Begin typing your search above and press return to search.

ప్రభుత్వానికే అప్పు ఇచ్చిన హీరోయిన్ అత్తగారి కుటుంబం!

బాలీవుడ్ సీనియర్ నటి జూహీ చావ్లా త‌రుచూ అత్యంత ధనవంతులైన నటీమణుల జాబితాలో నిలుస్తుంటారు. ఆమె సంపద అనగానే చాలా మంది ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) లో గల వాటాల గురించే మాట్లాడుకుంటారు.

By:  Srikanth Kontham   |   21 Jun 2026 11:00 PM IST
ప్రభుత్వానికే అప్పు ఇచ్చిన హీరోయిన్ అత్తగారి కుటుంబం!
X

బాలీవుడ్ సీనియర్ నటి జూహీ చావ్లా త‌రుచూ అత్యంత ధనవంతులైన నటీమణుల జాబితాలో నిలుస్తుంటారు. ఆమె సంపద అనగానే చాలా మంది ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) లో గల వాటాల గురించే మాట్లాడుకుంటారు. అయితే హురున్ రిచ్ లిస్ట్ ప్రకారం జూహీ చావ్లా నికర ఆస్తి విలువ దాదాపు 7,790 కోట్లు . ఆమె భర్త జే మెహతా నేతృత్వంలోని మెహతా గ్రూప్ విలువ సుమారు 17,500 కోట్లుగా ఉంది. మెహతా కుటుంబ వ్యాపార మూలాలు శతాబ్ద కాలం నాటివి. గుజరాత్ చరిత్రతో విడదీయరాని అనుబంధం ఉంది. జే మెహతా తాత నాంజీ కాళిదాస్ మెహతా గుజరాత్‌లోని పోర్‌బందర్‌లో జన్మించారు. 13 సంవత్సరాల వయసులోనే ఎలాంటి ఆసరా లేకుండా అపారమైన ఆత్మవిశ్వాసంతో తూర్పు ఆఫ్రికాకు పయనమయ్యారు.

కెన్యాలోని మొంబాసా రేవుకు చేరుకున్నాక తొలుత చిన్న దుకాణాలలో సహాయకుడిగా చేరారు. వ్యాపార మెళకువలను నేర్చుకున్నారు. ఆ తర్వాత క్రమంగా సొంతంగా వస్త్రాలు, ధాన్యాల వ్యాపారంలోకి అడుగుపెట్టారు. కాలక్రమేణా ఉగాండా దేశానికి విస్తరించి అక్కడ చౌడు భూములను సేకరించి చెరకు సాగును ప్రారంభించారు. 1930లో ఉగాండా షుగర్ ఫ్యాక్టరీ లిమిటెడ్ ను స్థాపించడం ద్వారా ఆఫ్రికా ఖండంలోనే అతిపెద్ద పారిశ్రామిక సామ్రాజ్యానికి పునాది వేశారు. ఆఫ్రికాలో వ్యాపారపరంగా ఎంతటి ఉన్నత శిఖరాలను అధిరోహించినప్పటికీ నాంజీ కాళిదాస్ మెహతా స్వదేశంపై తనకున్న ప్రేమను మరువలేదు.

1960వ సంవత్సరంలో అప్పటి ఉమ్మడి బాంబే రాష్ట్రం నుండి గుజరాత్ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయినప్పుడు ఒక చారిత్రాత్మక సంఘటన చోటుచేసుకుంది. కొత్తగా ఏర్పడిన గుజరాత్ రాష్ట్రం ఆరంభంలో తీవ్రమైన ఆర్థిక లోటును.. పరిపాలనాపరమైన ఇబ్బందులను ఎదుర్కొంది. లోహనా ఇంటర్నేషనల్ బిజినెస్ ఫోరమ్ ఛైర్మన్ సతీష్‌భాయ్ విఠలానీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన ప్రకారం ఆ రోజుల్లో గుజరాత్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి కూడా నిధులు లేక సతమతమయింది. అలాంటి తీవ్రమైన చెల్లింపుల సంక్షోభ సమయంలో గుజరాత్ ప్రభుత్వం ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి నాంజీ కాళిదాస్ మెహతాను ఆశ్రయించింది.

ప్రభుత్వం ఎదుర్కొంటున్న కష్టాలను గమనించిన ఆయన తన సొంత నిధుల నుండి రాష్ట్ర ప్రభుత్వానికి భారీ మొత్తంలో అప్పు ఇచ్చి ఆదుకున్నారు. ఒక కుటుంబం ఒక రాష్ట్ర ప్రభుత్వానికే అప్పు ఇచ్చి ఆర్థిక సంక్షోభం నుండి రక్షించడం అనేది అప్పట్లో ఓ అసాధారణమైన విషయంగా నిలిచింది. ఈ ఆర్థిక సహాయం వల్ల గుజరాత్ ప్రభుత్వం తన తక్షణ బాధ్యతలనునెరవేర్చుకోగలిగింది. కొత్త రాష్ట్రంగా స్థిరపడటానికి ఊరట లభించింది. నాంజీ కాళిదాస్ మెహతా కేవలం ఆఫ్రికాకే పరిమితం కాకుండా భారతదేశ పారిశ్రామిక రంగంలోనూ పెట్టుబడులు పెట్టారు. 1930వ దశకంలోనే ఆయన పోర్‌బందర్‌లో టెక్స్‌టైల్ మిల్లులను నిర్మించారు.

తదానంతర కాలంలో సౌరాష్ట్ర సిమెంట్స్ లిమిటెడ్ వంటి సంస్థలను నెలకొల్పి వేలాది మందికి ఉపాధి కల్పించారు. వ్యాపారవేత్తగానే కాకుండా ఆర్యసమాజ్ ప్రతినిధిగా విద్యాలయాలను నిర్మించడం, వెనుకబడిన వర్గాల వారికి ఉద్యోగాలివ్వడం వంటి సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొన్నారు. ఆయన ప్రారంభించిన విస్తృత వ్యాపార వారసత్వాన్ని తర్వాతి తరం వారైన మహేంద్ర మెహతా, ప్రస్తుతం జే మెహతా విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు.

నేడు జే మెహతా సారథ్యంలో మెహతా గ్రూప్ సిమెంట్, చక్కెర, ప్యాకేజింగ్, విద్యుత్ కేబుల్స్, మౌలిక వసతులు, రియల్ ఎస్టేట్ వంటి వివిధ రంగాలలో అంతర్జాతీయంగా దూసుకుపోతోంది. భారతదేశంతో పాటు ఆఫ్రికా, అమెరికా, కెనడా దేశాల్లో విస్తరించి ఉన్న ఈ గ్రూప్, జూహీ చావ్లా , షారూఖ్ ఖాన్‌లతో కలిసి ఐపీఎల్ జట్టు `కోల్‌కతా నైట్ రైడర్స్` ద్వారా క్రీడా రంగంలోనూ ప్రత్యేక ముద్ర వేసింది. వంద సంవత్సరాల క్రితం 13 ఏళ్ల బాలుడిగా ఆఫ్రికా వెళ్లిన నాంజీ కాళిదాస్ మెహతా వేసిన పునాది నేడు వేల కోట్ల రూపాయల బహుళజాతి సామ్రాజ్యంగా ఎదగడమే కాక దేశ చరిత్రలో నిలిచిపోయే కథగా మారింది.