెలరీతో తన లుక్ ను మరింత అద్భుతంగా మార్చేసింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం వీరిద్దరూ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన తీరు అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇక అలాగే వధువుతోపాటు వధువు తరఫు స్నేహితులతో కూడా జస్టిన్ ఫోటోలు దిగగా.. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నెటిజెన్స్ భిన్నాభిప్రాయాలు..
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు ఒక్కొక్కరు ఒక్కోలా ఫోటోలకు కామెంట్లు చేస్తున్నారు. అందులో భాగంగానే.." ఇతడు చాలా గొప్పవాడు" అని ఒక అభిమాని కామెంట్ చేస్తే.. మరొకరు "ఆమె చాలా అదృష్టవంతురాలు.. ఆమె తన జీవితంలో మర్చిపోలేని వివాహ బహుమతిని అందుకుంది " అని కామెంట్ చేశారు. ఇంకొకరు .."అయ్యో .. ఇది చాలా అద్భుతమైన ఘటన. నేను గనుక ఆమె స్థానంలో ఉంటే ఏడుస్తూ ఉండేదాన్ని" అంటూ రాసుకు వచ్చారు. ఇంకొకరేమో" దయచేసి నా పెళ్ళికి కూడా రండి" అంటూ వేడుకున్నారు. ఇలా ఎవరికి వారు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
జస్టిన్ బీబర్ సర్ప్రైజ్ ఇవ్వడం ఇదేం తొలిసారి కాదు..
ఇకపోతే జస్టిన్ బీబర్ ఇలా అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వడం ఇదేం తొలిసారి కాదు. ఒక హై ప్రొఫైల్ వివాహ విందుకు ఆయన భారతదేశానికి కూడా విచ్చేసిన విషయం తెలిసిందే. అలా అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ సంగీత్ లో ఏకంగా ప్రదర్శన ఇచ్చి.. అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ ప్రదర్శనకు పది మిలియన్ డాలర్లు కూడా దక్కించుకున్నట్లు సమాచారం.
