మహిళా వింగ్‌పై పెద్ద హీరోలు గరంగరం?
అయితే ఇందులో హేమ కమిటీ సిఫార్సులను అక్కడ పెద్ద హీరోలు, నిర్మాతలు సెట్స్ లో అమలు చేస్తున్నారా? లేదా? అంటే.. దీనికి సరైన జవాబు లేదు.
By: Sivaji Kontham | 7 Aug 2025 9:21 AM ISTమాలీవుడ్ లో లైంగిక వేధింపులు, సెట్లలో స్త్రీల అసౌకర్యాలపై జస్టిస్ హేమ కమిటీ చాలా పరిశోధించి సమస్య మూలాల్ని బహిర్గతం చేస్తూ కొన్ని పేజీల డాక్యుమెంట్ (రిపోర్ట్) ని రెడీ చేసిన సంగతి తెలిసిందే. ఈ డాక్యుమెంట్ లో చాలా విషయాలు ఇంతకుముందు బయటి ప్రపంచానికి బహిర్గతం అయ్యాయి. అయితే ఇందులో హేమ కమిటీ సిఫార్సులను అక్కడ పెద్ద హీరోలు, నిర్మాతలు సెట్స్ లో అమలు చేస్తున్నారా? లేదా? అంటే.. దీనికి సరైన జవాబు లేదు.
అన్యాయాలను ఎదురించేందుకు..
అయితే పరిశ్రమలో ఎన్నడూ లేని విధంగా మలయాళ చిత్రసీమలో అన్యాయాలను ఎదురించే మహిళా వింగ్ ఒకటి ఏర్పడింది. ఇది మలయాళ పరిశ్రమలో దుశ్శాసనుల భరతం పడుతోంది. ఎక్కడైనా వేధింపులకు పాల్పడినా లేదా స్త్రీల విషయంలో అసభ్యంగా ప్రవర్తించినా, అన్యాయంగా వ్యవహారాలు నడిపిస్తున్నా ఎప్పటికప్పుడు నిలదీసేందుకు కొందరు పేరున్న హీరోయిన్లు డబ్ల్యూసీసీ వేదికగా నడుం కట్టారు. అయితే ఈ వ్యవహారం అక్కడ కొందరు హీరోలకు నచ్చడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ హీరోలు ఎవరు? అనేది అప్రస్తుతం. కానీ పరిశ్రమలో నిజానిజాల్ని నిగ్గు తేల్చాలని, వేధింపులను ఆపాలని ప్రయత్నించే యాక్టివ్ నటీమణులకు కొన్ని ఇబ్బందులు తప్పడం లేదని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు.. ఎదురు తిరిగే మహిళా నటీమణులకు అవకాశాలు కూడా తగ్గిపోయాయని గుసగుస వినిపిస్తోంది.
సెట్స్ లో స్త్రీల సమస్యలపై చర్చ:
ఇటీవల అత్యంత భారీగా నిర్వహించిన `కేరళ ఫిలిమ్ పాలసీ కాన్ క్లేవ్`లో ముఖ్యమంత్రి పినరయి- మోహన్ లాల్ సహా పలువురు సినీపెద్దల సమక్షంలో చాలా పెద్ద విషయాల్ని మాట్లాడారు. చర్చా సమావేశాలు జరిగాయి. ఈ పాలసీలో ఆన్ లొకేషన్ మహిళల భద్రత, సౌకర్యాల కల్పన గురించి చాలా అంశాలు చర్చకు వచ్చాయి. అయితే సెట్స్ లో POSH (లైంగిక వేధింపుల నివారణ) చట్టం సహా, సౌకర్యాల కల్పనకు బాత్రూముల నిర్వహణ, మహిళల విశ్రాంతి రూములు వగైరా ఏర్పాట్లు చేయాలంటూ ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ (WCC) - మహిళా వింగ్ గట్టిగానే డిమాండ్ చేసింది. అంతేకాదు డబ్ల్యూ సీసీ చాలా అంశాలను పర్టిక్యులర్ గా ప్రశ్నిస్తూ, కొత్త నియమాలను అమలు చేయాలని పట్టు పట్టింది. కానీ దీనికి కొందరు హీరోలు, నిర్మాతలు ససేమిరా అని అన్నారట. ఇప్పటికే పరిశ్రమలో మహిళల విషయంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టామని వారు వాదిస్తున్నట్టు తెలిసింది.
వారి మధ్య ఈగో సమస్యలు?
అయితే మాలీవుడ్ నిర్మాతలు, హీరోలు మహిళా రక్షక విభాగానికి వ్యతిరేకమా? అంటే అలాంటిదేమీ లేదు. పెద్ద హీరోల ఈగో కారణంగా సమస్యలు తలెత్తాయని గుసగుస వినిపిస్తోంది. నిజానికి హేమ కమిటీ సిఫార్సుల అనంతరం ప్రతి చిత్ర నిర్మాత మహిళల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే సెట్స్ లో చేయాల్సిన పని గురించి కాకుండా, పదే పదే ఇదే ఇలాంటి విషయాన్ని మహిళా వింగ్ లు ప్రస్థావిస్తుంటే, దీనిపై పెద్ద స్టార్లు, నిర్మాతలు గర్రుగా ఉన్నారని టాక్ వినిపిస్తోంది. ముఖ్యమంత్రితో చర్చా సమావేశం సమయంలో కూడా డబ్ల్యూసీసీతో బడా సినీపెద్దలకు సమస్యలు తలెత్తాయని చెబుతున్నారు.
