ప్రముఖ గాయకుడి మరణం చుట్టూ మిస్టరీ..నలుగురు అరెస్ట్!
ప్రముఖ అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ మరణంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తీవ్రంగా విచారిస్తున్న సంగతి తెలిసిందే.
By: Sivaji Kontham | 3 Oct 2025 1:52 PM ISTప్రముఖ అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ మరణంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తీవ్రంగా విచారిస్తున్న సంగతి తెలిసిందే. అస్సాం పోలీసు సిట్ గురువారం నాడు మరో సంచలన నిర్ణయంతో చర్చల్లోకి వచ్చింది. గార్గ్ మ్యూజిక్ బ్యాండ్ లో కీలక సహచరుడు శేఖర్ జ్యోతి గోస్వామి, సహ-గాయకుడు అమృత్‌ప్రవ మహంతను సిట్ అధికారులు అరెస్ట్ చేసారు. ఈ కేసులో మొత్తం నలుగురిని అరెస్ట్ చేసి విచారించడం ఇప్పుడు చర్చగా మారింది.
జుబిన్ గార్గ్ సింగపూర్ విహారయాత్రలో ఒక పడవపై పార్టీలో ఉన్న సమయంలో ఈతకు వెళ్లారు. అక్కడ నీళ్లలో మునిగి ఊపిరాడక మరణించారని కథనాలొచ్చాయి. దీనిని అనుమానాస్పద మృతిగా పరిగణించి దర్యాప్తు బృందం విచారిస్తోంది. సెప్టెంబర్ 19న నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్ సందర్భంగా యాచ్ (పడవ) పార్టీలో గోస్వామి - మహంత ఇద్దరూ గార్గ్‌తో ఉన్నారు. గార్గ్ ఈతకు వెళ్లి ఎంతకూ బయటకు రాకపోగా, నీటిలో తేలుతూ కనిపించారు.
ఇప్పుడు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పరిశీలనలో కొన్ని విషయాలు బహిర్గతమయ్యాయి. గార్గ్ సన్నిహితుడైన గోస్వామి వీడియోలలో గార్గ్‌కు చాలా దగ్గరగా ఈత కొడుతున్నట్లు కనిపించగా, మహంత తన సెల్‌ఫోన్‌లో మొత్తం సంఘటనను రికార్డ్ చేసినట్లు సిట్ పోలీసులు తెలిపారు. వారిద్దరినీ గత ఆరు రోజులుగా విచారిస్తున్నామని అధికారులు వెల్లడించారు.
శుక్రవారం చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు వారిని 14 రోజుల సిఐడి (క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్) కస్టడీకి పంపింది. గోస్వామి, మహంతలపై హత్య, నేరపూరిత కుట్ర, నిర్లక్ష్యం వల్ల మరణానికి కారణమైన నేరాల కింద అభియోగాలు మోపారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని సిట్ అధికారులు తెలిపారు. అయితే నేరం ఇంకా రుజువు కావాల్సి ఉంది. దీనికి సంబంధించిన కీలక ఆధారాలను అధికారులు ఇంకా ఛేజిక్కించుకోలేదు.
త్వరలోనే అధికారులు సింగపూర్ లో ఘటనా స్థలిని సందర్శించడానికి అనుమతి పొందే ప్రయత్నాలు చేస్తున్నారు. సింగపూర్ నుండి ఆధారాలు సేకరించడానికి బృందం వేచి ఉందని సిట్ అధికారులు తెలిపారు.
