Begin typing your search above and press return to search.

RRR హీరోలు.. ఈసారి అయినా కొడతారా?

బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా రేంజ్ లో భారీ విజయాన్ని అందుకున్న స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇప్పుడు తమ తదుపరి అప్ కమింగ్ ప్రాజెక్టులతో మరోసారి బాక్సాఫీస్‌ పై దండయాత్రకు సిద్ధమవుతున్నారని చెప్పాలి.

By:  M Prashanth   |   13 April 2026 9:00 PM IST
RRR హీరోలు.. ఈసారి అయినా కొడతారా?
X

బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా రేంజ్ లో భారీ విజయాన్ని అందుకున్న స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇప్పుడు తమ తదుపరి అప్ కమింగ్ ప్రాజెక్టులతో మరోసారి బాక్సాఫీస్‌ పై దండయాత్రకు సిద్ధమవుతున్నారని చెప్పాలి. దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ ద్వారా ఇద్దరూ రూ.1000 కోట్ల హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఆ విజయాన్ని సోలోగా రిపీట్ చేయగలరా అన్నది సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం తారక్.. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా సినిమా డ్రాగన్ లో నటిస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతుండగా, ఈ ఏడాదిలోనే విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. కేజీఎఫ్ సిరీస్‌తో భారీ మార్కెట్ సంపాదించిన ప్రశాంత్ నీల్ డైరెక్షన్ కావడంతో ఆ ప్రాజెక్ట్‌ పై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే, ఆయన ప్రస్తుతం దర్శకుడు బుచ్చిబాబు సనాతో పెద్ది సినిమాను చేస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చిత్రం కూడా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. షూటింగ్ దశలో ఉన్న ఆ సినిమాను ఏప్రిల్ 30న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. రిలీజ్ మళ్లీ పోస్ట్ పోన్ అవుతుందని వార్తలు వస్తున్నా.. అధికారికంగా ఎలాంటి అనౌన్స్మెంట్ లేదు.

అయితే ఇద్దరు హీరోల సినిమాలపైనా ప్రస్తుతం ఆడియన్స్ తో పాటు అభిమానుల్లో మంచి బజ్ ఉంది. రెండు చిత్రాలు కూడా భారీ విజయాలు సాధిస్తాయని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఆ రెండు సినిమాలు రూ.1000 కోట్ల వసూళ్ల మార్క్‌ ను అందుకుంటాయా అన్నదానిపై చర్చలు నడుస్తున్నాయి. అలాంటి సమయంలో ఒక విషయం గమనించాల్సిందే.

నిజానికి తారక్, చరణ్ ఇద్దరూ ఆర్ఆర్ఆర్ మూవీతో ఇప్పటికే రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరినప్పటికీ, ఆ సినిమా మల్టీస్టారర్ కావడం గమనార్హం. అందుకే సోలో హీరోలుగా ఈ మైలురాయిని ఎప్పుడు అందుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం రూపొందుతున్న డ్రాగన్, పెద్ది సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్నాయి.

కాబట్టి రూ.1000 కోట్ల మార్క్‌ ను అందుకునే ఛాన్స్ ఉంటుంది. కానీ అది అంత సులభం కాదు. కథ, కంటెంట్, మేకింగ్, ప్రమోషన్ అన్నీ కలిపి ప్రేక్షకులను ఆకట్టుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా నార్త్ మార్కెట్‌ లో మంచి స్పందన రావడం కీలకం. అప్పుడే ఆ రేంజ్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదే సమయంలో ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్, తారక్.. గేమ్ ఛేంజర్, దేవర సినిమాలు చేసినా అవి రూ.1000 కోట్ల హిట్స్ గా నిలవలేదు. దీంతో ఇప్పుడు తమ అప్ కమింగ్ సినిమాలు డ్రాగన్, పెద్దితో ఆ ఫీట్ సాధిస్తారా లేదా అన్నది ఆసక్తిగా మారింది.