Begin typing your search above and press return to search.

ఆరు నెలల గ్యాప్‌లో ఎన్టీఆర్‌ మూడు సినిమాలు సాధ్యమా?

2026లో ఎన్టీఆర్‌ సినిమా విడుదల కాకపోవడంతో అభిమానులకు నిరీక్షణ తప్పలేదు. అయితే 2027లో ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలోని ‘డ్రాగన్‌’ రెండు భాగాలుగా రానున్నట్లు సమాచారం. తొలి భాగం జూన్‌ 11న విడుదల కానుండగా, రెండో భాగాన్ని డిసెంబర్‌ 2027లో తీసుకురావాలని ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అనిల్‌ రావిపూడితో ఎన్టీఆర్‌ సినిమా 2028 సంక్రాంతికి వచ్చే అవకాశం ఉందనే ప్రచారం అభిమానుల్లో ఆసక్తి పెంచుతోంది.

By:  Ramesh Palla   |   17 Nov 2026 11:35 AM IST
ఆరు నెలల గ్యాప్‌లో ఎన్టీఆర్‌ మూడు సినిమాలు సాధ్యమా?
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ నటించిన సినిమాలు ఏవీ 2026లో విడుదల కాలేదు. ఈ ఏడాది మరో నెలన్నర రోజులు ఉంది.. ఈ గ్యాప్‌లోనూ ఆయన సినిమా విడుదల అయ్యే పరిస్థితి లేదు. అంటే 2026లో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కి ఎదురు చూపులే మిగిలాయి. 2025లో వార్‌ 2, అంతకు ముందు 2024లో దేవర 1 సినిమాలతో ఎన్టీఆర్‌ వచ్చాడు. ఆ రెండు సినిమాలు నిరాశ పరిచిన విషయం తెల్సిందే. ఎన్టీఆర్‌ చివరిగా 2022లో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో హిట్ దక్కించుకున్నాడు. ఇక ఎన్టీఆర్‌ సోలో హిట్‌ కొట్టి దాదాపుగా ఎనిమిది ఏళ్లు అయిందని అభిమానులు నిటూర్చుతూ లెక్కలు వేసుకుంటున్నారు. 2018లో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ సినిమాతో ఎన్టీఆర్‌ హిట్ దక్కించుకున్నాడు. అప్పటి నుంచి ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఎదురు చూస్తూనే ఉన్నారు. ఫైనల్‌గా వారి ఎదురు చూపులకు తెర పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2027లో ఎన్టీఆర్‌ డ్రాగన్‌ తో భారీ బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని తన ఖాతాలో వేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఎన్టీఆర్‌ డ్రాగన్‌ రెండు పార్ట్‌లుగా రిలీజ్‌...

డ్రాగన్‌ సినిమాను రెండు పార్ట్‌లుగా విడుదల చేయబోతున్నారు. మొదటి పార్ట్‌ను 2027 జూన్‌ 11న విడుదల చేయబోతున్నారు. రెండో పార్ట్‌ను 2027 డిసెంబర్‌లోనే విడుదల చేయాలని దర్శకుడు ప్రశాంత్‌ నీల్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడట. అందుకు ఎన్టీఆర్‌ సైతం రెడీ అన్నట్లు తెలుస్తోంది. డిసెంబర్‌ మిస్ అయితే 2028 సమ్మర్‌కు కచ్చితంగా డ్రాగన్‌ 2 ను విడుదల చేయడం కన్ఫర్మ్‌. ఒకవేళ డ్రాగన్ 2 సినిమా 2028 సమ్మర్‌కు వాయిదా పడితే రెండు పార్ట్‌ల మధ్యలో ఎన్టీఆర్‌ మరో సినిమాతో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇటీవలే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎన్టీఆర్‌ సినిమా కన్ఫర్మ్‌ అయిన విషయం తెల్సిందే. ఆ సినిమాను 2028 సంక్రాంతికి విడుదల చేసే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆ సినిమాకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ కచ్చితంగా 2028 సంక్రాంతికి ఎన్టీఆర్‌-రావిపూడి మూవీ ఉంటుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.

ప్రశాంత్‌ నీల్, ఎన్టీఆర్‌ కాంబో మూవీ...

2027 జూన్‌ నుంచి 2028 సమ్మర్ వరకు ఎన్టీఆర్‌ నుంచి మూడు సినిమాలు రాబోతున్నాయి. ఒకవేళ డ్రాగన్‌ సినిమా 2027 డిసెంబర్‌లో వస్తే కేవలం ఆరు నెలల గ్యాప్‌లో ఎన్టీఆర్‌ మూడు సినిమాలు విడుదల అవ్వనున్నాయి. జూన్‌లో డ్రాగన్‌ 1, డిసెంబర్‌లో డ్రాగన్‌ 2, జనవరిలో ఎన్టీఆర్-రావిపూడి సినిమాలు విడుదల కానున్నాయి. అంటే దాదాపు ఆరు నెలల కాలంలో ఎన్టీఆర్‌ నుంచి మూడు సినిమాలు విడుదల కానున్నాయి. ఒకవేళ డ్రాగన్‌ 2 సినిమా డిసెంబర్‌ 2027లో విడుదల లేకుంటే అప్పుడు కూడా ఏడాది కాలంలో ఎన్టీఆర్‌ మూడు సినిమాలు విడుదల అయినట్లు అవుతుంది. మొత్తానికి రాబోయే ఏడాదిలో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ కి ఫుల్‌ మీల్స్ అనడంలో సందేహం లేదు. ఆకలితో ఉన్న ఫ్యాన్స్‌కి రెండు మూడు ప్యాకెట్ల ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీని ఎన్టీఆర్‌ వడ్డించబోతున్నట్లుగా మూడు సినిమాలు రాబోతున్నాయి.

ఎన్టీఆర్‌, అనిల్ రావిపూడి మూవీ సంక్రాంతికి..

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రాబోతున్న 'డ్రాగన్‌' సినిమా కోసం ఎన్టీఆర్‌ పూర్తిగా లుక్‌ చేంజోవర్‌ అయిన విషయం తెల్సిందే. ఇప్పటికే డ్రాగన్‌ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ప్రశాంత్‌ నీల్‌ కేజీఎఫ్‌ ప్రాంచైజీతో పాటు సలార్‌ తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో డ్రాగన్‌ సినిమాకి పాన్ ఇండియా రేంజ్‌లో అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ డ్రాగన్‌ సినిమాకు రూ.1000 కోట్ల వసూళ్లు ఖాయం అని ధీమాగా ఉన్నారు. ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోతున్న సినిమా విషయంలోనూ అదే హడావుడి నెలకొంది. అనిల్ రావిపూడి వరుసగా బ్లాక్‌ బస్టర్‌ విజయాలను సొంతం చేసుకుంటున్న విషయం తెల్సిందే. అందుకే 2028 సంక్రాంతికి కూడా కచ్చితంగా ఎన్టీఆర్‌తో అనిల్ రావిపూడి బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. కనుక ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కి మూడు సినిమాలతో ఫుల్‌ టు బిందాస్ అన్నట్లుగా వినోదాల విందు ఖాయం.