Begin typing your search above and press return to search.

NTR భుజానికి స్వల్ప గాయం.. కంగారు పడాల్సిన పనిలేదని ప్రకటన!

ఓ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతున్న సమయంలో దురదృష్టవశాత్తూ ఆయన భుజానికి గాయమైనట్లు తారక్ అధికారిక పిఆర్ టీమ్- కార్యాలయం ఒక ప్రకటన ద్వారా స్పష్టం చేసింది.

By:  Sivaji Kontham   |   28 July 2026 9:08 AM IST
NTR భుజానికి స్వల్ప గాయం.. కంగారు పడాల్సిన పనిలేదని ప్రకటన!
X

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ షూటింగ్ సమయంలో ప్రమాదవశాత్తూ గాయపడ్డారు. ఓ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతున్న సమయంలో దురదృష్టవశాత్తూ ఆయన భుజానికి గాయమైనట్లు తారక్ అధికారిక పిఆర్ టీమ్- కార్యాలయం ఒక ప్రకటన ద్వారా స్పష్టం చేసింది. సెట్లో జిమ్ వర్కవుట్స్ చేస్తున్న క్రమంలో గానీ లేదా భారీ యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని క‌థ‌నాలొస్తున్నాయి. ఈ వార్త బయటకు రావడంతో ఎన్టీఆర్ అభిమానులు, సినీ వర్గాలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

ప్రస్తుతం ఎన్టీఆర్‌కు ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించినట్లు ఆయన టీమ్ వెల్లడించింది. ప్రముఖ వైద్యులు డాక్టర్ జే మధుసూధనరావు - డాక్టర్ ఆర్.ఏ. పూర్ణచంద్ర తేజస్వి నేతృత్వంలోని నిపుణులైన వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని, భుజం గాయాన్ని నిశితంగా పరిశీలిస్తోంది. గాయం తీవ్రతను పరిశీలించిన వైద్యులు ఆయనకు తక్షణమే 6 నుండి 8 వారాల పాటు నిరంతర విశ్రాంతి అవసరమని క‌చ్చితమైన సలహా ఇచ్చారు.

వైద్యుల సూచనల మేరకు ఎన్టీఆర్ కోలుకోవడానికి దాదాపు రెండు నెలల సమయం పడుతుండటంతో.. ప్రస్తుతం నటిస్తున్న సినిమా షూటింగ్ షెడ్యూల్స్ తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. ప్రస్తుతం ప్లాన్ చేసిన భారీ యాక్షన్ సీక్వెన్సెస్ , అవుట్‌డోర్ షూటింగ్స్‌ను ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాతే తిరిగి ప్రారంభించాలని చిత్రబృందాలు నిర్ణయించిన‌ట్టు తెలుస్తోంది. దీంతో నిర్మాతలు నటుడి ఆరోగ్యానికే మొదటి ప్రాధాన్యత ఇస్తూ షెడ్యూల్స్‌ను రివైజ్ చేస్తున్నారు.

అయితే ఇది కేవలం స్వల్ప గాయమేనని, అభిమానులు ఎలాంటి ఆందోళన లేదా కంగారు పడాల్సిన అవసరం లేదని ఎన్టీఆర్ సన్నిహిత వర్గాలు భరోసా ఇచ్చాయి. సరైన విశ్రాంతి, ఫిజియోథెరపీ తర్వాత తారక్ పూర్వపు ఎనర్జీ - హెవీ జోష్‌తో మళ్లీ సెట్స్‌లోకి అడుగుపెడతారని ఆయన టీమ్ ధీమా వ్యక్తం చేసింది. యంగ్ టైగర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ ప్రముఖులు `గెట్ వెల్ సూన్` సందేశాలు పంపుతున్నారు. ఎన్టీఆర్- ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్ లో భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ డ్రాగ‌న్ చిత్రీక‌రణ ద‌శ‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే.