ట్రెండీ టాక్: స్టార్ హీరోల ఫ్యాన్స్ ఇకనైనా తగ్గుతారా?
తెలుగు చిత్ర పరిశ్రమలో అభిమానం అనేది ఒక ఎమోషన్. కానీ ఈ అభిమానం కాస్తా హద్దులు దాటి ఫ్యాన్ వార్స్ కు దారితీసే పరిస్థితులను ఇంతకుముందు చూసాం.
By: Sivaji Kontham | 8 March 2026 11:21 PM ISTతెలుగు చిత్ర పరిశ్రమలో అభిమానం అనేది ఒక ఎమోషన్. కానీ ఈ అభిమానం కాస్తా హద్దులు దాటి ఫ్యాన్ వార్స్ కు దారితీసే పరిస్థితులను ఇంతకుముందు చూసాం. ఒక్కోసారి తమ ఫేవరెట్ హీరోకే విసుగు తెప్పించేలా ఫ్యాన్స్ ప్రవర్తన కూడా ఇబ్బందికరంగా మారుతోంది.
ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాల్గొనే బహిరంగ వేదికలపై అభిమానుల ప్రవర్తన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తారక్ స్టేజీపై ఉన్నారంటే చాలు.. వేదికపై ఎవరు మాట్లాడుతున్నా వినిపించుకోకుండా నినాదాలతో హోరెత్తించడం పరిపాటిగా మారింది. గతంలో చాలా సార్లు తారక్ ఉన్న వేదికలపై అతిథులు మాట్లాడేప్పుడు నినాదాల హోరు సమస్యాత్మకంగా మారేవి. ఇంతకుముందు `వార్ 2` వేదికపై బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ మాట్లాడుతుంటే, తారక్ ఫ్యాన్స్ చేసిన నినాదాల వల్ల ఆయన ప్రసంగానికి ఆటంకం కలిగింది. ఇప్పుడు ప్రముఖ వైద్యులు, `కిమ్స్` ఆస్పత్రుల అధినేత డాక్టర్ గురవారెడ్డికి కూడా అదే తరహా అనుభవం ఎదురవ్వడం విచారకరం.
తాజాగా బెంగళూరులోని కిమ్స్ హాస్పిటల్ కొత్త బ్రాంచ్ ఆరంభోత్సవ వేడుకలో తారక్ ఒక విభిన్నమైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు. డాక్టర్ గురవారెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో అభిమానులు విరామం లేకుండా `తారక్.. తారక్..` అంటూ కేకలు వేయడంతో జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర అసహనానికి గురయ్యారు. ఒక పక్కన అతిథులు మాట్లాడుతుంటే ఇలా చేయడం పద్ధతి కాదని భావించిన ఎన్టీఆర్ అభిమానుల వైపు సీరియస్‌గా చూస్తూ `క్వయిట్.. క్వయిట్` అంటూ వారించే ప్రయత్నం చేసారు. తనను చూడటానికి వచ్చిన వారిపై ఆయన అలా కోప్పడాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. ప్రేమ, అభిమానం ఉండటం తప్పు కాదు కానీ అది ఎదుటివారికి లేదా స్వయంగా ఆ హీరోలకే ఇబ్బంది కలిగించేలా ఉండకూడదు.
ఇంకా ఫ్యాన్ వార్స్ ఎగ్జిస్టెడ్?
ఇప్పటికీ ఫ్యాన్ వార్స్ ముగిసిపోలేదు. టాలీవుడ్ అగ్ర హీరోలు పవన్ కల్యాణ్, మహేష్ బాబు అభిమానుల మధ్య సోషల్ మీడియా వాగ్వాదాల గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు పవన్ రాజకీయాల్లోకి వెళ్లాక ఆ వేడి కాస్త తగ్గింది కానీ.. అది ఎప్పటికీ ఎగ్జిస్టెడ్. అలాగే ప్రభాస్ వర్సెస్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మధ్య జరిగే పోరు కూడా తరచుగా వార్తల్లో నిలుస్తుంటుంది. ఇటీవల ఈ పరిస్థితిలో కొంత మార్పు వచ్చినట్టే కనిపిస్తున్నా.. అప్పుడప్పుడు ఈ ధోరణి రిపీటవ్వడం చూస్తున్నాం.
కేవలం సీనియర్ స్టార్లే కాకుండా గ్లోబల్ స్టార్స్ రామ్ చరణ్ .. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానుల మధ్య కూడా అప్పుడప్పుడు వాగ్వాదాలు చోటుచేసుకోవడం ఆశ్చర్యం కలిగించింది. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా కొన్నిసార్లు సోషల్ మీడియాలలో అదుపు తప్పి కామెంట్లు చేయడం చర్చనీయాంశమే. తమ అభిమాన హీరోపై ప్రేమ కురిపిస్తే సరే కానీ.. ఇతర హీరోలపై శృతిమించి చెలరేగిపోవడమే ఇబ్బందికరం.
ఎవరికీ ఏ ఉపయోగం లేదు:
ఈ రోజుల్లో సోషల్ మీడియాలో జరిగే ఫ్యాన్ వార్స్ వల్ల ఎవరికీ లాభం లేదు. నిజానికి టాలీవుడ్ హీరోలందరూ ఒకరితో ఒకరు ఎంతో స్నేహపూర్వకంగా ఉంటున్నారు. ఒకరి సినిమాలను మరొకరు అభినందించుకుంటూ, పరిశ్రమ అభివృద్ధి కోసం కలిసి పని చేస్తున్నారు. హీరోలే అంతా కలిసి మెలిసి ఉన్నప్పుడు అభిమానులు మాత్రం వర్గాలుగా విడిపోయి గొడవ పడటం వల్ల ఉపయోగం లేదనే విమర్శలున్నాయి.
నిజానికి అభిమానుల ప్రవర్తన మునుపటితో పోలిస్తే బెటర్ అయింది. కానీ ఇంకా కొన్ని సమస్యలున్నాయి. అభిమానులు మరింత పరిణతితో మెలగాల్సి ఉంటుంది. ప్రవర్తనను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం థియేటర్ల వద్ద లేదా సోషల్ మీడియాలో చెలరేగడం అభిమానం కాదు.. తమ హీరోకి గౌరవం వచ్చేలా ప్రవర్తించడం అసలైన అభిమానం. వేదికలపై పెద్దలు మాట్లాడుతున్నప్పుడు నిశ్శబ్దంగా ఉండటం, తోటి హీరోలను గౌరవించడం వంటివి అలవర్చుకోవాల్సి ఉంటుంది. అనవసరమైన ఫ్యాన్ వార్స్ ఆపి, ఆరోగ్యకరమైన వాతావరణంలో సినిమాలను ఆస్వాధించడమే సినీ పరిశ్రమకు, ఆ హీరోలకు మనం ఇచ్చే నిజమైన గౌరవం.
