రూ.7790 కోట్ల నికర ఆస్తులతో అత్యంత సంపన్న నటి!
తాజాగా విడుదలైన M3M హురున్ ఇండియా రిచ్ లిస్ట్ రిపోర్ట్ ప్రకారం.. జూహీ నికర ఆస్తుల విలువ ఏకంగా రూ. 7,790 కోట్లకు చేరింది.
By: Sivaji Kontham | 24 Sept 2026 5:16 PM ISTభారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనదైన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న ప్రముఖ నటి జూహీ చావ్లా తాజాగా మరో అరుదైన ఘనతను సాధించారు. వెండితెరపై ఒక ఓ వెలుగు వెలిగిన ఈ నటి ఇప్పుడు సినిమాల కంటే బిజినెస్ రంగంలో అద్భుతమైన విజయాలను అందుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. తాజాగా విడుదలైన M3M హురున్ ఇండియా రిచ్ లిస్ట్ రిపోర్ట్ ప్రకారం.. జూహీ నికర ఆస్తుల విలువ ఏకంగా రూ. 7,790 కోట్లకు చేరింది. 2025లో ఇదే నికర ఆస్తిని కలిగి ఉండగా, 2024 లో మాత్రం కేవలం 4600 కోట్ల నికర ఆస్తులు మాత్రమే జూహీ చావ్లా కలిగి ఉంది. 2024-25 ఏడాదిలో ఏకంగా 3190 కోట్లు పెరగడం లేదా అదనంగా జోడించడం ఒక సంచలనం. ఈ ఏడాది మాత్రం జూహీ తన ఆస్తులకు అదనంగా ఎలాంటి సంపాదనను జోడించలేదు.
ఈ జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయ నటీమణుల్లో అత్యంత సంపన్నురాలిగా జూహీ చావ్లా అగ్రస్థానంలో నిలిచారు. కేవలం నటనకే పరిమితం కాకుండా.. వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడంలో జూహీ చూపిన అంకితభావం ఈ భారీ విజయానికి ప్రధాన కారణం. దేశంలోని అత్యంత సంపన్నులైన `సెల్ఫ్-మేడ్` మహిళల జాబితాలో ఏకంగా ఆరవ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం.
జూహీ చావ్లా ఈ స్థాయికి చేరుకోవడం వెనుక బలమైన వ్యాపార భాగస్వామ్యాలు ఉన్నాయి. తన భర్త జై మెహతాతో కలిసి సాగించిన వ్యాపార ప్రయాణం ఆమె సంపదను భారీగా పెంచింది. అంతేకాకుండా బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌తో కలిసి `రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్`ను స్థాపించడంలో కీలక పాత్ర పోషించారు. అదేవిధంగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఐపీఎల్ ఫ్రాంచైజీ వ్యాపార సామ్రాజ్యంలోనూ ఖాన్‌తో సహభాగస్వామిగా కొనసాగుతున్నారు. ఇదే హురూన్ జాబితాలో షారుఖ్ ఖాన్ సంపద రూ. 12,490 కోట్లుగా పేర్కొనడం గమనార్హం.
ప్రస్తుతం జూహీ చావ్లా సినిమాలు- వెబ్ ప్రాజెక్టుల్లో అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తున్నా.. తన అసలు ఆర్థిక వృద్ధి మాత్రం వ్యాపార రంగంలోనే స్పష్టంగా కనిపిస్తోంది. 90వ దశకంలో తన అందం, అభినయంతో తెలుగు, హిందీ ప్రేక్షకులను అలరించిన నటి.. నేడు వేల కోట్ల సామ్రాజ్యాన్ని విజయవంతంగా నడిపించే పారిశ్రామికవేత్తగా ఎదగడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
వెండితెర క్వీన్ గా ఏలిన జూహీ ఒక నిపుణురాలైన వ్యాపారవేత్తగా సాధించిన ఈ అద్భుతమైన విజయంపై అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అభినందనల వర్షం కురిపిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా వినోదరంగంలో కొనసాగుతూనే.. మరోవైపు కార్పొరేట్.. స్పోర్ట్స్ వెంచర్లలో రాణించడం ద్వారా జూహీ చావ్లా మహిళా సాధికారతకు సరికొత్త నిర్వచనం చెప్పారని ప్రశంసిస్తున్నారు. గడిచిన కొన్నేళ్లుగా వినోద రంగం నుంచి నంబర్ వన్ సంపాదకురాలిగా జూహీ చావ్లా కొనసాగుతున్నారు. తనకు దరిదాపుల్లో కూడా వేరొకరు లేరు.
